తెలంగాణ

telangana

దిల్లీ ఫైర్​: 11 మందిని కాపాడిన 'ఒక్క మగాడు'

By

Published : Dec 8, 2019, 6:16 PM IST

దిల్లీ అగ్ని ప్రమాద ఘటనలో 11 మందిని అగ్నిమాపక దళం సభ్యుడు రాజేష్ శుక్లా ఒక్కడే రక్షించారు. కాలికి తీవ్ర గాయం అయినప్పటికీ... బాధితులను కాపాడిన శుక్లానే నిజమైన హీరో అని దిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ కొనియాడారు.

delhi fire accident in anaz mandi
దిల్లీ ఫైర్​: 11 మందిని కాపాడిన 'ఒక్క మగాడు'

దిల్లీ అనాజ్​ మండీ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ఏకంగా 11 మందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాదం సంభవించిన భవనంలోకి మొదట ప్రవేశించిన దిల్లీ అగ్ని మాపక సిబ్బంది రాజేష్ శుక్లా... బాధితులను చాకచక్యంగా రక్షించారు. ఈ తరుణంలో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శుక్లాను పరామర్శించారు దిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్.

"ఫైర్​మన్​ రాజేష్​ శుక్లా ఓ నిజమైన హీరో. ప్రమాదం జరిగిన స్థలం లోపలకు వెళ్లిన తొలి వ్యక్తి ఈయనే. దాదాపు 11 మందిని ఒక్కడే కాపాడారు. అతని కాలు ఎముక విరిగినప్పటికీ...తన బాధ్యతను నిర్వర్తించారు. ఈ సాహసవీరుడికి వందనం."
-సత్యేంద్ర జైన్, దిల్లీ హోంమంత్రి.

అనుమతులు లేని భవనం

ప్రమాదం సంభవించిన భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. భవనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన దిల్లీ అగ్ని మాపక శాఖ సిబ్బంది... పరిసరాల్లో ఎలాంటి అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేయలేదని వెల్లడించారు.

బిహారీలకు రూ.2లక్షలు

దిల్లీలో అగ్ని ప్రమాదంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దుర్ఘటనలో మరణించిన బిహారీల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు నితీశ్​.

అంతా కార్బన్ మోనాక్సైడే...

ప్రమాదంలో మరణించినవారిలో మంటల కన్నా పొగ వల్ల ఊపిరాడక చనిపోయిన వారే ఎక్కువని జాతీయ విపత్తు స్పందన దళం-ఎన్​డీఆర్​ఎఫ్​ తెలిపింది.

ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత భవనంలో ఎక్కువ శాతం కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లు గుర్తించాం. భవనం మూడు, నాలుగో అంతస్తులు మొత్తం పొగతో నిండిపోయాయి. కార్బన్ మోనాక్సైడ్ శాతం చాలా ఎక్కువగా ఉంది.
-ఆదిత్య ప్రతాప్ సింగ్, డిప్యూటీ కమాండర్, ఎన్​డీఆర్​ఎఫ్​

భవనంలోని సామగ్రి తగలబడటం వల్ల అధికంగా కార్బన్ మోనాక్సైడ్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details