తెలంగాణ

telangana

Live Video.. బిజీ రోడ్​లో జనంపైకి దూసుకొచ్చిన కారు

By

Published : Feb 13, 2023, 6:59 PM IST

రద్దీగా ఉన్న మార్కెట్ రోడ్​లోకి ఓ కారు దూకుకెళ్లి బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆ కారు ఇద్దర్ని ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది. మరో ఘటనలో జాతర్లో ఏర్పాటు చేసిన బెలూన్​ దుకాణంలోని.. గ్యాస్​ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం బంగాల్​లో ఆదివారం రాత్రి జరిగింది.

ludhiana car accident
ludhiana car accident

మార్కెట్​ రోడ్​లో బీభత్సం సృష్టించిన కారు

పంజాబ్​లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇరుకైన వీధిలో అతివేగంగా వచ్చిన కారు ఇద్దర్ని ఢీకొట్టింది. దీంతో వారు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదం లుథియానా జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. లుథియానాలో చౌడా బజార్​లోని ఇరుకు సందులోకి ఓ థార్​ కారు అతివేగంగా ఓ దుకాణం వైపుగా దూసుకొచ్చింది. దీంతో దుకాణం బయట ఉన్న వ్యక్తులు కారును గమనించి.. తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారికి ఆ అవకాశం లభించలేదు. ఫలితంగా కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. వెంటనే దుకాణదారులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

మార్కెట్​ రద్దీగా ఉన్నా సరే.. కారు డ్రైవర్​ అతివేగంగా కారును నడిపినట్లు దుకాణదారులు చెప్పారు. ప్రమాదం అనంతరం.. కారు డ్రైవర్​ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. అయితే కారు డ్రైవర్​కు ఓ రాజకీయ నాయకుడితో దగ్గర సంబంధాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

జాతరలో పేలిన గ్యాస్ సిలిండర్​.. నలుగురు మృతి
బంగాల్​లో భారీ ప్రమాదం జరిగింది. జయ​నగర్​లో బెలూన్​లలో గ్యాస్​ నింపే సిలిండర్​ పేలి నలుగురు మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
రాజాపుర్​- కరాబాగ్​ పంచాయితీ పరిధిలో గత వారం రోజులుగా జాతర జరుగుతోంది. దీనిలో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో పలు దుకాణాలు ఏర్పాటుచేశారు. అందులో బెలూన్​లు అమ్మే హల్దర్​ అనే వ్యక్తి కూడా తన దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 9:30 గంటలకు హల్దర్​ దుకాణంలో ఉన్న బెలూన్​కు గాలిని నింపే సిలిండర్​ పేలింది. దీంతో హల్దర్​(62), కుతిబుద్దీన్​ మిస్త్రీ(36), షాహిన్​ మొల్లా(14), అబిర్​ గజీర్​ మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.

కారును ఢీకొట్టిన బస్సు

ఒకే కుటుంబంలో నలుగురు..
తమిళనాడులో ఓ కారును బస్సును ఢీకొట్టడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై.. తిరుచ్చి వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు తిట్టకుడి సమీపంలో ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళ, వృద్ధుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృతులను మన్నార్‌గుడి ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన మధివానన్(35), కౌసల్య(32), దురై(60), ధావమణి(55)గా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details