తెలంగాణ

telangana

MVV Satyanarayana: "విశాఖలో వ్యాపారం చేయలేను.. నేను తెలంగాణకు పోతా"

By

Published : Jun 20, 2023, 1:00 PM IST

MP MVV Satyanarayana: కుటుంబ సభ్యుల అపహరణ వ్యవహారం తర్వాత విశాఖ ఎంపీ M.V.V. సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన వ్యాపార కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగానే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విశాఖను వదిలి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.

MVV Satyanarayana
MVV Satyanarayana

MP MVV Satyanarayana: వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీకు చెందిన విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇటీవల(జూన్​ 13) రౌడీ షీటర్ హేమంత్ మరో ఐదుగురితో కలిసి ఏకంగా ఎంపీ ఇంటినే ఆధీనంలోకి తీసుకుని ఆయన కుమారుడు శరత్, భార్య జ్యోతి, వైసీపీ నేత, ప్రముఖ ఆడిటర్ జీవీలను కిడ్నాప్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన తర్వాత ఎంపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖను వదిలి ఆయన తెలంగాణకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను వైసీపీ ఎంపీ వదిలి వెళ్లిపోతాననడం రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.

గతంలోనూ ఇలాగే: గత సంవత్సరం మధురవాడలోని సాయి ప్రియ గార్డెన్స్ వద్ద ఎంవీవీ, ఆడిటర్​ జీవీ చేపట్టిన భారీ ప్రాజెక్టు విషయంలో వివాదం తలెత్తింది. గెడ్డను మళ్లించారని, తన స్థలం నుంచి రహదారి వేశారంటూ కేంద్ర ఇంటెలిజెన్స్​ విభాగంలోని నాన్​ కేడర్ ఎస్పీ ఒకరు ఆరోపించారు. ఆ సమయంలో 'ఇక్కడ వ్యాపారం చేయనివ్వడం లేదు. నేను హైదరాబాద్ వెళ్లిపోతా' అని ఎంపీ పేర్కొన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్​ఛార్జిగా విజయ సాయిరెడ్డి ఉన్న సమయంలోనూ పలు విషయాల్లో పరస్పర ఆరోపణలు సాగాయి. అప్పట్లోనూ వైజాగ్​లో వ్యాపారాలు సాగనివ్వడం లేదనే భావన ఆయన వ్యక్తం చేశారు. కుటుంబీకుల కిడ్నాప్ ఉదంతం తర్వాత మరోసారి అదే చెబుతున్నారు. విశాఖలో వ్యాపార రీత్యా అవసరమైన అనుమతులు సైతం పొందడంలో జాప్యమవుతుందన్న ఆవేదన ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అసత్య ప్రచారాలు ఎక్కువగా వస్తున్నాయి: 'నాకు ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు, వ్యాపారం ఒకేసారి కొనసాగించడం కష్టమైపోతోంది. రాజకీయాల్లో ఉన్నందున ఎవరో ఒకరు, ఏదో ఒకటి అంటుంటే బాధ కలుగుతోంది. ప్రజాసేవ కోసం రాజకీయాలు విశాఖలో చేస్తాను. వ్యాపారం హైదరాబాద్​లో చేద్దామన్న నిర్ణయానికి వచ్చాను. అనవసరంగా వ్యాపారాన్ని, రాజకీయాల్ని కలిపేస్తున్నారని నా ఉద్దేశం' అంటూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 'ఈనాడు'తో అన్నారు. అధికార పార్టీలో ఉండటం వల్ల అసత్య ప్రచారాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో ఎంవీవీ బిల్డర్స్​ ముఖ్య పాత్ర పోషించిందని, మంచి ఫ్లాట్లు, సర్వీసు ఇచ్చామన్నారు.' డబ్బుల కోసం కిడ్నాప్​ చేసినంత మాత్రానా ఊరొదిలి పారిపోతానా? రాజకీయాలకు ముడిపెట్టి బిజినెస్​లను ఎత్తి చూపుతున్నారు. అందుకే ప్రశాంతంగా ఉంటుందని హైదరాబాద్​కు వెళ్లాలనుకుంటున్నా'అని ఆయన పేర్కొన్నారు.

శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తా: 'నా కుటుంబ సభ్యులను, జీవీని కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. నేను ఆ రోజు వారి స్థానంలో ఉండి ఉంటే చచ్చిపోవడమో?చంపడమో చేసేవాడిని. దీనిపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలవడం లేదు. కిడ్నాపర్లకు శిక్ష పడే వరకు న్యాయపరంగా ఏం చేయాలో అంతా చేస్తా' అని ఎంపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details