Opposition MPs Protest : పార్లమెంటులో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కులతత్వాన్ని రగిల్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. టీఎంసీ ఎంపీ చేసిన మిమిక్రీ అవమానించే విధంగా ఉందంటూ, పైగా దానిని తన సామాజిక వర్గానికి, అలాగే రైతాంగానికి ఆపాదించడం సరికాదని ఆయన హితవు పలికారు. మరోవైపు ఉభయ సభలను సజావుగా సాగించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని కేంద్రంపై మండిపడ్డారు. 'లోక్సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించిన అంశాన్ని మేము సభలో లేవనెత్తాలనుకుంటున్నాము. అస్సలు ఇలా ఎందుకు జరిగింది? దీనికి ఎవరు బాధ్యులనే విషయాలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో వివరణ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము' అని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని ఎక్కడెక్కడో మాట్లాడతారు కానీ లోక్సభ, రాజ్యసభకు మాత్రం వచ్చి మాట్లాడరని ఆయన ధ్వజమెత్తారు.
"పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై సభలో మాట్లాడేందుకు మమ్మల్ని అనుమతించాలని పదే పదే ఇరు సభల సభాపతులను కోరుతున్నాము. కానీ వారు మాకు అనుమతి ఇవ్వట్లేదు. మేము కాదు అధికార పార్టీ ఎంపీలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని, హోంమంత్రి పార్లమెంటు వెలుపల మాట్లాడడం సభ ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమే."
- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఇక 143 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ భవనం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు ప్రతిపక్ష ఎంపీలు. శుక్రవారం కూడా సస్పెన్షన్కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ర్యాలీని చేపడతామని ఖర్గే పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనైతిక, చట్టవిరుద్ధమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో నిరసనలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఇదీ జరిగింది
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా డిసెంబర్ 13న ఇద్దరు దుండగులు లోక్సభ ఛాంబర్లోకి చొరబడి తీవ్ర అలజడి సృష్టించారు. ఈ ఘటనపై వివరణ కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారనే కారణంతో అటు రాజ్యసభ, ఇటు లోకసభలో కలిపి ఇప్పటివరకు మొత్తం 143 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. దీనిని నిరసిస్తూ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ పార్లమెంట్ బయట నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో తాజాగా తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఉపరాష్ట్రపతి సభలో ప్రవర్తించే తీరును మిమిక్రీ చేసి చూపించారు. దీనిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీడియో తీయగా, మిగతా ఎంపీలందరూ నవ్వుతూ కనిపించారు. ఈ చర్యను అధికార బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపైనా పార్లమెంటు ఆవరణలో నిరసనలు కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ ట్రబుల్- గంటపాటు నిలిచిన సేవలు రీస్టార్ట్
వంశదేవతలుగా గుండ్రటి రాళ్లకు పూజలు!- చివరకు డైనోసార్ గుడ్లుగా గుర్తింపు- ఎక్కడో తెలుసా?