ఆంధ్రప్రదేశ్

andhra pradesh

FUTURE OF EDUCATION: పేద యువత బంగారు భవిష్యత్​కు 'స్వచ్ఛంద సంస్థలు'

By

Published : Jun 2, 2023, 8:46 PM IST

Updated : Jun 2, 2023, 10:08 PM IST

FUTURE OF EDUCATION: ఎంతోమంది యువత ఆర్థిక స్థోమత లేకనో, మరే కారణంతోనో చదువు అర్ధాంతరంగా మానేస్తున్నారు. అందులో పదో తరగతి తరువాత ఏం చదవాలో అవగాహన లేక కొందరు, ఏదో ఒకటి చదువుతూ ఉపాధి లభించక ఇబ్బంది పడేవారు మరికొందరు. ఇలాంటి వారు భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా అనంతపురంలోని 2 స్వచ్ఛంద సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఆ సంస్థలు ఇచ్చిన ప్రోత్సాహంతో యువత చక్కటి ప్రతిభ, నైపుణ్యాలు సంపాదించి భవిష్యత్‌ను ఎలా నిర్మించుకుంటున్నారో ఈ కథనంలో చూద్దాం.

EDUCATION
EDUCATION

పేద యువతకు పెద్ద దిక్కుగా..నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు

FUTURE OF EDUCATION: యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అనేక స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే నైతిక విలువలతో పాటు, ఆరోగ్యం పెంపొందించుకునే శిక్షణ జోడించి వృత్తివిద్య అందించే సంస్థలు వేళ్లమీద లెక్కపెట్టేవే. ఈ తరహాలోనే నిరుపేద యువతను అక్కున చేర్చుకొని భావి పౌరులుగా తీర్చిదిద్దుతూ కార్పొరేట్ సంస్థలతోనే ఔరా అనిపించుకుంటున్నాయి ఈ 2 సంస్థలు. వీటిల్లో శిక్షణ పొందిన విద్యార్థులు వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా నిస్వార్థ ఫౌండేషన్ యువత కోసం అనేక సేవ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా 10 పాసైన విద్యార్థులకు తదుపరి చదువుకోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్విహిస్తూ మూడేళ్లుగా సేవలందిస్తోంది. ఈ సంస్థ సేవలను గుర్తించిన అభయ పౌండేషన్ వారితో కలిసి పని చేయాలని భావించింది. అలా నిరుపేద గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఈ 2 ఫౌండేషన్లు కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులకు ఈ మేరకు ముందుకు వెళ్తున్నారు.

యువత, విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అందించే ప్రతిపాదనలను ఆయా సంస్థలకు వివరించడంతో కాంటినెంటల్ కాఫీ నుంచి లారస్ ల్యాబ్స్ వరకు పలు సంస్థలు తమ సీఎస్‌ఆర్ నిధులు ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. అలా సమకూరుతున్న నిధులతో మూడేళ్లుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు రాసిన గ్రామీణ పేద విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించాయి ఈ సంస్థలు. ఆ పరీక్షల ద్వారా 120 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారిని 2 గ్రూపులుగా సూపర్ 60 టీంలను ఏర్పాటు చేశారు. 40 రోజుల పాటు ఈ విద్యార్థులకు త్రిపుల్ ఐటీ, పాలీసెట్ తదితర విద్య కోసం పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాయి.

ఈ 2 సేవా సంస్థల కృషిని గుర్తించిన ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు సూపర్ 60 విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు.. ఈ పేద విద్యార్థుల కోసం ఎలాంటి పారితోషకం తీసుకోకుండా శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరమైన యువతను ఎంపిక చేసి డ్రైవింగ్, సెల్ ఫోన్ రిపేరీ, యువతులైతే టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎంపిక చేసి వారికి ఉచితంగా వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేసి ప్రాంగణంలోనే 30 నుంచి 40 రోజుల శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థ వద్ద శిక్షణ పొందిన అనేక మంది గ్రామాల్లోనే ఉపాధి ఏర్పాటు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు.

నిరుపేద గ్రామీణ యువతను అన్ని విధాలా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, వారికి ఉపాధి కల్పించటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఈ సంస్థల వ్యవస్థాపకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 2, 2023, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details