తెలంగాణ

telangana

కేరళలో నోరో వైరస్ కలకలం.. కేంద్రం హైఅలర్ట్

By

Published : Jun 6, 2022, 4:30 PM IST

Updated : Jun 6, 2022, 5:41 PM IST

Noro Virus Kerala: భారత్​లో నోరో వైరస్ మరోసారి కలకలం రేపింది. కేరళలోని ఇద్దరు విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ.. సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర అధికారులను కోరింది.

Noro Virus
నోరో వైరస్

Noro Virus Kerala: భారత్​లో నోరో వైరస్ కలకలం సృష్టించింది. కేరళలోని విళింజం, తిరువనంతపురంలోని ఇద్దరు విద్యార్థులకు నోరో వైరస్ సోకింది. అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ.. సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర అధికారులను కోరింది.

కేరళలో మొట్టమొదటిసారిగా నోరోవైరస్ వ్యాప్తి గతేడాది జూన్‌లో ప్రారంభమైంది. అలప్పుజ మున్సిపాలిటీ, సమీప పంచాయతీలలో 2021 జూన్​లో నోరో వైరస్‌ ప్రధాన లక్షణమైన 950 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి వ్యాప్తి సుమారు నెలన్నర పాటు కొనసాగింది. కలుషిత నీటి వలనే అలప్పుజలో గతంలో ఈ తరహా కేసులు నమోదైనట్లు ఓ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 68.5 కోట్ల నోరో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో 20 కోట్ల మంది ఐదేళ్లులోపు పిల్లలే ఉన్నారు.

అసలు ఈ నోరోవైరస్‌ ఏంటి..?:నోరో వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణముంది. ఇది అన్ని వయస్సుల వారికి సోకుతుంది. ఇది కలుషితమైన ఆహారంగా కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. దీన్ని స్టమక్ ఫ్లూ, స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారు.

లక్షణాలు:నోరో వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మూడు రోజుల వరకు ఉంటాయి. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం, జర్వం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. వైరస్ బారినపడిన వ్యక్తుల మలం, వాంతిలో దీని ఆనవాలు కనిపిస్తుంది. కలుషిత ఆహారం, నీరు, ఉపరితలాల ద్వారా ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోరో వైరస్ బారినపడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం కూడా దీని వ్యాప్తికి దోహదం చేస్తుంది. మలం నుంచి సేకరించిన నమూనాల పరీక్షించడం ద్వారా ఈ వైరస్‌ను నిర్ధరిస్తారు.

నోరో వైరస్ బాధితులు చాలామంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారు వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. అవసరమైతే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మూడు రోజుల్లో దీన్నుంచి బయటపడొచ్చని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ, మలంలో దాని ఆనవాళ్లు కొన్నివారాలు పాటు ఉంటాయన్నారు. ఇక, పలు రకాలైన నోరోవైరస్‌లు ఉండటంతో వాటి కారణంగా పలుమార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థ సిద్ధమవుతుంది. అయితే ఆ శక్తి ఎంతకాలం ఉంటుందో మాత్రం తెలియాల్సి ఉంది.

నివారణ ఇదే..
• తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
• కూరగాయలు, పండ్లను కడిగిన తర్వాతే వాడాలి.
• లక్షణాలు గుర్తించిన వెంటనే ఇంటికే పరిమితం కావాలి. అలాగే లక్షణాలు తగ్గిన మరో రెండు రోజుల వరకు ఇంట్లోనే ఉండాలి.
• ఆ కొద్ది రోజులు వంటకు దూరంగా ఉండాలి.
ఈ వైరస్‌ ఏడాదిలో ఎప్పుడైనా సోకే అవకాశం ఉన్నప్పటికీ.. నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కరోనా వైరస్​తో అతలాకుతలం అయిన బ్రిటన్​లో కొంతకాలం క్రితం నోరో వైరస్ వెలుగుచూసింది.

ఇదీ చదవండి:యూనివర్సిటీల ఛాన్సలర్​గా మమత.. గవర్నర్ అధికారాలు కట్

Last Updated : Jun 6, 2022, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details