ETV Bharat / bharat

బెంగళూరులో మోదీ మరో 8 కి.మీ రోడ్​ షో.. ప్రధాని ప్రచారం ముగింపు!

author img

By

Published : May 7, 2023, 10:42 AM IST

Updated : May 7, 2023, 11:46 AM IST

Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మరో రోడ్ ​షోను నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బెంగళూరు సెంట్రల్​ నియోజకవర్గంలోని దాదాపు 8 కిలోమీటర్ల పాటు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

karnataka elections 2023
karnataka elections 2023

Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గరపడడం వల్ల అధికార బీజేపీ వేగం పెంచింది. ఈ తరుణంలోనే శనివారం 26 కిలోమీటర్ల మెగా రోడ్ ​షో చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్ ​షో చేపట్టారు ప్రధాని మోదీ. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్​ షో 11.30 గంటలకు ముగిసింది. బెంగళూరు సెంట్రల్​ లోక్​సభ నియోజకవర్గంలోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్​ వరకు సాగింది. ఈ క్రమంలోనే వాహనదారులు వేరొక మార్గాన్ని ఎంచుకోవాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధానికి దారి వెంట పూల వర్షం కురిపించారు. నీట్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందిలేకుండా రెండో రోడ్‌షోను 8 కిలోమీటర్లతో సరిపెట్టనున్నారు.

రోడ్​ షో ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. శివమొగ్గకు వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. ఈ సభకోసం భారీగా ఏర్పాట్లు చేసింది బీజేపీ. ఈ సభకు సుమారు 10 నియోజకవర్గాల ఓటర్లు హాజరు కానున్నారు. సమావేశం తర్వాత మైసూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మరో సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత నంజన్​గుడ్​లోని సుబ్రమణ్య స్వామి, గణపతి ఆలయాలను సందర్శించి.. దిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు.

అంతకుముందు శనివారం 26.5 కిలోమీటర్ల మేర మెగా రోడ్​ షోను చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్​ షో మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. సోమేశ్వర్​ భవన్​ నుంచి బెంగళూరు సౌత్​లోని మల్లేశ్వర్​ సంకి ట్యాంక్​ వరకు దాదాపు 26.5 కిలోమీటర్లు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని 34 రోడ్లను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసివేశారు.

నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలను కలుసుకునేందుకు రెండు రోజుల రోడ్​ షో పెట్టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒక రోజులో నగరమంతా పర్యటిస్తే.. ప్రజలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. నగరంలోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని బీజేపీ ఎలక్షన్​ నిర్వహణ కమిటీ కన్వీనర్​ శోభా కరంద్లాజే చెప్పారు.

Karnataka Election Date : కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్​కు 76, జేడీఎస్​కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఇవీ చదవండి : మోదీ రోడ్​షోతో ట్రాఫిక్ జామ్.. రహదార్లపై చిక్కుకున్న అంబులెన్సులు

ఎన్నికల వేళ ఖర్గేకు షాక్.. రూ. 100 కోట్లు కట్టాలంటూ VHP లీగల్​​ నోటీసులు..

Last Updated :May 7, 2023, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.