ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSR Congress Party: రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రంతో పోరాటాన్ని విస్మరించిన వైసీపీ

By

Published : Jun 20, 2023, 8:24 AM IST

Updated : Jun 20, 2023, 1:35 PM IST

YSR Congress Party Government: ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతా.. ప్రత్యేక హోదా సహా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతా.. ఇది ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పిన వాగ్దానాలు. జనం వీటిని నమ్మి ఓట్లు వేశారు. లోక్‌సభ ఎంపీల సంఖ్యలో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా హోదా కట్టబెట్టినా నాలుగేళ్లలో 4 డిమాండ్లూ కూడా సాధించలేకపోయింది. ప్రత్యేక హోదా ఊసే మరిచిపోయింది. పోలవరం ప్రాజెక్టు అతీగతీ లేకుండా చేసింది. కడప ఉక్కు, విభజన హామీల అమలు అటకెక్కించింది. సీఎం దిల్లీ పర్యటనలతో సాధించిందేమిటో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

YSR Congress Party
YSR Congress Party

రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రంతో పోరాటన్ని విస్మరించిన వైసీపీ

YSR Congress Party MPS Failed to Questioned Central: "మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందటానికి వీలుగా మీరు సహృదయంతో, విశాల హృదయంతో చేసే ప్రతి సహాయం.. మీరు మా రాష్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునఃనిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని.. ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, మాకు వేరే ఎజెండా లేదు." అని 2022 నవంబరు 12న విశాఖలో జరిగిన సభలో.. ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

రాష్ట్ర ప్రయోజనాలను సాధించలేకపోతున్నారు: ప్రధానితో అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పుకున్న సీఎం జగన్.. ప్రత్యేకహోదా సహా రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం సాధించలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు మాత్రం '25కి 25మంది ఎంపీలను గెలిపించండి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం’ అంటూ గొప్పగా ప్రకటించారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కేంద్రానికి మన ఎంపీల అవసరం లేనందువల్ల వారిపై ఒత్తిడి చేయలేం’ అంటూ చేతులెత్తేశారు. లోక్‌సభలో 22, రాజ్యసభలో 9మంది ఎంపీలతో పార్లమెంట్‌లో ప్రధాన పక్షాల్లో ఒకటిగా ఉన్న వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రం ప్రతిపాదించే బిల్లులకు మద్దతిస్తోంది.

పునర్విభజన చట్టంలో హామీలైనా: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, వ్యవసాయ చట్టాలు, ఇతర బిల్లులు గట్టెక్కేందుకు ఎన్డీఏకు వైసీపీ ఎంపీల బలమే కీలకమైంది. అప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలపై షరతులు పెట్టలేదు. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియాలో ఇంటర్‌పోల్‌ అరెస్టు చేసినట్లు 2019లో వార్తలు వచ్చాయి. ప్రసాద్‌ను స్వదేశానికి తీసుకురావాలని వైసీపీ ఎంపీల బృందం నాటి విదేశాంగ మంత్రిని కలిసి కోరింది. అదే ఐక్యత రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టడంలో చూపడం లేదు. ఏపీ పునర్విభజన చట్టంలోని నాలుగు ప్రధాన హామీలపై కనీసం ప్రశ్నించకుండా సభ లోపలా, బయటా చేష్టలుడిగి చూస్తోంది.

దీశానిర్దేశం లేకుండా పార్లమెంటుకు: పార్లమెంటు సమావేశాలకు ముందు రాజకీయ పార్టీలు తమ ఎంపీలతో సమావేశం నిర్వహిస్తాయి. సభలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ అంశాలు లేవనెత్తాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు కసరత్తు చేస్తాయి. కానీ, మన రాష్ట్రంలో అధికార పార్టీ విధానమే వేరు. ఇటీవలే నిర్వహించిన పార్లమెంటు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలకు ముందు కూడా వైసీపీ అధినేత, సీఎం జగన్‌ పార్టీ ఎంపీలతో ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. పార్టీ దిశానిర్దేశం లేనప్పుడు సభలో.. హక్కుగా దక్కాల్సిన డిమాండ్లను కూడా ప్రశ్నించలేకపోయారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడని పరపతి: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పీఎంవోతో సత్సంబంధాలు నెరపుతూ జగన్‌కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్లు దొరికేలా లాబీయింగ్‌ చేస్తారన్న అభిప్రాయం ఉంది. వైసీపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న.. పరిమళ్‌ నత్వానీ రిలయన్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఇటీవల జగన్‌కు దిల్లీలో అపాయింట్‌మెంట్లన్నీ ఆయనే చూస్తున్నారు. లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి పార్టీలో రెండో స్థానం. మిథున్‌రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలో అనుచరులకు కాంట్రాక్టులు ఇప్పించగలుగుతున్నారే కానీ.. వారి పరపతిని రాష్ట్రానికి ఉపయోగపడేలా చేయడం లేదు.

అప్పటి దీక్షలు, నిరసనలు ఇప్పుడేవి: ఇప్పుడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని కేంద్రం పార్లమెంట్‌ ఇటీవలి సమావేశాల్లో ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అంతకుముందూ పలుమార్లు స్పష్టం చేసింది. అయినా వైసీపీ ఎంపీలు స్పందించలేదు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుందంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌.. విద్యాసంస్థల్లో సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. 2018లో వైసీపీ లోక్‌సభ సభ్యులు ఐదుగురు ప్రత్యేక హోదా కోసమంటూ రాజీనామా చేసి, దిల్లీలోనే దీక్షకు దిగారు. నేడు సంఖ్యాబలమున్నా పోరాట పటిమ లోపించింది. నాటి దీక్ష.. చిత్తశుద్ధితో చేసిందా లేక రాజకీయ లబ్ధికా అన్న సందేహం అందరిలో తలెత్తుతోంది.

పోలవరం కోసం పోరాటమే లేదు: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 548 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని 2018 లోనే నాటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. జగన్‌ సీఎం అయ్యాక ప్రధాని, కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రులను కలిసినప్పుడల్లా ఇదే కోరుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. జలశక్తి మంత్రిత్వశాఖ సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలోనే ఇందుకు ఆమోదం తెలిపినా కేంద్రం మాత్రం హామీ ఇవ్వలేదు. అయినా వైసీపీ ఎంపీలు ఒత్తిడి తేలేకపోతున్నారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 2వేల400 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పొందాల్సి ఉంది. అదీ సాధించలేకపోతున్నారు. ప్రాజెక్టు 2024లో పూర్తయ్యే అవకాశం లేదని కేంద్ర మంత్రి పార్లమెంటులో చెప్పినా, ప్రశ్నించలేదు.

పార్లమెంట్​ వేదికగా పోరాటం అసలే లేదు: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామన్న విభజన చట్టంలోని హామీపై కేంద్రం వెనుకడుగు వేసినా ప్రశ్నించలేదు. దీనిపై పార్లమెంటులో ఒక్కఎంపీ కూడా ఒత్తిడి తేవడం లేదు. ఏపీ పునర్విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్ల కింద ఉన్న 142 సంస్థలతోపాటు చట్టంలో లేని మరో 12 సంస్థలను రెండు రాష్ట్రాలకు ఇంకా పంచలేదు. వీటి విలువ లక్షా 42వేల 601 కోట్ల రూపాయలని అంచనా. వీటిలో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. షెడ్యూల్‌-9లో పేర్కొన్న సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ 24వేల 18 కోట్ల రూపాయలు. వీటిలో 22వేల 556 కోట్ల రూపాయల విలువైనవి తెలంగాణలోనే ఉన్నాయి. షెడ్యూల్‌-10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల విలువ 34వేల 642 కోట్ల రూపాయలు కాగా, అందులో 30వేల 530 కోట్ల రూపాయల విలువైనవి తెలంగాణలోనే ఉన్నాయి. చట్టంలో పేర్కొనని 12 సంస్థల విలువ 1759 కోట్ల రూపాయలు కాగా, ఇవీ తెలంగాణలోనే ఉన్నాయి. వీటిని విభజించకపోవడంతో ఏపీ సర్కారు కార్యకలాపాలు సక్రమంగా సాగడం లేదు. దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది కానీ, పార్లమెంట్‌ వేదికగా పోరాడింది లేదు. తెలంగాణ నుంచి 6,627 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలని జగన్‌ కేంద్రాన్ని కోరుతున్నట్లు సీఎంవో చెబుతుంది. కానీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

జగన్‌ దిల్లీ పర్యటన ఎజెండాకు కరవైన ఎంపీల చొరవ: జగన్‌ దిల్లీలో ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసినప్పుడల్లా రాష్ట్ర విభజన హామీల అమలు కోసమే కోరినట్లు సీఎం పేషీ ఓ ప్రకటన జారీ చేస్తుంది. కానీ, 2014-15 రెవెన్యూ లోటు కింద ప్రత్యేక ఆర్థిక సాయంగా కేంద్రం గత మేలో ఇచ్చిన 10వేల 461 కోట్ల రూపాయలు మినహా.. ఏ హామీలూ అమలు కాలేదు. జగన్‌ దిల్లీ పర్యటన ఎజెండాలోని అంశాల అమలుకు ఎంపీలు చొరవ తీసుకున్న సందర్భాలు దాదాపు లేవు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై పార్లమెంట్‌లో పోరాడిన దాఖలాల్లేవు. రాష్ట్రానికి జవజీవాలనిచ్చే నాలుగు ప్రధాన హామీల సాధనలో నిష్క్రియాపరత్వంతో విమర్శలెదుర్కొంటున్నారు.

Last Updated : Jun 20, 2023, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details