ETV Bharat / state

వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలకు తెర తీయొద్దు: చలసాని శ్రీనివాసరావు

author img

By

Published : Jan 10, 2023, 8:34 PM IST

Special Status Yatra : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. హిందుపురం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టే 2.0 యాత్రలో రాజకీయాలకు ప్రమేయం లేకుండా అందరూ కలిసి రావాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలకు తెర తీయకుండా దిల్లీలో ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేయాలన్నారు.

Chalasani Srinivasa Rao
వైసీపీ ఎంపీలు దిల్లీలో ధర్నా చేయాలి

Special Status Yatra: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం, భవిష్యత్తు తరాల కోసం తాము జరుపుతున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని.. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలకు తెర తీయొద్దని కోరారు. దిల్లీలో ప్రధాని కార్యాలయం ముందు రాష్ట్ర ఎంపీలంతా ధర్నా చేయాలన్నారు. ఈ చర్యల ద్వారా తప్పనిసరిగా హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తీరుతాయన్నారు. హిందుపురం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టే 2.0 యాత్రలో విద్యార్ధి, యువజన సంఘాలన్నీ పాల్గొంటున్నాయని, రాజకీయాలకు ప్రమేయం లేకుండా ఈ యాత్రలో అందరూ పాల్గొని, ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలియజేద్దామని పేర్కొన్నారు.

ఈ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆంధ్రుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన కేసీఆర్ క్షమాపణలు చెప్పి, తన పార్టీ విస్తరణ కోసం రాష్ట్రానికి రావాలని, ఉమ్మడి ఆస్తుల విభజన కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు విషయంలో అన్ని పార్టీలు ఒక్క మాటపైకి వస్తే కొనేందుకు ఎవ్వరూ దరిదాపులలోకి రాలేరని, ఇందుకోసం అధికార పక్షం తప్పనిసరిగా కలిసి రావాలన్నారు.

అనంతరం ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం పోరాడానన్న వైసీపీ.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, భవిష్యత్తు తరాలను తాకట్టు పెడుతోందని చలసాని విమర్శించారు. పవన్ కల్యాణ్ పిలుపునిస్తే వేలాది మంది వస్తారని.. ఈ విషయాలలో ఆయన చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.