తెలంగాణ

telangana

'యావత్ ప్రపంచం సంక్షోభంలో ఉంది.. ఎంతకాలమనేది అంచనా వేయడం కష్టం'

By

Published : Jan 12, 2023, 1:57 PM IST

గ్లోబల్‌ సౌత్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రస్తుత ప్రపంచం సంక్షోభంలో ఉందని..ఈ అస్థిరత ఎంత కాలం ఉంటుందో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు సమస్యలను లేవనెత్తారు.

narendra modi starting speech at global south virtual summit
గ్లోబల్‌ సౌత్‌ వర్చువల్‌ సమ్మిట్​లో మోదీ ప్రసంగం

ప్రస్తుత ప్రపంచం సంక్షోభంలో ఉందని..ఈ అస్థిరత ఎంత కాలం ఉంటుందో చెప్పడం కష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంఘర్షణ, యుద్ధం, ఉగ్రవాదం వంటి ప్రపంచ సవాళ్లను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్‌ సౌత్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. అంతర్జాతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు సమస్యలను లేవనెత్తారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదల, ఆర్థిక రంగంపై కరోనా ప్రభావం, పర్యావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న ప్రకృతి వైపరిత్యాలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న సమస్యలను గ్లోబల్ సౌత్ దేశాలు సృష్టించనప్పటికీ వాటి పర్యవసానాలు మనపై పడుతున్నట్లు మోదీ అన్నారు. ఈ ఏడాది జి-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తున్నందున గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించడమే తమ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.

"యుద్ధం, సంఘర్షణ, తీవ్రవాదం, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు కలగలిసిన మరో కొత్త ఏడాది పేజీలోకి అడుగుపెట్టాము. దీన్ని బట్టి చూస్తే ప్రపంచం సంక్షోభంలో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అస్థిరత ఎంత కాలం ఉంటుందో అంచనా వేయడం కష్టం. చాలా వరకు గ్లోబల్ సవాళ్లను ప్రపంచ దక్షిణాది దేశాలు సృష్టించ లేదు. కానీ, అవి మనల్ని (గ్లోబల్ సౌత్) ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ మానవాళిలో మూడోవంతు మంది ప్రపంచ దక్షిణాది దేశాల్లో నివసిస్తున్నారు. భారత్‌ ఎల్లప్పుడూ తన అభివృద్ధి అనుభవాన్ని గ్లోబల్‌ సౌత్‌తో పంచుకుంటుంది. మా అభివృద్ధి భాగస్వామ్యాలు అన్ని భౌగోళిక ప్రాంతాలు, విభిన్న రంగాలకు విస్తరించాయి. మహమ్మారి సమయంలో మేము‍(భారత్‌) 100 దేశాలకు మందులు, వ్యాక్సిన్‌లను సరఫరా చేశాం. అభివృద్ధి చెందుతున్న దేశాల ఉమ్మడి భవిష్యత్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించేందుకు భారత్‌ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది" అని మోదీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details