తెలంగాణ

telangana

రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు - రూ.2 కోట్ల 7లక్షల విలువైన మద్యం పట్టివేత - lok sabha elections 2024

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 7:55 PM IST

Police Checkings in Telangana : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీస్తున్న వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నగదు, మద్యాన్ని ఎక్కడికక్కడ పట్టుకున్నారు. ఎన్నికల్లో ప్రలోభాలను అడ్డుకునేందుకు మరింత నిఘా పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Police Checkings in Telangana
Lok Sabha Elections 2024 (ETV BHARAT)

రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు- భారీగా మద్యం పట్టివేత (ETV BHARAT)

Lok Sabha Elections 2024 :మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 7 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి రాజమండ్రికి ఓ వాహనంలో తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేశారు. లారీని పరిశీలించగా, సేంద్రీయ ఎరువుల కింద మద్యం కాటన్లు అమర్చి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ మద్యం విలువ 2 కోట్ల 7లక్షల 36 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

మైక్‌లు బంద్‌ - రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. 119 కాటన్ల మద్యాన్ని మినీ వ్యాన్లలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోదాడకు చెందిన ఒక వైన్‌షాప్‌ నుంచి తీసుకెళ్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు మేళ్లచెరువు పోలీసులు తెలిపారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారు డీసీ తండా చెక్‌పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 50 వేలకు మించి నగదుతో ప్రయాణం చేయరాదని, ఒకవేళ అధిక మొత్తంలో నగదు ఉంటే సరైన ఆధారాలు చూపించాలని పోలీసులు తెలిపారు. బంగారం వంటి విలువైన వస్తువులకు సరైన ధ్రువపత్రాలు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ దృష్ట్యా మద్యం దుకాణాలను ఆబ్కారీ అధికారులు సీజ్ చేశారు. నిబంధనల మేరకు వైన్‌షాపులు మూసివేసినట్లు తెలిపారు. వర్ధన్నపేటలో ఓ మద్యం దుకాణం సీజ్ చేసే క్రమంలో అధికారులు, మద్యంప్రియులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్‌పై తమకు సమాచారం చెప్పలేదని మద్యం ఇవ్వాలని పట్టుబట్టారు. అప్పటికే వైన్‌షాపులను అధికారులు మూసివేయడంతో మద్యంప్రియులు నిరాశతో వెనుదిరిగారు.

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. తెలంగాణ-చత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అణువణువు శోధించారు. చర్ల మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ బాంబ్ స్వాడ్‌తో పరిశీలించారు. పోలింగ్‌ వేళ మావోయిస్టులు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఉండడానికి ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

సాయంత్రం 6.30 తర్వాత నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండకూడదు : వికాస్​ రాజ్​ - CEO Vikas Raj on Exit polls 2024

ఎన్నికల్లో పారించేందుకు 4వేల లీటర్ల మద్యం - పకడ్బందీగా పట్టుకున్న పోలీసులు - LIQUOR SEIZED IN HYDERABAD

ABOUT THE AUTHOR

...view details