ETV Bharat / opinion

ఇండియా స్పేస్​ రేస్​.. అగ్ర రాజ్యాలతో పోటీ.. ఇస్రో ఫ్యూచర్​ ప్లాన్స్​ ఇవే!

author img

By

Published : Jul 14, 2023, 6:44 AM IST

ISRO Future Missions List : ఇస్రో.. కొంతకాలంగా అంతరిక్షరంగ ప్రయోగాల్లో దూసుకెళ్తోంది. అంతరిక్ష రంగంలో అంతర్జాతీయంగా మిగతా సంస్థలకు పోటీనిస్తూ గగన వీధుల్లో మేము సైతం అంటోంది. వీటితో పాటు భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానించి ప్రయోగాలకు మరింత ఊతం ఇస్తోంది. అతి తక్కువ ఖర్చుతో మన్నికైన ప్రయోగాలు చేయడం ఇస్రో లక్ష్యం. వీటితో పాటు వాణిజ్య ప్రయోగాలు చేస్తూ కూడా తన ఆదాయం పెంచుకుంటుంది. గతంలో ప్రయోగాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన మనం.. ఇప్పుడు మరెన్నో దేశాలకు అంతరిక్ష రంగంలో సాయం చేస్తున్నాం. అంతరిక్ష రంగంలోకి స్టార్టప్‌లను కూడా భారత్‌ ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్‌ ఏజెన్సీలతో రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించి అమెరికా లాంటి దేశాల సరసన నిల్చుంది. ఎలా చూసుకున్నా రానున్న రోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ISRO Future Missions List
ISRO Future Missions List

ISRO Future Missions List : అంతరిక్ష రంగం రానున్న రోజుల్లో చాలా కీలకం. యుద్ధమంటూ వస్తే అది కమ్యూనికేషన్ లేదా బయో వార్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఆయా దేశాలు కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌ ఆధారిత సేవలపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటాయి. అయితే, ఈ విషయంలో మనం చాలా ముందున్నామని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలకు అవసరమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థకు సంబంధించిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. చాలా చిన్న దేశాలు తమ శాటిలైట్లను ప్రయోగించడానికి విదేశాలపై ఆధారపడుతుంటాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇస్రో ఇప్పటివరకు 36 దేశాలకు చెందిన 384 శాటిలైట్లను ప్రయోగించింది. ఇందులో 10 వాణిజ్య మిషన్లు కాగా.. కొన్ని భారత్‌కు చెందినవి ఉన్నాయి. ఈ ప్రయోగాల్లో అమెరికాకు చెందినవి ఎక్కువగా ఉండటం గమనార్హం.

అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు స్పేస్​ ఏజెన్సీలు..
India Private Space Agencies : ప్రపంచ స్పేస్‌ ఏజెన్సీలతో ప్రయోగాల్లో పోటీ పడుతున్న భారత్‌.. ఇస్రోతో పాటు ప్రైవేట్‌ స్పేస్‌ ఏజెన్సీలను కూడా ఈ రంగంలోకి ఆహ్వానించింది. భారత తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగించిన స్కైరూట్‌ ఏరో స్పేస్ ఏజెన్సీ తన మెుదటి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వీటితో పాటు అగ్నికుల్‌ సంస్థ తన మెుదటి లాచింగ్‌ ప్యాడ్‌ను షార్‌లో ఏర్పాటు చేసింది. ఇదేకాక ధ్రువ స్పేస్‌ లాంటి సంస్థలు ఇప్పటికే ప్రయోగాల్లో పాలుపంచుకుని భారత్‌లో అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల పరంపర కొనసాగిస్తున్నాయి. అలాగే వాణిజ్య ఉపగ్రహా ప్రయోగాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో.. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-SSLVని అభివృద్ధి చేసింది. ప్రైవేట్‌ ప్రయోగాలకు ఇస్రో ప్రధాన విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌ 2021-22లో 1731 కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జిస్తే.. 2023-24లో రూ.3,504కోట్లకు చేరింది. కొన్నేళ్లలోనే భారత వాణిజ్య అంతరిక్ష రంగం ఈ విధంగా అభివృద్ధి చెందడం పట్ల పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ కూడా ఇస్రోను, దాని అనుబంధ సంస్థలను అభినందించింది.

ఆ దేశాలతో పోటీ!
ISRO Competitors : అమెరికా, రష్యా, యూరోపియన్‌ యూనియన్‌ లాంటి స్పేస్‌ ఏజెన్సీలతో పోటీ పడే స్థానానికి ఇప్పుడు ఇస్రో, చైనా స్పేస్‌ ఏజెన్సీలు కూడా చేరాయి. అయితే అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు ఇటీవల వాణిజ్య ప్రయోగాలను సొంతంగా చేపట్టడం లేదు. ఇదే చాలా సంస్థలకు అదృష్టంగా మారింది. స్పేస్‌ ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌, వర్జిన్‌ గాలాక్టిక్‌ సంస్థలు ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి. ఇదే బాటలో గతేడాది భారత తొలి ప్రైవేట్ రాకెట్‌ ప్రయోగం చేసిన స్కై రూట్‌ ఏరో స్పేస్‌ కూడా నిలిచింది. విదేశాలకు చెందిన చాలా ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు భారత అంతరిక్ష రంగం వైపు చూస్తున్నాయి. కీలకమైన సమయంలో ఇస్రో ప్రైవేట్‌ సంస్థలకు భారత తలుపు తెరిచింది. దీంతో చాలా ప్రైవేట్‌ కంపెనీలు తమ శాటిలైట్లను ప్రయోగించడానికి భారత్‌ వైపు చూస్తున్నాయి. అలాగే భారత్‌ నుంచి ప్రయోగించే ఉపగ్రహాలకు వ్యయం తక్కువ అవుతుండటం, వాతావరణం కూడా అనుకూలంగా ఉండటం లాంటి పరిస్థితులు ఇస్రోకు కలిసొచ్చే అంశం.

ఇస్రో రేసు గుర్రాలు!
ISRO Launch Vehicle Family : ఇస్రో ప్రయోగాలకు మరో తిరుగులేని బ్రహ్మాస్త్రం PSLV. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో వెలుగొందుతున్న బహుళ లాంచ్‌ వెహికల్‌ ఇది. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి జరిగిన 61 ప్రయోగాల్లో 41 ప్రయోగాలు PSLV ద్వారా ప్రయోగించినవే. వాటిలో కేవలం రెండే విఫలమయ్యాయి. మిగిలినవన్నీ విజయవంతమే. ఇంత కచ్చితత్వం ఎక్కడా సాధ్యం కాదు. అందుకే PSLVని అత్యంత విశ్వసనీయతగా ఇస్రో భావిస్తోంది. ఇస్రో 2 టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుండగా.. చిన్న విదేశీ ఉపగ్రహాలను PSLV ద్వారా ప్రయోగించి వాణిజ్య పరంగా ఆదాయం గడిస్తోంది. అయినా సొంతంగా ఉపగ్రహాల ప్రయోగాలు చేసే ఇస్రోకు వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో వాటా తక్కువేనని చెప్పాలి. కానీ, ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో LVM-3.. ఇస్రోకు మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. భారత వాటా వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో 2% మాత్రమే ఉంది. కానీ, ప్రస్తుత చంద్రయాన్‌-3 ప్రయోగంతో భారత్‌కు మరింత గుర్తింపు రానుందని నిపుణులు భావిస్తున్నారు.

భలే మంచి చౌక బేరమూ!
ISRO Satellite Launch Cost : 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.12వేల 543 కోట్లు కేటాయించారు. ఆరేళ్ల నుంచి చూసుకుంటే అంతరిక్ష ప్రయోగాలకు కేటాయింపులను కేంద్రం పెంచుతూ వస్తోంది. ఇదీకాక వాణిజ్య ప్రయోగాల వల్ల వస్తున్న ఆదాయంతో ఇస్రో అంతరిక్ష ప్రయోగాల కోసం పెద్ద ఎత్తున బడ్జెట్‌ కేటాయిస్తోంది. 1950లో ప్రారంభమైన వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా అప్రతిహాతంగా కొనసాగుతోంది. దీంతో అమెరికాకు మరే ఇతర దేశం పోటీ లేకుండా పోయింది. కానీ, ప్రస్తుతం భారత్ చేపడుతున్న ప్రయోగాల వల్ల త్వరలోనే అమెరికాతో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన డేటాను పంచుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే కానీ జరిగితే ఈ రంగంలో భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించొచ్చు. అప్పుడు నాసా సాంకేతికతను కూడా మనం బదలాయింపు చేసుకునే వీలుంటుంది. దీంతో ఇస్రో మరింత ముందడుగేసే అవకాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.