ETV Bharat / state

మా స్వరం బలహీనం కాదు.. పోలవరం, రైల్వేజోన్,స్టీల్ ప్లాంట్ పై బాధేస్తోంది: వైసీపీ ఎంపీలు

author img

By

Published : Feb 10, 2023, 12:08 PM IST

YCP MPs IN LOKSABHA : లోక్​సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీలు మార్గాని భరత్,​ శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీతా పాల్గొని.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు దాటిన నాటి విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదని ఎంపీలు గళమెత్తారు. విభజన చట్టంలోని హామీల అమలుకు ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

YCP MPs IN PARLIAMENT
YCP MPs IN PARLIAMENT

YCP MPs IN LOKSABHA : ‘సంఖ్యాపరంగా మేం 25 మందిమే. అంతమాత్రాన మా స్వరం బలహీనంగా లేదు. మేం చెప్పాల్సినవి స్పష్టంగా, బిగ్గరగా చెబుతున్నాం. పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించి, అమలు చేయాలి’ అని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ కోరారు. ఆయన గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడుతూ... ‘విభజన చట్టంపై నేను ఎంత తక్కువ మాట్లాడితే అధికారపార్టీకి అంత మేలన్నారు.

నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వగా, 2014 మార్చిలో నాటి కేంద్ర మంత్రివర్గమూ ఆమోదించిందని తెలిపారు. విభజన జరిగి తొమ్మిదేళ్లు గడిచినా తమ రాష్ట్రానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయలేదని, పోలవరం పూర్తికాలేదని.. వాటిని చూస్తే బాధేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన చట్టంలో దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మిస్తామన్నారని.. దాన్ని రామాయపట్నానికి మార్చారన్నారు. కనీసం అక్కడా పనులు మొదలుపెట్టలేదని విమర్శించారు. కడప స్టీల్‌ప్లాంట్‌దీ అదే పరిస్థితని ఆక్షేపించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులనూ విస్మరించారని మండిపడ్డారు. ఇలాగైతే తాము ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలతో ఎలా పోటీపడగలం? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి స్పందించి మెట్రో ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపండి: లావు

బడ్జెట్‌పై జరిగిన చర్చలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... ‘ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా పుండుమీద కారం చల్లినట్లు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుండటం బాధాకరం. విభజన చట్టంలోని హామీల అమలుకు ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విభజించిన కారణంగానే అప్పటి ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించారు. 1950లలోనే నాగార్జునసాగర్‌ను వేగంగా నిర్మించారు. ప్రస్తుతం ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ పోలవరాన్ని వేగంగా నిర్మించలేకపోవడం బాధాకరం. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.9400 కోట్ల బకాయిల సమస్యను కూడా కేంద్రం పరిష్కరించలేదు’ అని విచారం వ్యక్తంచేశారు.

"సీఎం జగన్‌ అనేకసార్లు ప్రధాని మోదీకి ఏపీ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. 2014లో ఇచ్చిన ఈ హామీని ...9 ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదు. విభజన చట్టం హామీల అమలుకు ఇక ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఏపీని అశాస్త్రీయంగా విభజంచిన కారణంగానే ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఏపీకి ఎలాంటి పరిశ్రమలు, రాజధాని లేనందున... ప్రత్యేకహోదాతో ఆ లోటు భర్తీ చేస్తామని చెప్పి....ఇప్పటికీ నెరవేర్చలేదు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. ఏపీ ప్రజలకు ఎంతో అనుబంధం ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటీకరణను ఆపాలని కోరుతున్నాం"-లావు శ్రీకృష్ణదేవరాయలు,నర్సరావుపేట ఎంపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.