తెలంగాణ

telangana

అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు పోటెత్తిన ప్రజలు

By

Published : Oct 11, 2022, 4:04 PM IST

Updated : Oct 11, 2022, 5:35 PM IST

Mulayam Singh Yadav Funeral

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఎస్​పీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు పోటెత్తిన ప్రజలు

దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అశేష జనవాహిని మధ్య ఇటావా జిల్లాలోని ములాయం స్వస్థలం సైఫైలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ములాయం కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌.. తండ్రి చితికి నిప్పంటించారు.

సోమవారం గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో ములాయం మరణించగా ఆయన భౌతిక కాయాన్ని.. స్వస్థలం ఇటావాలోని సైఫై గ్రామానికి తరలించారు. తమ అభిమాన నేతకు తుదివీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, సమాజ్ వాదీ పార్టీకార్యకర్తలు సైఫైకి తరలివెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు 'నేతాజీ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు. పలువురు రాజకీయ నేతలు కూడా.. ములాయం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.

ములాయం అంత్యక్రియల్లో కేంద్రమంత్రి రాజ్​నాథ్ సింగ్​, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్​, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, పార్టీ ఎంపీలతో కలిసి ములాయం సింగ్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్​ను పరామర్శించారు.

ములాయం సింగ్ యాదవ్​ అనారోగ్యంతో హరియాణాలోని మేదాంత ఆస్పత్రిలో సోమవారం మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. గతవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించడం వల్ల ఐసీయూకు తరలించారు. అప్పటి నుంచి ప్రాణాధార వ్యవస్థపై ఉన్న ఆయన.. సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం కుమారుడు, ఎస్​పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఇవీ చదవండి:రెజ్లింగ్​ రింగ్ నుంచి రాజకీయాల్లోకి ములాయం.. సీఎంగా ఎదిగి.. కేంద్రంలో చక్రం తిప్పి..

నియోజకవర్గంలోని 94% ఓట్లు ఆయనకే.. దటీజ్​ ములాయం!

Last Updated :Oct 11, 2022, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details