తెలంగాణ

telangana

'హాథ్రస్​ ఘటన కేసులో సీబీఐ దర్యాప్తునకు డిమాండ్'

By

Published : Oct 2, 2020, 10:57 AM IST

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ యువతి హత్య ఘటన కేసును సీబీఐ.. దర్యాప్తు చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. తమపై జిల్లా అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆరోపించారు.

Hathras Victim's father demands CBI probe
హాథ్రస్ యువతి హత్య​ కేసులో సీబీఐ విచారణకు డిమాండ్

హాథ్రస్ యువతి హత్య ఘటన కేసు విషయంలో అధికారులు తమను ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాధికారులు ఒత్తిడి చేసి తమను పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారని.. అక్కడ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు అధికారులు.. ముగ్గురు కుటుంబ సభ్యులతో కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని బాధితురాలి తండ్రి తెలిపారు.

స్పందించిన రాహుల్ గాంధీ

ఈ చర్యపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని పోస్ట్ చేశారు. అందులో, బాధితురాలి కుటుంబానికి చెందిన ఓ మహిళ.. అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉందని, వాళ్లు తమని ప్రశాంతగా బతకనివ్వరని ఆరోపించారు. జిల్లా మెజిస్ట్రేట్, తమ ఆరోపణలు నమ్మశక్యంగాలేవని అంటున్నారని వెల్లడించారు.

"ఇంకెన్నాళ్లిలా పేద దళిత-ఆదివాసుల నోర్లు మూసేస్తారు? ఎన్నాళ్లని నిజాన్ని పాతేస్తారు? ఇంకా ఎంత మంది కూతుళ్లకు రహస్యంగా అంత్యక్రియలు జరుపుతారు? ఇప్పుడు దేశం విప్పిన గళాన్ని మీరు ఆపలేరు"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ప్రియాంక గాంధీ ట్వీట్

ఈ ఘటన తర్వాతి పరిణామాలపై బాధితురాలి తండ్రి పలు ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. అందులో 'దీనితో మేము సంతృప్తి పడట్లేదు. మా కూతురి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేయాలి. అధికారులు మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. మాతో మాట్లాడటానికి మీడియా వాళ్లనీ అనుమతించట్లేదు' అని ఆ వీడియోలో ఉంది.

మెజిస్ట్రేట్ ఏం మాట్లాడారు?

హాథ్రస్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్స్​కర్ బాధితురాలి కుటుంబసభ్యులతో జరిపిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

'మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. నెమ్మదిగా మీడియా వాళ్లు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. మీకు మద్దతుగా నిలుస్తోంది మేమే. ఒకమాటపై ఉంటారా లేదా మాటిమాటికి మాట మార్చుతారా అనేది ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి.' అని జిల్లా మెజిస్ట్రేట్ బాధితురాలి తండ్రితో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో షేర్ అయిన వీడియోలో ఈ విషయం తెలిసింది.

ఇదీ చూడండి:'హాథ్రస్​' ఘటనపై యూపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details