తెలంగాణ

telangana

మణిపుర్​లో కర్ఫ్యూ సడలింపు.. డ్రోన్ల ద్వారా నిఘా.. మెడిసిన్ల కోసం రోడ్లపైకి ప్రజలు!

By

Published : May 7, 2023, 3:15 PM IST

Manipur Violence : మణిపుర్‌లో ఘర్షణ వాతావరణం క్రమంగా చల్లారుతోంది. మైతీ వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌కు స్థానిక గిరిజన జాతులు వ్యతిరేకించడం వల్ల చెలరేగిన హింస ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించడం వల్ల ప్రజలు రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో సైన్యం పటిష్ఠ నిఘా చర్యలు చేపట్టింది.

manipur violence
manipur violence

Manipur Violence : గత కొద్దిరోజులుగా అట్టుడుకుతున్న మణిపుర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. దీంతో మణిపుర్‌లోని కొన్నిప్రాంతాల్లో ఆంక్షలు సడలించారు. కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రాంతాల్లో సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఘర్షణల్లో తీవ్రంగా ప్రభావితమైన చురచంద్‌పూర్‌ పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలను సడలించారు.

ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలించడం వల్ల ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్లపైకి వచ్చారు. ఆహారం, మందులతోపాటు అత్యవసర సరకులు కొనుక్కునేందుకు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు సడలిస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

ఉదయం 10 గంటల తర్వాత సైన్యంతోపాటు, అసోం రైఫిల్స్‌ బలగాలు.. చురాచంద్‌పుర్ పట్టణంలో ఫ్లాగ్‌ మార్చ్ నిర్వహించాయి. 120 నుంచి 125 సైనిక యూనిట్లను మణిపుర్ రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. దాదాపు 10వేల మంది సైనికులు, పారామిలటరీతోపాటు కేంద్ర బలగాలు మణిపుర్‌లో పహారా కాస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మణిపుర్‌లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శాంతి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్ వెల్లడించారు. ఈ కమిటీలతో క్షేత్రస్థాయి నుంచి ఘర్షణలను తగ్గించి శాంతిభద్రతలను పెంచవచ్చని పేర్కొన్నారు.

పహారా కాస్తున్న పోలీసులు

అయితే అన్ని వర్గాలకు చెందిన 23 వేలమంది ప్రజలను రక్షించి సైనిక శిబిరాలకు తరలించినట్లు రక్షణ శాఖ ప్రకటన వెలువరించింది. గత నాలుగు రోజులుగా సైన్యం, కేంద్ర బలగాలు తీవ్రంగా శ్రమించి ప్రజలను కాపాడినట్లు తెలిపింది. గత 24 గంటలుగా సైన్యం ఏరియల్ సర్వే ద్వారా ఇంఫాల్‌లోయలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు మణిపుర్‌లో పరిస్థితిపై సీఎం బీరెన్‌ సింగ్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో చెలరేగిన ఘర్షణలను తగ్గించి శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హింసకు దారితీసే పరిస్థితుల నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

మెడికల్​ షాప్​ వద్ద ప్రజలు
మణిపుర్​లో తెరుచుకున్న మెడికల్​ షాప్​లు

హింసకు కారణమిదే!
మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండుకు అనుకూలంగా కేంద్రానికి సిఫార్సు పంపాలని ప్రభుత్వాన్ని మణిపుర్‌ హైకోర్టు ఆదేశించడంతో హింస చెలరేగింది. మైనారిటీ వర్గాలైన కుకీ, నాగా గిరిజన తెగలు.. మైతీల డిమాండును వ్యతిరేకిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల అనంతరం వీరు నిర్వహించిన ర్యాలీలో హింస చెలరేగింది. రెండు వర్గాలు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం వల్ల మణిపుర్ అట్టుడికిపోతోంది. మే 3న మణిపుర్‌లో అల్లర్లను అదుపు చేయడానికి అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. అల్లర్ల కారణంగా కనీసం 13వేల మంది నిర్వాసితులు కాగా.. 54 మంది మృత్యువాత పడ్డారు.

పటిష్ఠ నిఘా చర్యలు

ABOUT THE AUTHOR

...view details