తెలంగాణ

telangana

దేవెగౌడ టూ కుమారస్వామి.. కర్ణాటకలో ఆ జిల్లా నుంచే నలుగురు ముఖ్యమంత్రులు.. నెక్స్ట్​ DK శివకుమార్​?

By

Published : Apr 21, 2023, 7:31 PM IST

ఏ రాష్ట్రంలోనైనా ముఖ్య‌మంత్రులుగా సేవ‌లందించిన వారు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వారుంటారు. అయితే.. క‌ర్ణాట‌కలో మాత్రం ఈ ప‌రిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రులుగా పనిచేసిన ముగ్గురు.. ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వాళ్లే. అదే రామ‌న‌గ‌ర. మొత్తంగా ఈ జిల్లా నుంచి న‌లుగురు వ్య‌క్తులు ముఖ్యమంత్రులుగా సేవ‌లందించారు.

karnataka election 2023
karnataka election 2023

మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్ప‌టికే నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. రాష్ట్రం మొత్తంలో 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీట‌న్నింటిలోకెల్లా రామ‌న‌గ‌ర శాసనసభ స్థానానికి ఒక ప్రత్యేక స్థానముంది. ఆ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్య‌మంత్రుల‌ను ఇచ్చిన ఘ‌న‌త.. రామనగర నియోజకవర్గం సొంతం. అలాగే మొత్తం రామనగర జిల్లా నుంచి నలుగురు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రామనగర నియోజకవర్గం గురించి ఓ సారి తెలుసుకుందామా మరి.

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరుకు 50 కి.మీ దూరంలో రామ‌న‌గ‌ర జిల్లా ఉంది. సిల్క్, గ్రానైట్‌, రామ‌దేవ‌ర కొండ, కాన్వా జ‌లాశ‌యం, చ‌న్న‌ప‌ట్ట‌ణ ప‌ప్పెట్ షో వంటి వాటికి ప్ర‌సిద్ధి చెందిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయ ప‌రంగా రామనగర జిల్లాకు ఒక ప్ర‌త్యేకత ఉంది. క‌ర్ణాట‌క‌కు రెండో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కె. హ‌నుమంత‌య్య 1952లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రామనగర నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈ స్థానం నుంచి గెలిచి ముఖ్య‌మంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే.

ఆ తర్వాత రామ‌కృష్ణ హెగ్డే 1983లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రామనగర జిల్లాలోని క‌న‌క‌పుర నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ముఖ్య‌మంత్రి అయ్యారు. అలాగే మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ.. 1994లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రామనగర నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత ఆయ‌న 1996 లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేవెగౌడ రాజీనామాతో ఖాళీ అయిన రామనగర అసెంబ్లీ సీటులో కన్నడ నటుడు అంబరీశ్ పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి లింగప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో విజయం సాధించిన లింగప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2004లో రామనగరలో మాజీ ప్రధాని హెచ్​డీ దేవేగౌడ కుమారుడు హెచ్​డీ కుమారస్వామి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రామనగర జిల్లా నుంచి ఎన్నికైన ముఖ్య‌మంత్రుల‌ు ఎవరూ పూర్తి పదవీ కాలం పూర్తి చేయకపోవడం గమనార్హం.

ఇద్ద‌రు సీఎం ఆశావ‌హులు ఈ జిల్లా నుంచే పోటీ : త్వ‌ర‌లో క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రామనగర జిల్లా నుంచి ఇద్ద‌రు సీఎం ఆశావ‌హులు పోటీ చేయడం వల్ల ఈ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. మాజీ సీఎం కుమార‌స్వామి.. రామనగర జిల్లాలోని చెన్నపట్టణ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇక ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని ఆరాట‌ప‌డుతున్న కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ సైతం ఈ జిల్లాలోని క‌న‌క‌పుర నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా.. 'మీకు సేవ చేసేందుకు నేను సిద్ధం. నాకొక అవ‌కాశ‌మివ్వండి ' అని వ్యాఖ్యానించి సీఎం కావాల‌నే త‌న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్​ను దాటి అధిష్ఠానం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​ వైపు మొగ్గు రామ‌న‌గ‌ర జిల్లా నుంచి మరో వ్యక్తి ముఖ్యమంత్రి అయిన జాబితాలో చేరిపోతారు. అప్పుడు రామనగర జిల్లా నుంచి ముఖ్యమంత్రులు అయిన వారి సంఖ్య ఐదుకు చేరుతుంది.

ABOUT THE AUTHOR

...view details