తెలంగాణ

telangana

మూడు క్రిమినల్​ బిల్లులకు ఆమోదం- పార్లమెంట్​ నిరవధిక వాయిదా

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 8:29 PM IST

Updated : Dec 21, 2023, 10:56 PM IST

Parliament Sine Die Today : పార్లమెంట్​ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కీలకమైన మూడు క్రిమినల్​ బిల్లులు సహా టెలికాం, ఈసీ బిల్లలను ఆమోదించిన తర్వాత ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

parliament sine die today
parliament sine die today

Parliament Sine Die Today :బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకువచ్చిన మూడు క్రిమినల్​ బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం పార్లమెంట్​ నిరవధికంగా వాయిదా పడింది. లోక్​సభలో ఆమోదం పొందిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు రాజ్యసభ పచ్చజెండా ఊపింది. అనంతరం రాజ్యసభ వాయిదా వేశారు ఛైర్మన్​ జగదీప్ ధన్​ఖడ్​. రాష్ట్రపతి సంతకం అనంతరం భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత BNSS, భారతీయ సాక్ష్యా-BS చట్టాలుగా మారనున్నాయి.

రీ డ్రాఫ్ట్‌ అయిన 3 బిల్లులను ఆమోదించే తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా బ్రిటిష్‌ పార్లమెంటులో తయారు చేసిన ఈ చట్టాలకు ప్రధాని మోదీ 75 ఏళ్ల తర్వాత చరమగీతం పాడాలనుకున్నారని చెప్పారు. బ్రిటిష్‌ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు వివరించారు. కొత్తగా తీసుకొచ్చే చట్టాల ముఖ్యోద్దేశం ప్రజలను శిక్షించడం కాదనీ, న్యాయం అందించడమని పేర్కొన్నారు. FIR నమోదు నుంచి తీర్పు వరకు అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉండేలా రూపొందించినట్లు చెప్పారు. ఈ చట్టాల అమలుతో మూడేళ్లలో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని స్పష్టం చేశారు.

ఈ బిల్లుతో పాటు దేశ భద్రతను ప్రమాదం తలెత్తిన సమయంలో టెలికమ్యూనికేషన్​ సేవలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకునేలా ప్రవేశపెట్టిన టెలికాం బిల్లును పార్లమెంట్​ ఆమోదించింది. కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్​ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టగా స్వల్పకాలిక చర్చతోనే బిల్లుకు ఆమోదం తెలిపింది రాజ్యసభ. బుధవారమే ఈ బిల్లుకు లోక్​సభ పచ్చజెండా ఊపింది. ఆ తర్వాత ప్రెస్​ రిజిస్ట్రేషన్​ ఆఫ్​ పిరియాడికల్స్​ బిల్లు 2023కు సైతం ఆమోదం తెలిపిన తర్వాత లోక్​సభ వాయిదా పడింది.

ఈసీ బిల్లుకు లోక్​సభ ఆమోదం
మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌లను నియమించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. విపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో స్వల్పకాలిక చర్చతోనే బిల్లుకు ఆమోదం లభించింది. సీఈసీ, ఈసీల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం, వేతనాలకు సంబంధించిన అంశాలను పొందుపర్చిన ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. కొత్త బిల్లు ప్రకారం సెర్చ్‌, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహిస్తాయి. ఆమోదానికి ముందు చర్చలో పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 1991 చట్టంలో CEC, ECల సేవా నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయన్నారు. గత చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామన్నారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా బిల్లుందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదముద్ర పడింది.

సెంచరీ కొట్టిన ఎంపీల సస్పెన్షన్
మరోవైపు లోక్​సభలో సస్పెన్షన్​కు గురైన సభ్యుల సంఖ్య 100కు చేరింది. ఇప్పటికే 97 మంది సభ్యులను సస్పెండ్​ చేయగా, తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్​ ఎంపీలపై వేటు పడింది. డీకే సురేశ్​, దీపక్​ బైజ్, నకుల్​ నాథ్​ను సస్పెండ్​ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారల మంత్రి ప్రతిపాదించగా స్పీకర్​ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభల్లో కలిపి ఈ సంఖ్య 146కు చేరింది.

'పార్లమెంటులో ఉపరాష్ట్రపతి కులతత్వాన్ని రగిల్చారు'- విపక్షాల నిరసనలో ఖర్గే

మూడు క్రిమినల్​ బిల్లులకు లోక్​సభ ఆమోదం- బ్రిటిష్ కాలంనాటి సెక్షన్లకు చెక్!

Last Updated :Dec 21, 2023, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details