తెలంగాణ

telangana

12 ఏళ్ల వయసులో యాసిడ్​ దాడి- 37 ఆపరేషన్లు, ఆరేళ్లు ఆస్పత్రిలో నరకం- ఇప్పుడీ ప్రొఫెసర్​ 'స్వరకోకిల'

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 7:07 PM IST

Updated : Nov 10, 2023, 8:18 PM IST

Acid Attack Survivor Mangala Kapoor : 12 ఏళ్లకే యాసిడ్ దాడి.. ఆరేళ్ల పాటు ఆస్పత్రిలోనే జీవనం.. దాదాపు 37 శస్త్రచికిత్సలు.. ఎన్నో అవమానాలు, సమస్యలు.. ఇవేవీ ఆమెను ఆపలేదు. తనకు ఎదురైన ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటూ డాక్టరేట్​ పట్టా పొంది స్వరకోకిలగా మారారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

Acid Attack Survivor Mangala Kapoor
Acid Attack Survivor Mangala Kapoor

12 ఏళ్ల వయసులో యాసిడ్​ దాడి- 37 ఆపరేషన్లు, ఆరేళ్లు ఆస్పత్రిలో నరకం- ఇప్పుడీ ప్రొఫెసర్​ 'స్వరకోకిల'

Acid Attack Survivor Mangala Kapoor :ఎంతో మధురంగా పాడుతున్నారు కదూ? ఈ గాత్రం వెనుక మరచిపోలేని ఓ విషాదం ఉంది. 12 ఏళ్ల వయసులో యాసిడ్​ దాడికి గురై.. ఆరేళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండి 37 శస్త్రచికిత్సలు చేయించుకున్నారు ఈ మహిళ. అనేక అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినా దృఢంగా నిలబడి.. ఆ కన్నీటి కథను విజయగాథగా మార్చుకున్నారు. సంగీతంలో పీహెచ్​డీ చేసి ప్రొఫెసర్​ అయ్యారు. స్వరకోకిలగా పేరుగాంచారు. ఆమే ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసికి చెందిన మంగళ కపూర్​.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్​ చేతుల మీదుగా అవార్డు

"12 ఏళ్లు ఉన్నప్పుడు మాకు బనారస్​ చీరల వ్యాపారం ఉండేది. దీంతో అనేక మంది ప్రత్యర్థులు ఉండేవారు. వారు మాపై ద్వేషం పెంచుకున్నారు. కొందరు మా పనివాళ్లకు డబ్బులు ఇచ్చి యాసిడ్ దాడి చేయించారు. రాత్రి 2 గంటల సమయంలో అందరూ పడుకున్నప్పుడు ఈ దాడి జరిగింది. అప్పుడు నాకు యాసిడ్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. ఈ ఆపరేషన్ చేస్తే తిరిగి అందంగా తయారవుతారని డాక్టర్లు చెప్పేవారు. దీంతో నేను ఆనందంగా ఆపరేషన్లు చేయించుకునేదాన్ని. బాలికగా ఆస్పత్రిలో చేరిన నేను.. యువతిగా బయటకు వచ్చాను. నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా మొహం అందవికారమైంది. యాసిడ్ దాడి జరిగిన సమయంలో ఏడో తరగతిలో ఉన్నాను. ఆ తర్వాత చుట్టుపక్కల వారి మాటలతో విసుగు చెంది చదవడం ఆపేశాను. ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశాను. కానీ, నాకు సంగీతమంటే చాలా ఇష్టం. అందుకోసమే ఇంట్లోనే ఉండి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాను."
--మంగళ కపూర్​​

పట్టుదలతో పీహెచ్​డీ పూర్తి
సమాజం చిన్నచూపుతో చదువు మధ్యలోనే ఆపేసిన మంగళ కపూర్​.. దూరవిద్యలో పీజీ వరకు చదివారు. ఆ తర్వాత బనారస్​ హిందూ యూనివర్సిటీలో సంగీతం, కళల విభాగంలో పీహెచ్​డీలో చేరారు. మెరుగైన ప్రతిభ చూపి యూజీసీ స్కాలర్​షిప్​ సాధించారు. పీహెచ్​డీ పూర్తి చేసి డాక్టర్​ మంగళ కపూర్​గా మారారు. అనంతరం అనేక సంస్థల్లో ఉద్యోగం కోసం వెతికినా.. ఎక్కడా లభించలేదు. చివరకు.. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని మహిళా కళాశాలలో ప్రొఫెసర్​గా​ ఉద్యోగంలో చేరారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్​ చేతుల మీదుగా అవార్డు

"సమాజం నన్ను ఏ రోజూ అంగీకరించలేదు. కొందరు బంధువులు మేము మీ చుట్టాలమని చెప్పకని అనేవారు. కొందరైతే విషం ఇచ్చి చంపేయండి.. జీవితాంతం ఎలా భరిస్తారు? అని నా తల్లికి సలహా కూడా ఇచ్చారు. కొంతమంది పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తుంటారు? అందమైన అమ్మాయిలను చూసి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏదో కారణాలు చెప్పి విడిపోతారు. కొందరైతే చంపుకుంటారు. ఇలాంటి వార్తలు విన్న తర్వాత నాకు పెళ్లి అంటేనే విరక్తి వచ్చింది. ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని నిశ్చయించుకున్నాను."
--మంగళ కపూర్​

లతా మంగేష్కర్​లా..
డిగ్రీ చదువుతున్న సమయంలో వేదికలపై పాడుతుండగా.. కొందరికి మంగళ గొంతు నచ్చి.. స్టేజీ ప్రదర్శనలకు అవకాశం ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు మంగళ కపూర్. ఆమె గొంతు విన్న అనేక మంది లతా మంగేశ్వర్​లా ఉందంటూ కితాబిచ్చేవారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్​గా రిటైర్ అయ్యాక ఆత్మకథ రాయాలని మంగళ కపూర్​కు కొందరు సూచించారు. వారి సలహాతో తన ఆత్మకథను రాయడం ప్రారంభించిన మంగళ.. 2018లో 'సీరత్'​ అనే పుస్తకాన్ని పూర్తి చేశారు. ఈమె కథను త్వరలోనే ఓ సినిమాగా తీయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ డాక్యుమెంటరీ పూర్తి కాగా.. మరాఠీ, హిందీ భాషల్లో సినిమా కూడా రాబోతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళ కపూర్​

యాసిడ్​ దాడి బాధితుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంగళ కపూర్​. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. ఇప్పుడు తనకు 70 ఏళ్లు వచ్చాయని.. ఆరోగ్యంగా ఉంటూ తన పనులన్నీ తానే చేసుకుంటున్నానని చెప్పారు.​.

మంగళ కపూర్​ చిన్ననాటి ఫొటో(పాత చిత్రం)

యాసిడ్ దాడితో అంధత్వం.. టెన్త్​లో 95% మార్కులతో స్కూల్ టాప్.. టార్గెట్ ఐఏఎస్​!

చిరకాల మిత్రుడితో యాసిడ్ దాడి​ బాధితురాలి పెళ్లి

Last Updated : Nov 10, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details