తెలంగాణ

telangana

'చైనా తరహాలో దాడి చేస్తే భారత సైన్యంలా తరిమికొడతాం'.. సీఎం ఫైర్

By

Published : Dec 21, 2022, 10:54 PM IST

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై శివసేన(ఠాక్రే) ఎంపీ, కర్ణాటక సీఎం వాగ్బాణాలు సంధించుకున్నారు. చైనా తరహాలో కర్ణాటకలోకి చొచ్చుకెళ్తామంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించగా.. తాము భారత సైన్యంలా తరిమికొడతామంటూ కర్ణాటక సీఎం బదులిచ్చారు.

maharashtra karnataka border dispute
మహారాష్ట్ర కర్నాటక సరిహద్దు వివాదం

మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదం ముదురుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నేరుగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా, చైనాతో సరిహద్దులో ఘర్షణను ప్రస్తావిస్తూ ఉద్రేక వ్యాఖ్యలు చేస్తున్నారు. చైనా తరహాలో కర్ణాటకలోకి చొచ్చుకెళ్తామంటూ మహారాష్ట్ర శివసేన(ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. దీనికి అంతే దీటుగా బదులిచ్చారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. చైనాలా వారు దాడి చేస్తే.. తాము భారత సైన్యంలా తిప్పికొడతామని బదులిచ్చారు.

"మహారాష్ట్రలోని అన్ని పార్టీల నేతలు అసెంబ్లీ లోపలా, బయటా అతిశయోక్తితో అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు మానసిక స్థిరత్వాన్ని కోల్పోయినట్టున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్.. 'భారత సరిహద్దులోకి చైనా చొచ్చుకొచ్చినట్టు.. మేం కర్ణాటక సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్తా'మని అంటున్నారు. అలా చేస్తే మేం కన్నడిగులమంతా.. భారత సైన్యం చైనా సైనికులను తరిమికొట్టినట్టు వారిని తరిమేస్తాం. దండయాత్రకు దిగడానికి ఇది వేరే దేశమేమీ కాదు.. మనమంతా ఒకే దేశం. అయితే, వారి వ్యాఖ్యలకు మేం సమాధానం చెప్పాలి. సమస్యను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాం."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం

అంతకుముందు, సరిహద్దు వివాదంపై మాట్లాడిన శివసేన(ఠాక్రే) సీనియర్ నేత సంజయ్ రౌత్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చైనా మన దేశంలోకి ఎలా ప్రవేశించిందో.. కర్ణాటకలోకి మేం అలా చొచ్చుకెళ్తాం. మాకు ఎవరి అనుమతీ అవసరం లేదు. చర్చల ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. కానీ, కర్ణాటక సీఎం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. మహారాష్ట్రలో ఉన్న బలహీన ప్రభుత్వం సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు' అంటూ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details