తెలంగాణ

telangana

'న్యాయాన్ని నిరాకరిస్తే అది అరాచకానికి దారితీస్తుంది'

By

Published : May 15, 2022, 6:56 AM IST

cji ramana latest news

CJI Ramana: న్యాయాన్ని నిరాకరిస్తే అది అరాచకానికి దారి తీస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి రమణ వ్యాఖ్యానించారు. దేశంలో చాలా న్యాయస్థానాలు శిథిల భవనాల్లో నడుస్తున్నాయని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్​-లద్దాఖ్​ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

CJI Ramana: కోర్టులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో చాలా వెనుకబడి ఉన్నామని, తక్షణం ఈ సమస్యను తీర్చకపోతే రాజ్యాంగ సిద్ధాంతం విస్మరణకు గురవుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. శ్రీనగర్‌లో రూ.310 కోట్లతో 1.7 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంతో నిర్మిస్తున్న జమ్మూకశ్మీర్‌-లద్దాఖ్‌ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. "ప్రజలు తమ హక్కులకు, గౌరవ మర్యాదలకు రక్షణ ఉన్నట్లు గుర్తించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పనితీరుకు అత్యవసరం. కేసుల వేగవంతమైన పరిష్కారమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రథమ లక్షణం. న్యాయాన్ని నిరాకరిస్తే అది అరాచకానికి దారితీస్తుంది. ప్రజలు చట్టవిరుద్ధమైన యంత్రాంగాల వైపు చూస్తారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, ఆకాంక్షలకు రక్షణ కల్పించే అధికారం మన దేశంలో కోర్టులకు ఉంది" అని ఆయన చెప్పారు.

అండగా ఆధునిక సాంకేతికత: "భారత్‌లో న్యాయం అందజేసే వ్యవస్థ (జస్టిస్‌ డెలివరీ మెకానిజం) చాలా సంక్లిష్టమైనది. ఖరీదైంది కూడా. ప్రస్తుత ఆధునిక సాంకేతికత.. న్యాయవ్యవస్థకు అండగా నిలుస్తోంది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా నిర్వహించే విచారణలు సమయాన్ని, దూరాన్ని, ఖర్చును తగ్గిస్తున్నాయి. దేశంలో ఇప్పటికీ విస్తృతమైన సాంకేతిక అగాధం నెలకొన్న నేపథ్యంలో దాన్ని పూడ్చడానికి వినూత్న విధానాలను అనుసరించాలి. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల లోటును భర్తీ చేయడం నాకు అన్నింటికంటే ఇష్టం. ఈ వసతులు ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. వాటి కల్పనకు నిరంతరం ప్రయత్నిస్తున్నా"

.

జిల్లా కోర్టులు బలంగా ఉంటేనే వికాసం:న్యాయవ్యవస్థకు జిల్లాస్థాయి కోర్టులే పునాది. అవి బలంగా ఉన్నప్పుడే మొత్తం వ్యవస్థ వికసిస్తుంది. ఎన్నో కోర్టులు శిథిలావస్థలోని అద్దె భవనాల నుంచి నడుస్తున్నాయి. ఖాళీల భర్తీపైనా దృష్టి సారించాను. ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయవ్యవస్థలో 22% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి తక్షణం చర్యలు తీసుకోవాలి. న్యాయమూర్తులకు తగిన భద్రత, నివాస సౌకర్యాలు కల్పించడానికీ చర్యలు చేపట్టాలి.

ప్రత్యామ్నాయ పరిష్కార విధానాలను ప్రోత్సహించాలి:సాధారణంగా కక్షిదారులు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కాబట్టి వారికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి. కక్షిదారులు నిరక్షరాస్యులు కావొచ్చు. చట్టాలపై అవగాహన లేకపోవచ్చు అలాంటి వారికి ఇబ్బందిలేని వాతావరణాన్ని కల్పించండి. జిల్లాస్థాయి న్యాయవ్యవస్థ నిరంతరం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. న్యాయం కోరుతూ ప్రజలు తొలుత వచ్చేది మీ వద్దకే. కక్షిదారులు ప్రత్యామ్నాయ పరిష్కార విధానాలను ఎంచుకొనేలా ప్రోత్సహించాలి’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌.కె.మాథుర్‌, జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సెల్​ఫోన్​ వినియోగంలో మన పిల్లలే టాప్​!

ABOUT THE AUTHOR

...view details