తెలంగాణ

telangana

Margadarsi chitfunds updates: మార్గదర్శి చిట్‌గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

By

Published : Jul 18, 2023, 5:12 PM IST

Updated : Jul 19, 2023, 6:42 AM IST

Margadarsi chitfunds updates: మార్గదర్శి ’చందాదారులకు హైకోర్టులో ఊరట లభించింది. చిట్‌ గ్రూపులను నిలిపివేస్తూ గుంటూరు, పల్నాడు, అనంతపురం చిట్‌ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. చందాదారులు వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకుండా చిట్‌ గ్రూపుల నిలిపివేతకు రిజిస్ట్రార్లు ఇచ్చిన ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని న్యాయస్థానం తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రధాన వ్యాజ్యంలో ప్రతివాదులు కౌంటరు దాఖలు చేసేందుకు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో చిట్‌ గ్రూపులను కొనసాగించుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లయింది.

Margadarsi chitfunds updates
మార్గదర్శి

మార్గదర్శి చిట్‌గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

Margadarsi chitfunds updates: చందాదారుల ప్రయోజనాలను కాపాడటం అనే ముసుగులో మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు చెందిన 23 చిట్‌ గ్రూపులను రిజిస్ట్రార్లు నిలిపివేశారు. గుంటూరు, పల్నాడు, అనంతపురం చిట్‌ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు ఈ ఏడాది జూన్‌ 20న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు చందాదారులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. కోర్టును ఆశ్రయించిన వారిలో జె.మాధవి, వై.సాగరేశ్వరరావు, పి.హరినాధప్రసాద్‌తో పాటు మరికొందరు ఉన్నారు. గ్రూపుల నిలిపివేత విషయంలో చందాదారులకు, మార్గదర్శికి నోటీసు కూడా ఇవ్వకుండా రిజిస్ట్రార్లు యాంత్రికంగా, ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మీనాక్షీ అరోడా, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ నెల 17న ఇరువైపుల వాదనలు ముగిశాయి. జూన్‌ 20న డిప్యూటీ రిజిస్ట్రార్లు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ న్యాయమూర్తి మంగళవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

విచారణ సందర్భంగా ఏజీ వాదనలను అంగీకరించలేమని న్యాయస్థానం పేర్కొంది. ‘చందాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకుండా, వారి ప్రయోజనాలను రక్షించే పేరుతో డిప్యూటీ రిజిస్ట్రార్లు సుమోటో అధికారాన్ని వినియోగించి చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 48 -హెచ్‌ మేరకు చిట్‌గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఈ వ్యాజ్యాల్లో కీలకాంశాలను లేవనెత్తుతోంది. చందాదారుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ మధ్య నెలకొన్న వివాదం కారణంగా చిట్‌గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతివాదులు కౌంటర్‌ వేశాక ఈ వ్యవహారంపై విచారణ జరపాలి. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో జారీ అయిన మధ్యంతర ఉత్తర్వులతో ఈ కేసుకు సంబంధం ఉందా అనే విషయాన్ని అవసరమైన సమయంలో పరిశీలిస్తాం. చందాదారులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా చిట్‌ గ్రూపులను నిలిపివేశారని, ఆ ఉత్తర్వులు చట్టం ముందు నిలబడవని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు.

మరోవైపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. సుమోటో అధికారాన్ని వినియోగించి చిట్‌ గ్రూపుల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చట్టప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పిటిషనర్ల తరఫు వాదనలు, చిట్‌ గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులను పరిశీలిస్తే.. చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒకే తరహా కారణాలతో ఒకే తేదీన ఉత్తర్వులిచ్చినట్లుంది. ఈ నేపథ్యంలో చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 48 ప్రకారం ఏ పరిస్థితుల్లో చిట్‌ గ్రూపులను నిలిపివేయవచ్చు, సెక్షన్‌ 49 ప్రకారం చిట్‌ గ్రూపుల నిలిపివేతకు దరఖాస్తులను పరిశీలించాల్సిన అవసరం ఉంది. చిట్‌ గ్రూపుల నిలిపివేత నిర్ణయానికి ముందు నోటీసు ఇవ్వాలనే నిబంధన చట్టంలో లేదని ఏజీ చెబుతున్నా.. ఆ వాదనలను అంగీకరించలేం. చిట్‌ఫండ్‌ చట్టంలోని నిబంధనలు చందాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించినవి. చందాదారుల ప్రయోజనాలకు హానికరమైన నిర్ణయం తీసుకునే ముందు నోటీసులు జారీచేసి వారికి వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాల్సిందని న్యాయస్థానం ప్రాథమికంగా భావిస్తోందన్నారు.

పిటిషనర్ల అభిప్రాయాలను పరిగణించేందుకే చట్టంలో అప్పీల్‌ సెక్షన్‌ 59 పొందుపరిచారని...అప్పీల్‌ ప్రక్రియ నామమాత్రంగా ఉండకూడదన్నారు. అలాంటప్పుడు అప్పీల్‌ వేసినా ఉపయోగం ఉండదన్న న్యాయస్థానం.. చిట్‌ గ్రూపుల నిలిపివేత నిర్ణయానికి ముందు భాగస్వాములైన చందాదారులకు వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వనప్పుడు.. వారి ప్రయోజనాల కోసం డిప్యూటీ రిజిస్ట్రార్లు సదుద్దేశంతో ఉత్తర్వులిచ్చారన్న వాదన సంతృప్తికరంగా లేదన్నారు. ప్రభుత్వం ముందు అప్పీల్‌ వేయడం వల్ల చందాదారులకు ఉపశమనం లభించే అవకాశం లేదన్నారు. ఈ నేపథ్యంలో చట్టప్రకారం పిటిషనర్లు అప్పీల్‌ దాఖలు చేయలేదన్న ఏజీ వాదనలను తోసిపుచ్చుతున్నామని కోర్టు పేర్కొంది.

చిట్‌ గ్రూపుల కొనసాగింపునకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే.. కంపెనీలో ఉల్లంఘనలు కొనసాగుతాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కోర్టులో కౌంటరు వేస్తామని ఏజీ చెబుతున్నారు. సహారా, అగ్రిగోల్డ్‌ సంస్థల తరహా పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఏజీ పేర్కొన్నారు. ఈ కేసులో చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా చెల్లింపుల్లో ఎగవేతపై ఎటువంటి ఫిర్యాదులూ లేవు.. కాబట్టి చిట్‌ గ్రూపుల నిలిపివేతకు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించుకోవడాన్ని విస్తృత కోణంలో పరిశీలించాలని కోర్టు పేర్కొంది.

గ్రూపుల నిలిపివేత నిర్ణయానికి ముందు చందాదారులకు నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలు తీసుకున్నా... సంస్థలో చోటుచేసుకున్న ఉల్లంఘనల ఆధారంగా డిప్యూటీ రిజిస్ట్రార్లు తీసుకునే నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపదని ఏజీ లేవనెత్తిన వాదనను ఈ దశలో న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభావిత వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా తీసుకునే నిర్ణయాలు వారి ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపినప్పుడు.. అలాంటి నిర్ణయాలు చట్టం ముందు నిలబడవని ఎన్నో తీర్పులు ఉన్నాయన్నారు. ఇరువైపుల వాదనలు, చట్ట నిబంధనలు పరిగణనలోకి తీసుకుంటే చిట్‌ గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి ఉత్తర్వులు సమర్థనీయం కాదన్న న్యాయస్థానం...భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం చిట్‌లో పిటిషనర్లు సొమ్ము దాచుకున్నారని, గ్రూపులు నిలిపివేయడం వల్ల చందాదారులకు నష్టం కలుగుతుందన్న సీనియర్‌ న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుంటే మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై మొగ్గు పిటిషనర్ల వైపు ఉందన్నారు.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిప్యూటీ రిజిస్ట్రార్లు చిట్‌ గ్రూపుల నిలిపివేతకు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. డిప్యూటీ రిజిస్ట్రార్ల ఉత్తర్వుల ఆధారంగా తదుపరి తీసుకోబోయే చర్యలన్నింటినీ నిలువరిస్తున్నామన్నారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు నోటీసులు జారీ చేస్తున్నామంది. ప్రతివాదులు కౌంటరు దాఖలు చేసేందుకు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Last Updated : Jul 19, 2023, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details