తెలంగాణ

telangana

కుడివైపు ఉర్దూ, ఎడమవైపు హిందీ.. ఒకే బోర్డుపై రెండు తరగతులకు పాఠాలు!

By

Published : May 17, 2022, 11:43 AM IST

Updated : May 17, 2022, 12:14 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక.. చెట్టు కిందే పాఠాలు చెప్పే టీచర్లను చూశాం. కరోనా లాక్​డౌన్​ సమయంలో విద్యార్థుల ఇళ్లకే వెళ్లి చదువు నేర్పిన ఉపాధ్యాయుల గురించి విన్నాం. కానీ.. ఇది వేరే లెవల్. ఒకే గదిలో రెండు తరగతుల విద్యార్థుల్ని కూర్చోబెట్టి.. బోర్డును చెరిసగం పంచుకుని హిందీ, ఉర్దూ పాఠాలు ఒకేసారి చెబుతున్నారు ఇద్దరు టీచర్లు. ఎవరు ఏం చెబుతున్నారో అర్థం కాక చూస్తున్న పిల్లల్ని అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు మరో ఉపాధ్యాయురాలు.

bihar school news 2022
కుడివైపు ఉర్దూ, ఎడమవైపు హిందీ.. ఒకే బోర్డుపై రెండు తరగతులకు పాఠాలు!

కుడివైపు ఉర్దూ, ఎడమవైపు హిందీ.. ఒకే బోర్డుపై రెండు తరగతులకు పాఠాలు!

తరగతి గదిలో ఒకే బోర్డుపై ఇద్దరు టీచర్లు ఒకేసారి హిందీ, ఉర్దూ పాఠాలు బోధించడం విమర్శలకు దారితీసింది. బిహార్​ కటిహార్​లోని ఆదర్శ్ మాధ్యమిక పాఠశాలలో కనిపించిన దృశ్యమిది. ఇక్కడ బడిలో సరైన మౌలిక వసతులు లేవు. అందుకే రెండు తరగతుల విద్యార్థుల్ని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సి వస్తోంది.

ఒకే తరగతి గదిలో ముగ్గురు టీచర్లు

బోర్డుకు కుడి వైపు ఓ ఉపాధ్యాయుడు ఉర్దూ క్లాస్ చెబుతుండగా.. ఎడమ వైపు మహిళా టీచర్ హిందీ పాఠాలు బోధిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో కుర్చీపై కూర్చున్న ఓ ఉపాధ్యాయురాలు.. బెత్తం పట్టుకుని పిల్లలు అల్లరి చేయకుండా చూస్తున్నారు. ఇలా ముగ్గురు టీచర్లు పరస్పరం ఏమాత్రం సంబంధం లేకుండా విద్యాబోధన సాగిస్తుండగా.. విద్యార్థులు అయోమయంతో చూస్తూ ఉండిపోతున్నారు. ఏ పాఠం వినాలో, ఏది బుర్రకు ఎక్కించుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.

విద్యార్థుల్ని అదుపు చేస్తున్న మూడో టీచర్

ఒకప్పుడు ఈ పాఠశాలలో విద్యాబోధన సవ్యంగానే సాగేది. అయితే.. 2017లో సమీపంలో ఉండే ఉర్దూ ప్రాథమిక పాఠశాలను.. ఈ ఆదర్శ్ పాఠశాలలో విలీనం చేసింది విద్యా శాఖ. అయితే.. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా.. ఇలా ఒకే గదిలో రెండు సబ్జెక్ట్​లను ఒకేసారి బోధించాల్సి వస్తోంది.

కుడివైపు ఉర్దూ, ఎడమవైపు హిందీ.. ఒకే బోర్డుపై రెండు తరగతులకు పాఠాలు!

"ఉర్దూ పాఠశాలను తరలించడం వల్ల వచ్చిన ఇబ్బందుల్ని అధికారులు పట్టించుకోలేదు. ఒకే బోర్డుపై రెండు వేర్వేరు సబ్జెక్టులు బోధించడం విద్యార్థులకు ఏమాత్రం మంచిది కాదు. వచ్చే ఏడాదిలో విద్యార్థుల సంఖ్య తగ్గితే.. ఒక గదిని పూర్తిగా ఉర్దూ పాఠశాలకు కేటాయిస్తాం." అని చెప్పారు జిల్లా విద్యా శాఖ అధికారి కామేశ్వర్ గుప్తా. మరోవైపు.. ఈ మౌలిక వసతుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : May 17, 2022, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details