తెలంగాణ

telangana

ఆర్​సీ లేకుండా బండి తోలితే అంతే.. సుప్రీం కీలక తీర్పు

By

Published : Oct 1, 2021, 5:32 AM IST

Updated : Oct 1, 2021, 5:41 AM IST

చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే బీమా దరఖాస్తును తిరస్కరించొచ్చని సుప్రీం కోర్టు(Supreme Court news today) ఆదేశించింది. కారు చోరీ వ్యవహారంలో ఈ కీలక తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు.

SC
సుప్రీం కోర్టు

వాహనానికి చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకపోతే బీమా క్లెయింను తిరస్కరించొచ్చని సుప్రీంకోర్టు(Supreme Court of India) పేర్కొంది. చోరీ అయిన ఓ కారుకు సంబంధించిన బీమా వివాదంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్‌ పత్రాల గడువు తీరి ఉండడంతో బీమా క్లెయింను(Insurance Claim) తిరస్కరించింది. పాలసీ నిబంధనలు, షరతుల ప్రాథమిక ఉల్లంఘన జరిగినట్లు తేలితే బీమా మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించొచ్చని స్పష్టం చేసింది.

రాజస్థాన్‌కు చెందిన ప్రైవేటు కాంట్రాక్టర్‌ సుశీల్‌ కుమార్‌ గోడారా తన బొలెరో వాహనానికి పంజాబ్‌లో యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థ నుంచి రూ.6.17 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నాడు. ఆ వాహనానికి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ గడువు 2011 జులై 19న ముగిసిపోయింది. అదే నెల 28న అతడి కారు జోధ్‌పుర్‌లో కనిపించకుండా పోయింది. అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో అతడు కేసు పెట్టాడు. కారు ఆచూకీ తెలియలేదంటూ పోలీసులు తుది నివేదిక ఇచ్చారు. బీమా మొత్తం కోసం సుశీల్‌ కుమార్‌ క్లెయిం చేసుకోగా రిజిస్ట్రేషన్‌ లేనందున చెల్లించలేమంటూ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థ తిరస్కరించింది.

సుశీల్‌ రాజస్థాన్‌లోని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార మండలిని ఆశ్రయించగా అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ బీమా సంస్థ జాతీయ మండలిలో రివ్యూ పిటిషన్‌ వేసింది. అక్కడా బీమా చెల్లించాల్సిందేనంటూ తీర్పు వచ్చింది. దీనిపై ఆ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

"చోరీ జరిగిన రోజున కారును చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకుండానే వినియోగించారు. అంటే మోటార్‌ వాహనాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారు. కాబట్టి బీమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టమవుతోంది. ఈ సందర్భంలో బీమా క్లెయింను తిరస్కరించడానికి ఇన్సూరెన్స్‌ సంస్థకు హక్కు ఉంది" అని ధర్మాసనం పేర్కొంది.

వాహనాల పత్రాలన్నీ అక్టోబర్‌ 31 వరకు చెల్లుబాటు
వాహనాల పత్రాలన్నీ అక్టోబరు 31వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. డ్రైవింగ్‌ లైసెన్సు, ఫిట్‌నెస్‌, అన్ని రకాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత నవీకరణ (రెన్యువల్‌) చేయించుకోని వారి పత్రాల గడువును అక్టోబరు 31 వరకు పొడిగించామని, అంతవరకు అవి చెల్లుబాటు అవుతాయని వివరించింది.

ఇదీ చదవండి:

'రహదారులు దిగ్బంధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా?'

Last Updated : Oct 1, 2021, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details