Karnataka Covid Scam : కొవిడ్-19 సమయంలో వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వ్యవహారంలో పెద్ద స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది కర్ణాటకలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భాజపా ప్రభుత్వ హయాంలో కొవిడ్ ఔషధాలు, వైద్య పరికరాల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి జస్టిస్ మైఖేల్ డీ కున్హా కమిషన్ నివేదికను పరిశీలిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
"కొవిడ్ స్కామ్ గురించిన నివేదిక ఇంకా క్యాబినెట్ ముందుకు రాలేదు. ప్రస్తుతం దాన్ని సబ్ కమిటీ పరిశీలిస్తోంది. సబ్ కమిటీ నివేదిక అందిన తర్వాత క్యాబినెట్‌లో దానిపై కచ్చితంగా చర్చిస్తాం" అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న భాజపా సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ, 'కమిషన్ నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం' అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. చర్యలు ప్రారంభించిన తర్వాత ఆయన (యడియూరప్ప) ఏం చేస్తారో చూద్దామన్నారు.
ఇదీ స్కామ్!
కొవిడ్-19 సమయంలో జరిగిన అవకతవకలకు సంబంధించి యడియూరప్పతోపాటు మాజీ మంత్రి బి.శ్రీరాములును విచారించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఇటీవల పేర్కొన్నారు. యడియూరప్పతోపాటు ఇతరులను విచారించే అవకాశం ఉందంటూ హోంమంత్రి పరమేశ్వర కూడా సంకేతాలు ఇచ్చారు. ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ఈ స్కామ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఒక్కో పీపీఈ కిట్ స్థానికంగా రూ.334లకే లభ్యమవుతున్నప్పటికీ, యడియూరప్ప సర్కార్ - చైనా, హాంకాంగ్ సంస్థల నుంచి రూ.2100కు కొనుగోలు చేశారు' అని ఆయన ఆరోపించారు.
కరోనా మహమ్మారి సమయంలో రూ.7,223 కోట్ల ఖర్చుల వివరాలను జస్టిస్ కున్హా కమిషన్ పరిశీలించింది. వీటికి సంబంధించి ఆగస్టు 31న మధ్యంతర నివేదికను కర్ణాటక ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తుతోపాటు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 11న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.