తెలంగాణ

telangana

రవాణా శాఖ చెక్​పోస్టులకు సర్కార్​ ఝలక్ - ఎన్నికల కోడ్‌ ముగిశాక శాశ్వతంగా తొలగింపు! - Removal rto Check posts telangana

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 10:05 AM IST

Removal RTO Check Posts in Telangana : రాష్ట్రంలో రవాణా శాఖకు చెందిన 15 చెక్​పోస్టులను శాశ్వతంగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు లోక్​సభ ఎన్నికల కోడ్‌ ముగిశాక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Telangana Transport Department Removal of Checkposts
Telangana Transport Department Removal of Check posts (Etv Bharat)

TS Govt on Removal of Check Posts at Borders :తెలంగాణలో రవాణా శాఖ చెక్‌పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు మొత్తం 15 చెక్‌పోస్టులున్నాయి. ఇందులో వాంకిడి, అలంపూర్‌, కృష్ణా, సాలూర, ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మద్నూర్‌, బైంసా, నాగార్జునసాగర్‌, విష్ణుపురం, కోదాడ, కల్లూర్‌, అశ్వారావుపేట, పాల్వంచ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మరొకటి కామారెడ్డిలో ఉంది. ఒక్కో చోట 10 నుంచి 15 మంది అధికారులు, ఉద్యోగులు ఉంటారు.

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలు, పర్మిట్లను చెక్​పోస్టుల్లో తనిఖీ చేయాలి. అయితే ఇవి అవినీతి కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు దశాబ్దాలుగా ఉన్నాయి. ఒక్కో చెక్‌పోస్టు దగ్గర పర్మిట్‌ లేని వాహనాల నుంచి నామమాత్రపు జరిమానాలే విధిస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చాక జిల్లాల్లో అంతకు ఎన్నో రెట్లు జరిమానా వసూలవుతున్నట్లు తెలుస్తోంది. అంటే సరిహద్దుల్లో నిబంధనల అమలు సక్రమంగా జరగడం లేదని సమాచారం.

మొక్కజొన్నలు తింటూ రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ ఏనుగు.. గంటపాటు నిలిచిన వాహనాలు

గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు : దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యం, రవాణా పర్మిట్లు సహా వాహనాల అనుమతులు ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ చెక్‌పోస్టులు అవసరం లేదని కేంద్రం గతంలోనే సర్క్యులర్‌ జారీ చేసింది. పలు రాష్ట్రాలు వీటిని తొలగించాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ సర్కార్ ఈ అంశంపై దృష్టి పెట్టింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వీటిపై చర్చించి తొలగించేందుకు మొగ్గుచూపారు.

ఎన్నికల కోడ్‌ రావడానికి కొద్దిరోజుల ముందు ఉన్నతాధికారులు చెక్​పోస్టుల తొలగింపుపై తెలంగాణ సర్కార్​కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. వీటిల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 మందికిపైగా పని చేస్తున్నారు. ఈ ఉద్యోగులను జిల్లాలు, హైదరాబాద్‌లో వినియోగించుకోవాలని రవాణా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. కొద్దివారాల క్రితం ఓ పొరుగు రాష్ట్రం చెక్‌పోస్టులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

యూజర్‌ ఛార్జీల ఆదాయం ఇక రవాణాశాఖకే : వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఇతర సేవల సమయంలో రవాణాశాఖ వాహనదారుల నుంచి లైఫ్‌ట్యాక్స్‌తోపాటు యూజర్‌ ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది. ఏటా ఈ మొత్తం రూ.130 కోట్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. రవాణాశాఖకు హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భవనాలు సరిగా లేవని, కొత్త భవనాలు, కంప్యూటర్లు వంటి అవసరాలకు నిధులు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఎన్నికల కోడ్‌కి ముందు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. యూజర్‌ ఛార్జీల ఆదాయాన్ని కొత్త భవనాలు, మౌలిక సదుపాయాలకు ఉపయోగించుకుంటామని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ ముగిశాక అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

చెరుకు కోసం చెక్​పోస్ట్​కు అడ్డంగా ఏనుగుల గుంపు. వాహనదారులకు ఇక్కట్లు

'భోరజ్‌ చెక్​పోస్టు' వద్ద విధుల కోసం అధికారుల కొట్లాట

ABOUT THE AUTHOR

...view details