తెలంగాణ

telangana

'2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యం- ఐక్యతే మార్గం'- కాంగ్రెస్​ శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం

By PTI

Published : Jan 4, 2024, 3:17 PM IST

Updated : Jan 4, 2024, 5:22 PM IST

Congress Meeting Today : బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఉద్వేగపూరిత అంశాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీ​ శ్రేణులంతా ఐక్యంగా ఉండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

congress meeting today
congress meeting today

Congress Meeting Today :భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చటానికి ఉద్వేగపూరిత అంశాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్​ శ్రేణులంతా ఐక్యంగా ఉండి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్‌ చేపట్టే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు సన్నాహాలపై చర్చించేందుకు దిల్లీలో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ గురువారం జరిగింది. ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ నాయకులు ప్రియాంక గాంధీ, వేణుగోపాల్‌ సహా AICC ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, ఇతర ముఖనాయకులు పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం వచ్చే 3నెలలపాటు కాంగ్రెస్​ పార్టీ నేతలంతా తమ సమయాన్ని పూర్తిగా పార్టీకే కేటాయించాలన్నారు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్​ గెలుపు కోసం విభేదాలను పక్కనపెట్టాలని, పార్టీ అంతర్గత అంశాలపై మీడియాకు ఎక్కకూడదని నేతలను కోరారు. బీజేపీ చేసే తప్పులను, అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ విజయానికి పార్టీ నేతలంతా సమష్ఠిగా కృషి చేయాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

'అంకితభావంతో కార్యకర్తలు పనిచేయాలి'
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టినందుకు ఆయనను ప్రశంసించారు. మణిపుర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్​ త్వరలో చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్ర సామాజిక న్యాయ సమస్యలను వెలికితీస్తుందని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ అందించిన సేవలను తాను గౌరవిస్తానని చెప్పారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఎన్డీఏను ఓడించి పదేళ్లపాటు అధికారంలో ఉండేలా సోనియా చేశారని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామం, నగరంలో కార్యకర్తలు అండగా నిలిచారని, ప్రస్తుతం కూడా అంతే అంకితభావంతో పనిచేయాలని మల్లికార్జున ఖర్గే సూచించారు.

'కాంగ్రెస్​, విపక్ష కూటమి ఇండియాలోని పార్టీలపై బీజేపీ దాడులు చేస్తోంది. ఇండియా కూటమిలో బలమైన క్యాడర్, భావజాలం ఉన్న పార్టీలు ఉన్నాయి. ఎన్‌డీఏ పేరుకు మాత్రమే మిగిలి ఉంది. ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో కాంగ్రెస్ అందించిన సహకారాన్ని విస్మరించడానికి మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది.' అని ఖర్గే పార్టీ సమావేశంలో విమర్శించారు.

మరోవైపు, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపుర్​ నుంచి మహారాష్ట్ర వరకు చేపడుతున్న యాత్రకు 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'గా ఆ​ పార్టీ పేరు మార్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా ఇండియా కూటమి నేతలందరికీ ఆహ్వానాలు పంపుతామని చెప్పారు. పార్టీ సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలపైనే చర్చ జరిగిందని జైరాం రమేశ్ తెలిపారు. '2024 లోక్​సభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, రాహుల్ గాంధీ త్వరలో చేపట్టే భారత్ జోడో​ న్యాయ్ యాత్ర గురించి చర్చ జరిగింది. జనవరి 14 నుంచి రాహుల్​ మణిపుర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభిస్తారు.' అని చెప్పారు.

కేజ్రీ ఇంటిపై ఈడీ రైడ్? దిల్లీ పోలీసుల భారీ భద్రత- రోడ్లన్నీ బ్లాక్!

ఎన్నికల అస్త్రంగా 'రామ మందిరం'- బీజేపీ 15రోజుల ప్లాన్ రెడీ- RSSతో కలిసి కార్యక్రమాలు!

Last Updated : Jan 4, 2024, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details