తెలంగాణ

telangana

ఉత్తరాదిలో భారీ వర్షాలు.. దిల్లీలో 40 ఏళ్ల రికార్డు బద్దలు.. అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్​!

By

Published : Jul 9, 2023, 12:23 PM IST

Heavy Rain In Delhi : ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి సంభవించింది. హస్తినలో శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్‌ అంతరాయలు ఏర్పడి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. శనివారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఆదివారం ఎనిమిదిన్నర వరకూ దిల్లీలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నదుల్లో ఉద్ధృతి పెరగ్గా.. అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

heavy-rain-in-delhi-records-highest-single-day-rainfall-for-july-since-1982
దిల్లీలో భారీ వర్షం

Delhi Rainfall Today : దేశ రాజధాని దిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిశాయి. దిల్లీలో శనివారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర వరకూ.. 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 నుంచి హస్తినలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు తెలిపారు. ప్రగతి మైదాన్, నెహ్రూ నగర్, పంచశీల మార్గ్, కల్కాజీ, ఐటీఓ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో శనివారం నుంచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వరద నీరు రోడ్డుపైకి చేరడానికి దిల్లీలో మురుగు కాలువల వ్యవస్థ సరిగా లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ.. దిల్లీలో వర్షం, దానివల్ల తలెత్తిన ఇబ్బందులపై దిల్లీ వాసులు సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు పెట్టారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. మరో రెండు మూడు రోజుల పాటు దిల్లీలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

హరియాణాలోని గురుగ్రామ్‌లోనూ వర్షం కారణంగా వాహనదారులకు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. నర్సింగాపూర్ చౌక్ వద్ద రహదారి మొత్తం నీటితో నిండిపోయింది. గురుగ్రామ్‌ సెక్టార్‌ 50 వద్ద కారు నీటిలో చిక్కుకుపోయింది. దానిని బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు స్థానికులు. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. రాజీవ్‌ చౌక్, సుభాష్ చౌక్, భక్త్వార్ సింగ్ రోడ్డు, సెక్టార్‌ 9A, శివాజీ పార్క్‌, బాసాయి రోడ్డు, పటౌడీ రోడ్డు మార్గాల్లో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోనూ వర్షాల బీభత్సం..
Heavy Rain In Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లోనూ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. అసలే కొండ ప్రాంతం కావడం వల్ల వర్షాలకు వరదలు పోటెత్తాయి. కుల్లులో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. బియాస్‌ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బియాస్‌ నదిలో ప్రవాహం భారీగా పెరగడం వల్ల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. శిమ్లా, సిర్మౌర్‌, లాహౌల్‌ స్పితి, చంబా, సొలన్ జిల్లాలో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.

పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అటల్ టన్నెల్‌కు కిలోమీటరు దూరంలో టైలింగ్ నాలా వరద కారణంగా.. మనాలీ-లేహ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఉదయ్‌పుర్‌లోని మద్రంగ్ నాలా, కాలా నాలా వరదలతో పలు రోడ్లను మూసివేశారు. సొలన్ జిల్లా కసౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం.. నిర్మాణ రంగ కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

భారీ వర్షాల కారణంగా శిమ్లా నగరానికి తాగునీటి సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. కసౌలి, కల్కా, శిమ్లాలో జాతీయ రహదారి 5పై కొండ చరియలు విరిగిపడ్డాయి. కుమ్హరహట్టి బైపాస్‌పై విరిగిపడిన కొండచరియలు వాహనదారులను భయపెట్టాయి. కొద్దితేడాతో కొండచరియల నుంచి అటుగా వెళుతున్న వాహనాలు తప్పించుకున్నాయి. జాతీయ రహదారి 5పై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని.. సోలన్ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. శనివారం భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీచేసింది. ఆదివారం కూడా భారీ వర్షాలు కొనసాగవచ్చని హెచ్చరించింది. ఈ వర్షాకాల సీజన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకూ 362 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details