తెలంగాణ

telangana

కూతురి కోసం 30ఏళ్ల పాటు 'మగాడి'లా మారిన తల్లి

By

Published : May 11, 2022, 10:16 PM IST

Updated : May 12, 2022, 3:18 PM IST

mother becomes a man for her daughter
Mother becomes a tomboy to her daugher ()

Mother becomes a tomboy: కూతురి కోసం ఏకంగా 30 ఏళ్ల పాటు మగాడిలా బతికింది ఓ తల్లి. పురుషుడి వేషధారణలో పెయింటింగ్, టీ మాస్టార్, వంట మనిషిగా ఇలా​ ఎన్నో పనులను చేసింది. ఇన్నేళ్లకు ఈ నిజాన్ని బయటపెట్టింది. ఎందుకంటే?

కూతురి కోసం 30ఏళ్ల పాటు 'మగాడి'లా మారిన తల్లి

Mother becomes a tomboy to her daugher: పెళ్లయిన 15 రోజులకే భర్త చనిపోయాడు.. ఒంటరి మహిళ కావడం వల్ల ఎన్నో తప్పుడు చూపులు ఆమె వెంటపడేవి. వేధించేవి. అంతలోనే కూతురికి జన్మనిచ్చింది. ఇక కూతురిని సంరక్షించడం సహా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఓ అసాధారణ మార్గాన్ని ఎంచుకుంది ఆ తల్లి. మగాడిలా వేషధారణ మార్చుకుంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల పాటు అనేక సవాళ్లను ఎదుర్కొని టామ్​ బాయ్​లా బతికింది. ఆమే.. తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్​.

పెచ్చియామ్మాల్

భర్త చనిపోయిన తర్వాత.. కడ్డునాయగన్​ పట్టికి మకాం మార్చింది పెచ్చియమ్మాల్. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికింది. అయితే ఆమె వితంతు కావడం వల్ల.. అక్కడ ఆమె పలుమార్లు లైంగిక వేధింపులను ఎదుర్కొంది. వాటి నుంచి తప్పించుకునేందుకు పురుషుడిలా దుస్తులు ధరించింది. పేరు కూడా ముత్తు అని మార్చుకుంది.

ముత్తుగా పెచ్చియామ్మాల్

అయితే పేదరికం వల్ల పనికోసం చాలా ప్రాంతాలకు మారాల్సి వచ్చేది. ఎక్కడికెళ్లినా తాను మగాడిలా పరిచయం చేసుకునేది. ఈ క్రమంలోనే స్థానికంగా 'అన్నాచ్చి'గా (పెద్దన్న) గుర్తింపు పొందింది. కొన్నాళ్లకు తూతుక్కుడి తిరిగొచ్చి.. క్రాప్​ హెయిర్​ కట్​, మగాడి దుస్తుల్లో పురుషుడిలానే జీవించసాగింది. టీ, పరోటా షాపుల్లో పనిచేసి.. ముత్తు మాస్టర్​గా పేరుగాంచింది.

పెయింటింగ్ పని చేస్తున్న ముత్తు

"మేము ఆరుగురు ఆడపిల్లలం. 20 ఏళ్ల వయసులో నాకు పెళ్లయింది. పెళ్లైన 15 రోజులకే భర్త చనిపోయారు. ఇదే నా తలరాత అనుకొని బతుకుతున్నప్పుడు ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత సొంతూరు నుంచి తూతుక్కుడి వచ్చాను. ఓ ఇల్లు అద్దె తీసుకొని.. పనిచేసుకునేదాన్ని. ఓ రోజు పని ముగించుకొని వచ్చేటప్పుడు.. లారీ అతను నాతో తప్పుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి సహకారంతో ఆ పరిస్థితి నుంచి బయటపడగలిగా. అతనే నాకో చొక్కా ఇచ్చి.. నన్ను ఇంటి దగ్గర దిగబెట్టాడు. మరునాడే 6 గంటలకు పని ముగించుకొని తిరుచానూరుకు వెళ్లి.. గుండు చేయించుకున్నా. చీర పక్కనపెట్టి.. ప్యాంటు, షర్టు​, రుద్రాక్ష ధరించా. కొన్నాళ్లకు ఆ డ్రైవర్ ముందు నుంచే వెళ్లినా అతడు గుర్తు పట్టలేదు. అప్పుడే అనిపించింది.. నాకు ఈ దుస్తులే సరైనవని."

-ముత్తు మాస్టర్​

ప్రస్తుతం ముత్తు మాస్టర్​కు 57 ఏళ్లు. తన కూతురికి వివాహం చేసేసింది. "నా కూతురి పెళ్లి కోసం.. 100 రోజుల పని పథకంలో, పెయింటర్​గా పనిచేశాను. 15 రోజుల్లోనే నా వైవాహిక జీవితం ముగిసినా.. నా కూతురు, ఆత్మగౌరవం కోసం నా వేషధారణ మార్చాను. ఈ జీవితం పట్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అయితే నా భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని నేను తీసుకోలేదు. ఆధార్​ కార్డులోనూ నా పేరు ముత్తు అనే ఉంటుంది. దీంతో వితంతు, వృద్ధాప్య పింఛను లభించడం లేదు. అవి అందితే నాకు ఎంతో సహాయకంగా ఉంటుంది." అని ముత్తు మాస్టార్​ కోరింది.

చెల్లెల్లతో పెచ్చియామ్మాల్

"నాన్న చనిపోయాక అమ్మ కొన్నాళ్లు మామూలుగానే చీరలు కట్టింది. అయితే పనికి వెళ్లి వచ్చే క్రమంలో ఎదురైన వేధింపులతో మగాడిగా వేషధారణ మార్చింది. టీ మాస్టర్, వంట మాస్టర్​.. ఇలా ఎన్నో పనులు చేసింది. అమ్మా.. నాన్న.. అన్నీ తానై నాకు ఏ లోటూ లేకుండా చూసుకుంది. అమ్మ ఇలా చేసినందుకు మర్యాద పోయిందని నేనేమీ అనుకోవడం లేదు. నాకు మంచే చేసింది. అందుకు గర్వంగా ఉంది. అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండటం వల్ల పింఛను తీసుకోవడంలో అమ్మ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అది పరిష్కారమై అమ్మకు పింఛను అందితే ఆమెకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది" అని ముత్తు మాస్టర్ కూతురు షణ్ముక సుందరి పేర్కొన్నారు.

ఆధార్​ కార్డులో ముత్తుగా

ఇదీ చూడండి:రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. బాలికపై వరుడి అత్యాచారం​

Last Updated :May 12, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details