ETV Bharat / bharat

అనేక రోజులుగా ఇంట్లోనే తల్లి మృతదేహం.. బతికుందని అందరినీ నమ్మిస్తూ..

author img

By

Published : Feb 13, 2023, 4:37 PM IST

చనిపోయిన తల్లి మృతదేహాన్ని కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంచుకుంది ఓ కుమార్తె. ఈ హృదయవిదారక ఘటన బంగాల్​లో జరిగింది. ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తెను అరెస్ట్ చేశారు.

daughter stay with mother dead body
ఇంట్లోనే తల్లి మృతదేహం

బంగాల్​లో అమానవీయ ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం మరణించిన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే పెట్టుకుంది ఓ కుమార్తె. ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతురాలి కుమార్తెను అరెస్ట్​ చేశారు. అయితే మృతురాలి కుమార్తె మానసిక దివ్యాంగురాలని స్థానికులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
కోల్​కతాలోని బెలేఘటా రాయ్​లేన్ రోడ్​ నంబర్​ 4లో.. నమితా ఘోషల్​ అనే 90 ఏళ్ల వృద్ధురాలు తన భర్త, కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో జీవించేది. అయితే కొన్నేళ్ల క్రితం వృద్ధురాలి భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో మానసిక దివ్యాంగురాలైన తన కుమారైతో కలిసి వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. కొన్నేళ్లుగా నమితా ఘోషల్ సైతం అనారోగ్యంపాలైంది. ఇటీవల తన ఇంటి ముందు ఉన్న కుళాయికి వెళ్లి నీరు పడుతుండగా ఒక్కసారిగా జారిపడిపోయింది నమితా. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమెకు సరైన వైద్యం అందలేదు. దీంతో కొన్నాళ్ల క్రితం నమితా మరణించింది.

అయితే అప్పటి నుంచి తన తల్లి ఇంట్లోనే క్షేమంగా ఉందని వృద్ధురాలి కుమార్తె చుట్టుపక్కల వారిని నమ్మించింది. కొన్ని రోజులుగా వారి ఇంటి నుంచి కుళ్లిన వాసన రావడం వల్ల ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో వృద్ధురాలు ఎక్కడని వారు ఆమె కుమారైను ప్రశ్నించగా చాలా కాలం క్రితం తన తల్లి మరణించిందని.. మృతదేహం ఇంట్లోనే ఉన్నట్లు తెలిపింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. మృతురాలి కుమార్తెను అరెస్ట్ చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.