తెలంగాణ

telangana

'దేశానికే 'తేజస్‌'.. విదేశీ విమానాల కంటే బెస్ట్.. త్వరలో ఐదోతరం ఎయిర్​క్రాఫ్ట్​'

By

Published : Feb 13, 2023, 7:11 AM IST

ఆయుధ సామగ్రి, ఉపకరణాల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతోందని భారత వాయుసేన సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ జె.చలపతి అన్నారు. ఈ విషయంలో దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలకు తోడు, ప్రైవేటు సంస్థలు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దీంతోపాటు 'తేజస్‌' యుద్ధవిమానం మనదేశానికి గర్వకారణమని, రక్షణ రంగంలో స్వావలంబనకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు.

prime objective in the management of Aero India
తేజస్ యుద్ధవిమానం

'తేజస్‌' యుద్ధవిమానం మనదేశానికి గర్వకారణమని, రక్షణ రంగంలో స్వావలంబనకు ఇది నిదర్శనమని భారత వాయుసేన సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ జె.చలపతి అన్నారు. ఆయుధ సామగ్రి, ఉపకరణాల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతోందని, ఈ విషయంలో దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలకు తోడు, ప్రైవేటు సంస్థలు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. భారత వాయుసేన ఏ దేశానికీ తీసిపోదని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా మనకుందని పేర్కొన్నారు. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకూ 'ఏరో ఇండియా 2023' పేరుతో ఎయిర్‌షో జరగనుంది. ఈ సందర్భంగా భారత వాయుసేన శక్తియుక్తులు, రక్షణ తయారీలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం.. సంబంధిత అంశాలపై ఎయిర్‌ మార్షల్‌ జె.చలపతి 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

భారత వాయుసేన సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ జె.చలపతి

'ఏరో ఇండియా' నిర్వహణలో ప్రధానోద్దేశం ఏమిటి?
ప్రధానంగా మిలిటరీ, కొంతవరకూ పౌరవిమానయాన రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్‌ యుద్ధ నైపుణ్యాలు, కమ్యూనికేషన్లలో మార్పులు, సీసీటీవీ సెక్యూరిటీ, బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లు, హెలికాప్టర్లు, ఆయుధాలు.. ఇలా ఎన్నో అంశాలు తెలుసుకునేందుకు ఇది సరైన వేదిక. దీనికి పెద్ద సంఖ్యలో విదేశీ ప్రతినిధులు, నిపుణులు హాజరవుతారు. వారితో సంబంధాలకు ఇది మంచి అవకాశం. అదే సమయంలో దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించి కొత్త వినియోగదారులను సంపాదించుకోగలుగుతాయి. యుద్ధ విమానాల ప్రదర్శన ‘ఏరో ఇండియా’కు ప్రధాన ఆకర్షణ. తద్వారా మనకున్న అత్యాధునిక యుద్ధ విమానాలు, పైలట్ల సత్తాను ప్రపంచానికి చాటిచెప్పినట్లు అవుతుంది.

ఈ ప్రదర్శనతో భారత వాయుసేనకు, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల రంగానికి ఏ మేరకు మేలు జరుగుతుంది?
మన దేశానికి ఆయుధాలు, రక్షణ సామగ్రి విక్రయించాలనే ఉద్దేశంలో 'ఏరో ఇండియా'కు గతంలో పెద్ద సంఖ్యలో విదేశీ సంస్థలు హాజరయ్యేవి. కానీ ఇటీవల కాలంలో భారతీయ సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. రక్షణ తయారీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దేశీయ కంపెనీలు ఈ ప్రదర్శనను వినియోగించుకుంటున్నాయి. తద్వారా దేశంలోని రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించే అవకాశం కలుగుతోంది.

ప్రైవేటు రంగ సంస్థలకు రక్షణ తయారీ అవకాశాలు పెరుగుతున్నాయా..?
మనకు మానవ వనరులు అధికం. మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. దేశీయ తయారీ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇటీవల కాలంలో రక్షణ ఉత్పత్తుల తయారీపై పెట్టుబడులూ పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రైవేటురంగ సంస్థలు వినూత్నమైన ఆయుధ సామగ్రి, ఉపకరణాలు ఆవిష్కరించగలుగుతున్నాయి. రక్షణ తయారీ ఆర్డర్లను ప్రైవేటు సంస్థలు పెద్దఎత్తున దక్కించుకుంటున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌నే తీసుకుంటే.. ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌, అనంత్‌ టెక్నాలజీస్‌, జిస్ను, టాటా గ్రూపు యూనిట్లు వాయుసేన నుంచి ఎన్నో ఆర్డర్లు సంపాదిస్తున్నాయి. మున్ముందు ఇది ఇంకా పెరుగుతుంది.

తేజస్‌ యుద్ధ విమానాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందా.. కొన్ని దేశాలు దీనిపై ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు?
కొన్ని దేశాలు ఆసక్తి ప్రదర్శిస్తున్న విషయం నిజమే. కానీ దీన్ని ఎగుమతి చేయడానికి కొన్ని పరిమితులున్నాయి. తేజస్‌లో వినియోగించిన ఇంజిన్‌, ఇతర విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. అందువల్ల విడిభాగాలు అందిస్తున్న విదేశీ సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలి. ఇదే కాకుండా ఏటా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు ఉత్పత్తి చేయగలగాలి. అప్పుడు తేజస్‌ను ఎగుమతి చేయగలిగే అవకాశం కలుగుతుంది.

అయిదో తరం యుద్ధ విమానాన్ని ఆవిష్కరించే విషయంలో మనదేశం ఏస్థాయిలో ఉంది?
రాడార్లకు దొరకని స్టెల్త్‌ టెక్నాలజీ, అధిక ఆటోమేషన్‌.. వంటి ఎన్నో ప్రత్యేకతలు అయిదో తరం యుద్ధ విమానానికి ఉంటాయి. రష్యా, చైనా, ఐరోపా దేశాలు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ దీన్ని పూర్తిగా సాధించలేకపోయాయి. మనదేశంలో ఏడీఏ, డీఆర్‌డీవో ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. కొన్ని డిజైన్లను పరిశీలిస్తున్నాయి. డిజైన్లు ఖరారయితే, దీనిపై ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

డ్రోన్లు, పైలెట్‌ రహిత ఫైటర్లు.. శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ మార్పునకు భారత వాయుసేన ఏవిధంగా సన్నద్ధం అవుతోంది.
మేం తగిన సన్నాహాల్లో ఉన్నాం. దీనివల్ల ఎదురయ్యే సవాళ్లు- అవకాశాలపై నిరంతరం అధ్యయనం చేస్తున్నాం. అంతేగాక కొన్ని డ్రోన్లు సమకూర్చుకొని వాటిని ఇప్పటికే వివిధ అవసరాలకు వినియోగిస్తున్నాం. 'ఏరో ఇండియా 2023' లో డ్రోన్లు ఉత్పత్తి చేసే ఎన్నో సంస్థలు భాగస్వాములవుతున్నాయి. దీనివల్ల వాయుసేన, దేశీయ పరిశ్రమ తగిన అవగాహనతో ఈ విభాగంలో ముందుకు సాగే అవకాశం ఏర్పడుతుంది.

రక్షణ పరంగా మన సత్తా ఇప్పుడెంత..? భవిష్యత్తు సవాళ్లకు ఎలా సన్నద్ధం కావాలి?
మన రక్షణ వ్యవస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. మనకు అత్యుత్తమమైన శిక్షణ, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం ఉన్నాయి. ఎన్నో దేశాలతో కలిసి ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాం. తద్వారా ఏ దేశానికీ మనం తీసిపోమనేది స్పష్టమవుతోంది. ఇక భవిష్యత్తు సవాళ్ల విషయానికి వస్తే.. దీర్ఘకాలం పాటు యుద్ధం చేయడానికి అవసరమైన వనరుల కొరత మన ముందున్న ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఆయుధ సామగ్రి, విడిభాగాల కోసం మనదేశం ఇప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడుతోంది. దేశీయంగా రక్షణ పరికరాల తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవాలి. దిగుమతులను తగ్గించుకోవాలి.

'మేక్‌-ఇన్‌-ఇండియా'తో రక్షణ తయారీ విస్తరిస్తోందా?
రక్షణ పరికరాల తయారీలో దేశీయ సంస్థల పాత్ర పెరుగుతోంది. సైన్యానికి ఆయుధ సామగ్రి, విడిభాగాలను విదేశాల నుంచి తెప్పించుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన సామగ్రి అనుకున్న సమయానికి రాకపోవచ్చు. అందువల్ల విడిభాగాలను ఎక్కువగా నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడి సంస్థలను విస్తరించడమే మార్గం. భారత వాయుసేన దేశీయ కంపెనీలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. హెచ్‌ఏఎల్‌, డిఫెన్స్‌ పీఎస్‌యూలు, ప్రైవేటు కంపెనీల ద్వారా అవసరమైన విడిభాగాలు, ఉపకరణాలను తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఆవిష్కరించిన 'ఆఫ్‌సెట్‌ క్లాజ్‌', 'మేక్‌ ఇన్‌ ఇండియా' దీనికి వీలు కల్పిస్తున్నాయి. దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా, ఎగుమతుల వైపు దృష్టి సారించే స్థాయికి దేశీయ రక్షణ రంగ సంస్థలు చేరుకుంటున్నాయి.

మీరు ఫైటర్‌ పైలెట్‌ కావడమే కాకుండా 'ఎల్‌సీఏ తేజస్‌' కు ముఖ్య టెస్ట్‌ పైలట్‌గా వ్యవహరించారు. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోని సాలూర్‌ ఎయిర్‌బేస్‌ రెండు తేజస్‌ స్క్వాడ్రన్లను కూడా నిర్వహిస్తోంది. ఈ ఫైటర్‌ ప్రత్యేకతలపై మీరేమంటారు?
తేజస్‌ ఫైటర్‌, మనదేశానికి గర్వకారణం. ఎన్నో దశాబ్దాల పాటు మన ఇంజినీర్లు చేసిన కృషి ఫలితం. హెల్మెట్‌ మౌంటెడ్‌ సైట్‌, ఫ్లై-బై-వైర్‌ టెక్నాలజీ కంట్రోల్స్‌ వల్ల ఇది ఎంతో అత్యాధునిక యుద్ధ విమానంగా రూపుదిద్దుకుంది. పైగా ఇది నిరంతరం 'అప్‌గ్రేడ్‌' అవుతోంది. 'సర్వీసబులిటీ' విషయానికి వస్తే, ఎన్నో విదేశీ యుద్ధ విమానాలకంటే కూడా మెరుగైనది. అందువల్ల తేజస్‌, ఎంతో విజయవంతమైన యుద్ధవిమాన ప్రాజెక్టు అని చెప్పగలం. మిగ్‌- 21 స్థానంలో మన దేశానికి ఒక ఫైటర్‌ అవసరం. దానికి తేజస్‌ సరైన ప్రత్యామ్నాయం.

ABOUT THE AUTHOR

...view details