ETV Bharat / bharat

'నాటి తీర్పుల వల్లే నేటి పదవులు!'.. ఏపీ గవర్నర్​ నియామకంపై కాంగ్రెస్​ విమర్శలు

author img

By

Published : Feb 12, 2023, 9:46 PM IST

Updated : Feb 12, 2023, 10:06 PM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్ నజీర్​ను నియమించడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ విమర్శించారు. కేంద్రానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే నజీర్​కు గవర్నర్​ పదవి లభించిందని అన్నారు.

former-sc-judge-s-abdul-nazeer-appointed-governor-of-andhra-pradesh
ఆంద్రప్రదేశ్​ కొత్త గవర్నర్ నియామకంపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్ నజీర్ నియామకం పట్ల.. కాంగ్రెస్​ పార్టీ విమర్శించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిని గవర్నర్​గా నియమించడమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్​. పలు కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే అబ్దుల్ నజీర్​కు గవర్నర్ పదవి కట్టబెట్టారని ఆరోపించారు.

2012వ సంవత్సరంలో దివంగత భాజపా నేత అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ట్విటర్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు జైరాం రమేశ్​. 'తీర్పులు ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయి. పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పులు.. పదవీ విరమణ తర్వాత ఉద్యోగాలను ఇస్తాయి.' అని ఆ వీడియోలో అరుణ్​ జైట్లీ అన్నారు. దేశంలో గత మూడు, నాలుగేళ్లుగా ఇదే జరుగుతుందని జైరాం రమేశ్​ విమర్శించారు. దానికి ఈ నియామకాలే సరైన రుజువులు అని ఎద్దేవా చేశారు. 'నాటి తీర్పులు వల్లే నేటి పదవులంటూ' కేంద్రాన్ని విమర్శించారు.

మరోవైపు.. కేరళ సీపీఐ(ఎం)​ నేత, రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీమ్​ కూడా జస్టిస్‌ అబ్దుల్ నజీర్ నియామకంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని గవర్నర్​గా నియమించడం రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగిస్తుందన్నారు. దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. 'గవర్నర్​ పదవిని జస్టిస్​ నజీర్​ తిరస్కరించాలి. దేశ ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోకూడదు. మోదీ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు భారత రాజ్యాంగానికి మచ్చను తెస్తున్నాయి. జస్టిస్​ నజీర్​ పదవీ విరమణ చేసిన ఆరు నెలలకే ఆయనకు గవర్నర్​ పదవి వరించింది." అని రహీం అన్నారు.

కర్ణాటకలోని బెలువాయికి చెందిన జస్టిస్‌ అబ్దుల్ నజీర్.. మంగళూరులో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పనిచేస్తుండగానే ఫిబ్రవరి 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు.. పదోన్నతి లభించింది. ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని 2017లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్‌ నజీర్‌ కూడా ఒకరు. ఇక 2019లో అయోధ్య రామజన్మభూమి కేసు తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ జస్టిస్ నజీర్‌ ఉన్నారు. అయోధ్యలో వివాదాస్పద ప్రాంతంలో హిందూ నిర్మాణం ఉనికి ఉందంటూ.. భారత పురావస్తు శాఖ ఇచ్చిన తీర్పును జస్టిస్‌ నజీర్‌ సమర్థించారు.

Last Updated :Feb 12, 2023, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.