తెలంగాణ

telangana

FRO Srinivasa Rao Murder Case : ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు

By

Published : Aug 3, 2023, 12:19 PM IST

Updated : Aug 3, 2023, 1:47 PM IST

FRO Srinivasa Rao
FRO Srinivasa Rao

12:09 August 03

FRO Srinivasa Rao Murder Case : ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసు.. నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా

Life imprisonment for accused in FRO Srinivasa Rao murder case : పోడు భూముల ఘర్షణలో గుత్తి కోయల చేతిలో హతమైన ఫారెస్టు రేంజ్​ ఆఫీసర్​ (FRO) శ్రీనివాస రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దోషులకు జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి వసంత్ పాటిల్‌ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మడకం తుల, మిడియం నంగాలను దోషులుగా జిల్లా కోర్టు తేల్చింది.

ఇదీ జరిగింది..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ భూములను కాపాడేందుకు ఎదురొడ్డిన అటవీ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు విధి నిర్వహణలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. గతేడాది నవంబర్‌లో చంద్రుగొండ మండలం బెండలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు ఆ పోడు భూముల సాగుదారులైన గుత్తికోయలు యత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు శ్రీనివాసరావు, రామారావులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లతో అధికారులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీంతో బెండలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకోగా.. రేంజ్ అధికారి శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చంద్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూశారు.

ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపింది. ఎఫ్‌ఆర్‌వోపై దాడికి పాల్పడిన వారిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులు మడకం తుల, మిడియం నంగాలను అరెస్ట్‌ చేసి వారి నుంచి వేట కొడవళ్లు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసులో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ హత్యోదంతంపై రిట్ పిటిషన్‌ దాఖలు కాగా.. విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మొత్తం ఘటనపై అధ్యయనం చేసి.. నివేదిక అందించాలని ఆదేశించింది. దీంతో పాటు 2009లో మహిళా అటవీ అధికారిపై దాడి ఘటనపైనా తీసుకున్న చర్యలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంది. మరోవైపు.. ఈ ఘటన అనంతరం గుత్తికోయలను గ్రామం నుంచి బహిష్కరించాలని బెండలపాడు పంచాయతీ తీర్మానించింది. నిందితులు నివసించే ఎర్రబోడు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలించాలని గ్రామసభ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 3, 2023, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details