తెలంగాణ

telangana

తాలిబన్లను ఉద్దేశించి మోదీ కీలక వ్యాఖ్యలు!

By

Published : Aug 20, 2021, 12:31 PM IST

Updated : Aug 20, 2021, 4:24 PM IST

గుజరాత్​లోని సోమనాథ్​లో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సోమనాథ్​ ఆలయంపై గతంలో జరిగిన దాడులను గుర్తు చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమేనని, వారి ఉనికి శాశ్వతం కాదని తెలిపారు. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో వారి పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

PM Modi, Somnath Temple
ప్రధాని మోదీ, సోమనాథ్​ ఆలయం

విధ్వంసక శక్తులు, ఉగ్రవాదం ద్వారా అధికారం చెలాయించాలనే భావజాలాన్ని నమ్మే వ్యక్తులు కొంత కాలం ఆధిపత్యం చలాయించినా, వారి ఉనికి శాశ్వతం కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మానవత్వాన్ని ఎప్పటికీ అణచివేయలేరని స్పష్టం చేశారు. గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్​ ఆలయానికి చెందిన రూ.83 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్​గా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

అఫ్గానిస్థాన్​లో తాలిబన్​లు అధికారాన్ని చేజిక్కించుకున్న క్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

" సోమనాథ్​ ఆలయాన్ని చాలా సార్లు ధ్వంసం చేశారు. విగ్రహాలను అపవిత్రం చేశారు. ఆలయ ఉనికిని రూపుమాపేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాడి జరిగిన ప్రతిసారీ రెట్టింపు వైభవాన్ని ప్రదర్శించింది. అది మనకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది. విధ్వంసాన్ని సృష్టించే మూకలు, ఉగ్రవాద సిద్ధాంతాలతో రాజ్యస్థాపన నమ్మే వ్యక్తులు కొంత కాలం ఆధిపత్యం చలాయించవచ్చు. కానీ, వారి ఉనికి శాశ్వతం కాదు. అది గతంలో సోమనాథ ఆలయం ధ్వంసం చేసిన సమయాల్లో నిజమని తేలింది. ఇప్పుడు కూడా అదే నిజం "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రయాణ, పర్యటక పోటీతత్వ సూచీలో 2013లో 65వ స్థానంలో ఉన్న భారత్​ 2019 నాటికి 34వ స్థానానికి చేరుకుందన్నారు మోదీ. పర్యటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అది కూడా యువతకు ఉపాధి కల్పిస్తుందని సూచించారు. చరిత్ర నుంచి ఎంతో నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

కీలక ప్రాజెక్టులు

ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యంగా సోమనాథ్​ యాత్ర, సోమనాథ్​ ఎగ్జిబిషన్​ సెంటర్​, పార్వతీ ఆలయం, పాత జునా సోమనాథ్​ ఆలయ పునరుద్ధరణ వంటివి ఉన్నాయి. శ్రీ సోమనాథ్​ ట్రస్ట్​(ఎస్​ఎస్​టీ) ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు ప్రధాని. ప్రధాన ఆలయం వద్ద రూ.30 కోట్లతో పార్వతీ దేవీ ఆలయం నిర్మిస్తున్నారు. సోమనాథ్​ ఆలయం వెనుక సముద్ర తీరంలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కిలోమీటర్​ పొడవైన 'సముద్ర దర్శనం' నడక మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి:Viral News: దశావతారాల గుర్తులతో తాబేలు- భక్తుల పూజలు

Last Updated : Aug 20, 2021, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details