ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ "దారి"ద్య్రం.. అడుగుకో గుంత.. గజానికో గొయ్యి..!

By

Published : Jun 12, 2022, 2:59 PM IST

VISAKHA ROADS: విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. పాలనా రాజధానిగా మార్చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్న గ్రేటర్‌ సిటీ. అలాంటి నగరంలో రోడ్లంటే.. రయ్య్..మని దూసుకెళ్లేలా ఉండాలి. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి రివర్స్‌లో ఉంది. రోడ్డెక్కామంటే భద్రంగా ఇంటికి సేఫ్​గా తిరిగొస్తామా..? అని వాహనదారులు భయపడుతున్నారంటే.. పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా "నగరాల్లో నరకదారులు" పేరిట రోడ్ల దుస్థితిని కళ్లకు కడుతున్న 'ఈటీవీ-ఈటీవీ భారత్'​ విశాఖ రహదారులను క్షుణ్నంగా పరిశీలించింది.
VISAKHA ROADS
గజానికో గుంత.. అడుగుకో గొయ్యిలా విశాఖ రహదారులు..!

VISAKHA ROADS: విశాఖలో మూడు, నాలుగేళ్ల క్రితం వేసిన రోడ్లే తప్ప.. ఆ తర్వాత కనీస మరమ్మతులకు నోచుకోని దుస్థితి. ఏటా 4 వేల కోట్ల బడ్జెట్ పెడుతున్న జీవీఎంసీ.. నగరాభివృద్ధికి నిదర్శనంగా నిలిచే, ప్రజారవాణాకు కీలకమైన రహదారులను మాత్రం పట్టించుకోవడం లేదు. గుంతలు, గోతులు, కంకర తేలిన రోడ్లపై నగరవాసులు ప్రయాణం సాగించక తప్పడం లేదు.

గజానికో గుంత.. అడుగుకో గొయ్యిలా విశాఖ రహదారులు..!

జాతీయ రహదారి నుంచి నగరాన్ని అనుసంధానించే మురళి నగర్‌ రోడ్డుపై.. ఎక్కడా తారు కనిపించదు. దీనికి బోనస్ అన్నట్లు రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. కొన్నిచోట్ల ఆ గుంతల్ని అలాగే వదిలేశారు. మరికొన్నిచోట్ల కంకర పోసి సరిపెట్టారు. ఇంత దారుణమైన ఈ రోడ్డుపై.. ప్రమాదం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదన్నది ప్రయాణికుల మాట.

విశాఖ నగరంలో అత్యంత ప్రధానమైన రహదారుల్లో ఒకటైన కంచరపాలెం - జ్ఞానాపురం రోడ్డు.. నిర్వహణ లోపాలతో తీవ్రంగా దెబ్బతింది. గతుకులమయమైన ఈ మార్గంలో వాహనంపై వెళితే.. పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఇక వానాకాలం వచ్చిందంటే.. గుంతల్లో నీళ్లు నిలిచి ఎక్కడ జారిపడతామో అని బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగాల్సిందే.

గురుద్వారా కూడలి నుంచి ద్వారకా నగర్‌ బస్టాండుకు వెళ్లే రోడ్డు.. నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. నగరంలో ముఖ్యమైన జగదాంబ సెంటర్, డాబా గార్డెన్స్‌ వెళ్లేందుకూ ఇదే మార్గం. ఇలాంటి రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తోంది. ఆ గుంతల్ని తప్పించుకుంటూ అత్యంత జాగ్రత్తగా వెళితే తప్ప.. ఎక్కడో ఒకచోట పడిపోవడం ఖాయం.

గాజువాక – అచ్యుతాపురం మార్గమైతే నరకానికి నకలులా ఉంటుంది. గజానికో గుంత, అడుగుకో గొయ్యి తప్ప.. సాఫీగా సాగే రోడ్డు కనీసం పట్టుమని 10 మీటర్లు కూడా ఉండదు. తప్పనిసరైతే తప్ప.. అటువైపు వెళ్లకపోవడమే మేలన్నంత దారుణంగా ఉంటుందీ రోడ్డు. అత్యవసరమై ఈ మార్గంలో ప్రయాణం చేసినా.. వాహన వేగం గంటకు పది కిలోమీటర్లు కూడా దాటదు. పొరపాటున వేగం పెంచామంటే అంతే సంగతులు.

వీఐపీ రోడ్డు నుంచి మద్దిలపాలెం వరకు వెళ్లే మార్గానిదీ ఇలాంటి పరిస్థితే. మరమ్మతులనే మాటే మరిచిన ఈ రోడ్డు.. చాలాచోట్ల గతుకులు, కంకర తేలిపోయి అధ్వానంగా తయారైంది. ప్రయాణానికి ఏమాత్రం పనికిరాని స్థితికి చేరింది. ఈ రోడ్డుకు మోక్షమెప్పుడో... ప్రయాణం సాఫీగా సాగేదెన్నడో అని జనం ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details