తెలంగాణ

telangana

'జాబిల్లీ.. వచ్చేస్తున్నాం..'.. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం సక్సెస్

By

Published : Jul 14, 2023, 2:43 PM IST

Updated : Jul 14, 2023, 5:08 PM IST

Chandrayaan 3 launch : చంద్రమామపై చెరగని ముద్ర వేయడానికి, జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక అడుగు వేసింది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3ని బాహుబలి రాకెట్‌గా గుర్తింపు పొందిన ఎల్‌వీఎం3-ఎం4 ద్వారా నింగిలోకి పంపింది. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడనుంది. చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన దేశంగా అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా సరసన భారత్‌ చేరనుంది.

CHANDRAYAAN 3 LAUNCH
CHANDRAYAAN 3 LAUNCH

చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం సక్సెస్

Chandrayaan 3 launch : నాలుగేళ్ల క్రితం చంద్రయాన్‌-2 ప్రయోగంలో ఆఖరి క్షణాల్లో ఎదురైన అనూహ్య వైఫల్యాలనే విజయ సోపానాలుగా మార్చుకొని సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా ఇస్రో అడుగులు వేసింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్‌, రోవర్‌ను దించే లక్ష్యంతో అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగ వేదిక నుంచి ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3ని ఇస్రో ప్రయోగించింది.

16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్‌ రాకెట్‌ నుంచి విడిపోయింది. దీన్ని భూమి చుట్టూ ఉన్న 170X 36 వేల 500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్‌ ప్రవేశపెట్టింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ భూమి చుట్టూ 24 రోజులు తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్స్‌గా పేర్కొంటారు. తర్వాత చంద్రుడి దిశగా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌-3ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజిన్‌ను మండించి చంద్రయాన్‌-3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 తొలిదశ విజయవంతం కావటం వల్ల శాస్తవేత్తల్లో సంతోషం వ్యక్తమైంది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను మోసుకుని అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరింది. సకాలంలో పేలోడ్‌ను మండించి తొలి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దిశగా వెళ్లేందుకు మధ్యాహ్నం 2.42 గంటలకు మూడోదశ పేలోడ్‌ను మండించారు. మూడు దశలు నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తయ్యాయి. స్పేస్‌క్రాఫ్ట్‌ను అవసరమైన ఎత్తుకు చేర్చేందుకు 3దశలను విజయవంతంగా పూర్తి చేసుకొంది. మధ్యాహ్నం 2.54 గంటలకు మూడో దశ ముగిసిందని, జాబిల్లి దిశగా ప్రయాణం మొదలైనట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు.

"భారత్‌కు కృతజ్ఞతలు. చంద్రుని దిశగా చంద్రయాన్‌-3 ప్రయాణం మొదలైంది. ఎల్‌విఎం3-ఎం4 రాకెట్‌ చంద్రయాన్‌-3 క్రాఫ్ట్‌ను భూమి చుట్టు ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది. 170/36,500 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరింది. చంద్రయాన్‌-3 రాబోయే రోజుల్లో కక్ష్యలో అవసరమైన ప్రక్రియ పూర్తిచేసుకొని గమ్యం దిశగా ప్రయాణించాలని కోరుకుందాం. చంద్రయాన్‌-3 చంద్రుని దిశగా మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం. ఆగస్టు 23న సా.5.47కు సాఫ్ట్‌ల్యాండింగ్‌ జరగనుంది"

--ఎస్‌.సోమ్‌నాథ్‌ ఇస్రో ఛైర్మన్‌

Chandrayaan 3 launch vehicle : మొత్తంగా చంద్రయాన్‌-3 సుమారు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. జాబిల్లిపై ల్యాండర్‌ సురక్షితంగా దిగేందుకు యాక్సెలెరోమీటర్‌, ఆల్టీమీటర్‌, ఇంక్లినోమీటర్‌, టచ్‌డౌన్‌ సెన్సర్‌, అవరోధాలు తప్పించుకోవడానికి కెమెరాలు తదితర సెన్సర్లు ఉంటాయి. ఇవి చంద్రయాన్‌-2లో పొందుపరిచిన వాటికంటే మెరుగైనవి.

చంద్రయాన్-3లో పంపుతున్న ల్యాండర్

ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుంది. చంద్రునిపై మృదువుగా, సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్‌-3లో ఆర్బిటర్‌ను పంపడంలేదు. చంద్రయాన్‌ 2లో ప్రయోగించిన ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో ఇదివరకు వెల్లడించింది.

చందమామ ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్‌ అయ్యే సామర్థ్యం భారత్‌కు ఉందని చాటడం, జాబిల్లిపై రోవర్‌ను నడపగలమని రుజువు చేయడం, చంద్రుడి ఉపరితలంపై శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం.. చంద్రయాన్‌-3 ప్రయోగం లక్ష్యంగా ఇస్రో నిర్దేశించుకుంది. ఇప్పటివరకూ అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా మాత్రమే జాబిల్లిపై ల్యాండర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా దించాయి. ఐతే ఇప్పటిదాకా చంద్రుడిపై ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువానికి వెళ్లటం అక్కడి ప్రత్యేక పరిస్థితుల గురించి శోధించటం భారత్‌ ప్రత్యేకత.

Chandrayaan 3 Budget : మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 613 కోట్ల రూపాయలను ఇస్రో ఖర్చు చేసింది. చంద్రయాన్‌-3 బరువు 3900 కిలోలు, అందులో ల్యాండర్‌, రోవర్‌ బరువు 1752 కిలోలు.

Last Updated : Jul 14, 2023, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details