తెలంగాణ

telangana

మోదీ వరుస భేటీలు.. ఉక్రెయిన్ పొరుగుదేశాలకు కేంద్ర మంత్రులు

By

Published : Feb 28, 2022, 10:51 PM IST

Modi Ukraine meeting: ఉక్రెయిన్​లో హింసాత్మక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపింది. అటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Modi chairs high level
Modi chairs high level

Modi Ukraine meeting: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో మూడో భేటీని నిర్వహించారు. సోమవారం జరిగిన మీటింగ్​కు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తదితరులు హాజరయ్యారు. ఉక్రెయిన్- రష్యా పరిణామాలను పార్లమెంటరీ ప్యానెల్​కు వివరించారు శ్రింగ్లా.

మరోవైపు, ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన పౌరులను తరలించేందుకు సహకరిస్తామని పొరుగుదేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మోదీ హామీ ఇచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. 'స్లొవాక్ రిపబ్లిక్, రొమేనియా దేశాల అధినేతలతో మోదీ ఫోన్​లో మాట్లాడారు. ఉక్రెయిన్​లోని భారత పౌరులను తరలించడంలో సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు' అని వెల్లడించింది.

రష్యా దాడి నేపథ్యంలో వైద్య సామగ్రితోపాటు మానవతాసాయం అందించాలని ఉక్రెయిన్‌ విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ దేశానికి వైద్య పరికరాలను పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. మానవతా సహాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. మంగళవారమే తొలి దఫా సాయాన్ని ఉక్రెయిన్​కు పంపించనున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు సహా భారతీయులందరినీ రప్పించే యత్నాల్లో కేంద్రం తలమునకలై ఉంది. సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో విద్యార్థులను స్వదేశానికి రప్పించడం సహా నలుగురు కేంద్రమంత్రులను ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రులు హర్దీప్​ సింగ్ పురీ, జోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్​లను ప్రత్యేక రాయబారులుగా భారత్.. నాలుగు వేర్వేరు దేశాలకు పంపింది.

how many indian students in ukraine

సోమవారం మరో రెండు ఎయిర్ఇండియా విమానాలు దిల్లీకి చేరుకున్నాయి. బుచారెస్ట్ నుంచి 249 మంది పౌరులను, బుడాపెస్ట్ నుంచి 240 మందిని తరలించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1,396 మంది భారత పౌరులను ఆరు విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చినట్లు వివరించింది. ఫిబ్రవరి ప్రారంభంలో భారత్ తొలి అడ్వైజరీ జారీ చేసిన తర్వాత నుంచి 8 వేల మంది ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని వెల్లడించింది. మరో 14 వేల మంది భారత పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్​లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత ప్రతికూలంగా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, గడిచిన 24 గంటల్లో పౌరుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసినట్లు స్పష్టం చేసింది. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. ఉక్రెయిన్​కు పశ్చిమాన ఉన్న నగరాలకు ప్రయాణించాలని సూచించారు. సమీపంలో ఉండే అధికారులను సంప్రదించి.. ఆశ్రయం పొందాలని చెప్పారు. కీవ్​లో కర్ఫ్యూ ఎత్తివేసిన నేపథ్యంలో రైల్వే స్టేషన్​లకు వెళ్లాలని ఉక్రెయిన్​లోని భారత ఎంబసీ సూచించింది.

ఇదీ చదవండి:'తమిళనాడుతో పాటు దేశ ప్రజలను అవమానించిన మోదీ!'

ABOUT THE AUTHOR

...view details