ETV Bharat / state

పిన్నెల్లి సోదరుల అరాచకాలు, దౌర్జన్యాలపై పోలీసులు 'మౌనవ్రతం' - ఎందుకో చెప్తారా సార్? - Police Silent in MACHERLA incident

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 8:17 AM IST

Updated : May 23, 2024, 9:29 AM IST

Political Leaders Fire On Police Behavior: పోలింగ్‌ రోజున మాచర్లలో వైఎస్సార్సీపీ నేతలు చేసిన దాడులపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పీడబ్ల్యూడీ కాలనీలో తెలుగుదేశం నేతల ఇళ్ల వద్దకు వచ్చి మారణాయుధాలతో దాడి చేసి అడ్డొచ్చిన వారిని వాహనాలతో తొక్కించారు. ఈ దాడుల్లో 9మంది తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఆసుపత్రుల్లో ఉన్నా పోలీసులు మాత్రం సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసి అధికార పార్టీ నేతలకు అండగా నిలిచారు. ఈసీ ఆదేశాలతో దర్యాప్తునకు వచ్చిన సిట్‌ బృందానికి ఈ ఘటన గురించి పోలీసులు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Political Leaders Fire On Police Behavior in Macherla Incidents
Political Leaders Fire On Police Behavior in Macherla Incidents (ETV Bharat)

పిన్నెల్లి సోదరుల అరాచకాలు, దౌర్జన్యాలపై పోలీసులు 'మౌనవ్రతం' - ఎందుకో చెప్తారా సార్? (ETV Bharat)

Political Leaders Fire On Police Behavior in Macherla Incidents : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈనెల 13న వైఎస్సార్సీపీ మూకలు మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీలో విధ్వంసం సృష్టించాయి. తెలుగుదేశం నేత కేశవరెడ్డి తన అనుచరులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి రాగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 40 మంది ఐదు స్కార్పియో వాహనాల్లో కత్తులు, రాడ్లు, రాళ్లతో ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చిక్కినవాళ్లను చిక్కినట్లు చితకబాదారు.

ముందుకు వస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు కేశవరెడ్డి అనుచరులు ప్రయత్నించగా వారిని తొక్కించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. కేశవరెడ్డిని గన్‌మెన్‌ పక్కకు లాగడంతో ఆయన తప్పించుకున్నారు. కొందరు వాహనం టైర్ల కింద పడిపోయారు. కిందపడిన వాళ్లను స్థానిక టీడీపీ నేతలు కాపాడే ప్రయత్నం చేయగా వాహనాల్లో నుంచి దిగిన రౌడీమూకలు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. 20 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించారు. రెండు కార్లు, 30 ద్విచక్ర వాహనాలు, ఇంట్లో ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. దాడిలో కాళ్లు, చేతులు విరిగిపోయి, తలలు పగిలిపోయి. ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి, జేసిరెడ్డి నాసర్‌రెడ్డి, వూరిబండి మన్నెయ్య, బూడిద శ్రీను, దుర్గారెడ్డితో పాటు మరికొందరు దాడిలో పాల్గొన్నారని బాధితులు ఫిర్యాదు చేశారు.

వీలైనంత త్వరగా పిన్నెల్లిని అరెస్ట్​ చేస్తాం - ఈసీకి ఇచ్చిన నివేదికలో సీఈఓ, డీజీపీ - DGP on the Macherla incident

వైఎస్సార్సీపీ మూకల దాడిలో ఆదూరి అలేక్యరావు రెండుకాళ్లు, రెండు చేతులు విరిగిపోయాయి. తలపై ఆరు కుట్లు పడ్డాయి. భవానీప్రసాద్‌పై కారు టైరు వెళ్లడంతో నడుము విరిగిపోయింది. ఫిరోజ్, సయ్యద్‌ బాషా తలలు పగిలిపోయాయి. మల్లెల గోపీ కన్ను దెబ్బతినగా తల ఎముక విరిగింది. శివ అనే అతనికి మోకాలు విరిగింది. ఇద్దరు చికిత్స చేయించుకొని ఇంటికి చేరగా ఏడుగురు ఆసుపత్రిలో ఉన్నారు. ఐదుగురికి శస్త్రచికిత్సలు జరిగాయి. ఆదూరి అలేక్యరావు ఫిర్యాదు ఆధారంగా మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో పాటు పలువురిపై నామమాత్రపు కేసు పెట్టారు. ఇప్పటివరకు ఈకేసులో ఒక్కరినీ అరెస్టు చేయలేదు. వీడియో విజువల్స్‌లో పేర్కొన్న వ్యక్తులు కనిపించలేదని వివరాలు సేకరిస్తున్నందున ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు, న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పిన్నెల్లిపై పది సెక్షన్లు- ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం: సీఈవో - CEO MK Meena on Macherla Incidents

పిన్నెల్లి స్వగ్రామం వెల్దుర్తి మండలం కండ్లకుంటలో పోలింగ్‌ రోజున టీడీపీ నేత శివాంజిరెడ్డి ఇంటిపై పిన్నెల్లి సోదరుడు దాడి చేశాడు. ఈ కేసులో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే గ్రామంలో టీడీపీ తరపున పోలింగ్‌ ఏజెంటుగా ఉన్న శీలం పిన్నయ్యపైనా కర్రలు, రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేసి టీడీపీ ఏజెంట్లందరినీ పోలింగ్‌ కేంద్రం నుంచి బైటకు పంపారు. దాడి చేసిన వారిలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు 18 మంది ఉన్నట్లు పోలీసులకు పిన్నయ్య ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి ఎస్‌ఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ ఒక్కరినీ అరెస్టు చేయలేదు.

ఈవీఎం విధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్​ ! - PINNELLI IN POLICE CUSTODY

Last Updated : May 23, 2024, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.