తెలంగాణ

telangana

Bihar girl google job: ఈమె జీతం రూ.కోటిపైనే

By

Published : Jan 6, 2022, 8:21 AM IST

Bihar girl google job: బహుముఖప్రజ్ఞాశాలి.. ఇది సంప్రీతి యాదవ్‌కు సరిగ్గా సరిపోతుంది. చదువు, ఆటలు, సంగీతం.. అన్నింట్లోనూ ముందే. అంతేనా.. ప్రాంగణ నియామకాల్లో నాలుగు పెద్ద సంస్థల్ని మెప్పించింది. తాజాగా గూగుల్‌లో రూ.కోటీ పది లక్షల వేతనంతో ఉద్యోగాన్నీ సంపాదించింది. ఈమె గురించి ఇంకా తెలుసుకోవాలా? ఇది చదివేయండి.

Bihar girl google job
ఈమె జీతం రూ.కోటిపైనే

Bihar girl google job: సంప్రీతిది బిహార్‌లోని పట్నా. నాన్న రామశంకర్‌ యాదవ్‌ ఫైనాన్స్‌ సంస్థలో ఉన్నతోద్యోగి. అమ్మ శశిప్రభ పట్టణాభివృద్ధి విభాగంలో ఉపసంచాలకులు. ఉన్నత స్థాయిలో స్థిరపడి, అమ్మానాన్నకి మంచి పేరు తేవడం ఈమె కల. పది, ఇంటర్‌ ఏ తరగతైనా ఎప్పుడూ ముందే. దిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గత ఏడాదే కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. ప్రాంగణ నియామకాల్లో అడోబ్‌, ఫ్లిప్‌కార్ట్‌, మైక్రోసాఫ్ట్‌తోపాటు మరో సంస్థలో ఉద్యోగావకాశాలను దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకొని చేరింది. అక్కడ ఆమె వార్షిక వేతనం రూ.44లక్షలు. దీనిలో ఉద్యోగం చేస్తూనే గూగుల్‌కు దరఖాస్తు చేసుకుంది. 9 అంచెల మౌఖిక పరీక్షను విజయవంతంగా పూర్తిచేసుకుని రూ.1.10 కోట్ల వార్షిక వేతనంతో కొలువు దక్కించుకుంది.

ఈమె జీతం రూ.కోటిపైనే

'ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సంపాదించినా.. వేరే సంస్థలకూ దరఖాస్తు చేసుకోవాలనుకున్నా. వాటిల్లో గూగుల్‌ ఒకటి. వాళ్లకి నా రెజ్యూమె నచ్చింది. 9 దశల్లో వివిధ అంశాల్లో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు. లండన్‌ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు' అంటోన్న సంప్రీతికి శాస్త్రీయ సంగీతంలోనూ ప్రావీణ్యముంది. నాటకాలు, ఆటలన్నా ఇష్టమే. ఐఐటీ- దిల్లీ, ముంబయిల్లో పలు పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించింది కూడా. ఇన్నింట్లో ఎలా రాణిస్తున్నావంటే.. ఫలితం గురించి కంగారు పడకుండా ఇష్టంగా కష్టపడితే అనుకున్న స్థానానికి చేరడం సులువే అంటోంది.

ఇదీ చదవండి:బోరు బావి నుంచి వంటగ్యాస్​- ఈ ఫ్యామిలీ ఎంత లక్కీనో!

ABOUT THE AUTHOR

...view details