ETV Bharat / bharat

అదానీ వివాదంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

author img

By

Published : Feb 13, 2023, 5:12 PM IST

Updated : Feb 13, 2023, 5:38 PM IST

సంచలనం సృష్టిస్తున్న అదానీ వ్యవహారంలో మదుపర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కమిటీ కోసం సీల్డ్‌ కవర్‌లో నిపుణుల పేర్లను ఇవ్వాలనుకుంటున్నట్లు న్యాయస్థానానికి నివేదించింది.

adani and hindenburg case
adani and hindenburg case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం నేపథ్యంలో రెగ్యులేటరీ మెకానిజంను బలోపేతం చేయడం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ కమిటీ కోసం సీల్డ్‌ కవర్‌లో నిపుణుల పేర్లను ఇవ్వాలనుకుంటున్నట్లు సోమవారం కేంద్రం న్యాయస్థానానికి వివరించింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కమిటీ వేయాలని ఇంతకు ముందు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం స్పందించింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని సెబీ చూస్తోందని సుప్రీంకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.

హిండెన్‌బర్గ్‌ నివేదిక, తదనంతర పరిణామాలతో స్టాక్‌మార్కెట్‌లో రూ.లక్షల కోట్లు ఆవిరి కావడంపై శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకు పటిష్ఠమైన యంత్రాంగం రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో నిపుణుల కమిటీని వేయాలని సూచించింది.

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ నివేదికపై.. అనంతరం అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువ భారీగా పతనం కావడంపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మదుపర్ల సొమ్మును రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కేంద్రాన్ని, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను సుప్రీంకోర్టు కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.. విధి విధానాలు ఎలా ఉండాలన్న అంశంపై కేంద్రం, సెబీలు తమ వైఖరిని తదుపరి విచారణలో తెలిపేలా చూడాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తం అంశాన్ని సెబీ జాగ్రత్తగా పరిశీలిస్తోందని ధర్మాసనానికి మెహతా తెలిపారు.

Last Updated :Feb 13, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.