తెలంగాణ

telangana

దానికి కట్టుబడి ఉన్నా - అందుకే ఈ విజయం : మ్యాచ్ హీరో యశ్ ఠాకూర్ - IPL 2024 Gujarat Titans VS LSG

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 8:10 AM IST

IPL 2024 Gujarat Titans VS LSG : టీమిండియా బౌలర్ యశ్ ఠాకూర్ లఖ్‌నవూ సూపర్ జెయంట్స్ విజయాన్ని శాసించాడు. ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను చిత్తు చేస్తూ జట్టు 33 పరుగుల ఆధిక్యంతో గెలుపొందేందుకు కారణమయ్యాడు.

Etv Bharat
Etv Bharat

IPL 2024 Gujarat Titans VS LSG :ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన లఖ్‌నవూ సూపర్ జెయంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్ యశ్ ఠాకూర్ చెలరేగిపోయాడు. చాకచక్యంగా బంతులను సంధిస్తుంటే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. 164 పరుగల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను ఆరంభం నుంచి ఇరకాటంలో పెట్టేశాడు యశ్. 30 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో LSGకి 33పరుగుల ఆధిక్యంతో విజయాన్ని కట్టబెట్టాడు. ఈ సక్సెస్ అంతా జట్టు వ్యూహం, ప్రణాళికలకు కట్టుబడి ఉండటంతోనే సాధ్యమైందని, ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్ టార్గెట్ చేసుకుని ఆడామని యశ్ వివరించాడు. కాగా, యశ్ అత్యుత్తమ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

యశ్ ఠాకూర్ మాట్లాడుతూ - "5 వికెట్లు తీయడం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోవడం చాలా సంతోషం. గిల్‌ను పడగొట్టాలని అనుకున్నాను. కేఎల్ రాహుల్ కూడా అదే చేయమనడంతో వర్కౌట్ అయింది. దురదృష్టవశాత్తు మయాంక్ యాదవ్‌కు గాయమైంది. వీలైనంత వరకూ నువ్వే పూర్తి చేయాలని రాహుల్ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తొలి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నాడు.

కెప్టెన్ కృనాల్ పాండ్యా కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. "నేను ఒకట్రెండు బంతులను ఎదుర్కోగానే అర్థమైంది. మైదానం బౌలర్లకు బాగా కలిసొస్తుందని, ఇదే మాటను పూరన్​తో కూడా అన్నాను. ఆశించిన దానికంటే 10నుంచి 15 పరుగులు తక్కువగానే వస్తాయని అనుకున్నాం. అదే జరిగింది. బాగా డిఫెండ్ చేయగలిగాం. బ్యాట్స్‌మన్ బలాలు, బలహీనతలు తెలుసుకొని ఆడటం నాకిష్టం. మా వ్యూహం, ప్రణాళికలను సరిగ్గా అమలుచేయగలిగాం. ఇంత తక్కువ స్కోరును కూడా బాగా కాపాడుకున్నాం. మయాంక్ యాదవ్ బాగానే ఉన్నాడనుకున్నా. నెట్స్​లో ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా బాగానే ఆడాడు " అని కృనాల్ అన్నాడు
కాగా, ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన లఖ్‌నవూ పరుగులు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. వరుసగా తొలి రెండు ఓవర్లలోనే డికాక్ (6), దేవ్‌దత్ పడిక్కల్ (7)ను ఉమేశ్ అవుట్ చేయడంతో లఖ్‌నవూ 18/2తో కష్టాల్లో పడింది. రాహుల్ (33) డిఫెన్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో స్కోరు బోర్డు నిదానించింది. స్టాయినిస్(58; 43 బంతుల్లో 4×4, 2×6) షాట్లు బాదినా 12 ఓవర్లకు జట్టు స్కోరు 88 పరుగులే. 15,16 రెండు ఓవర్లలో కలిపి అందుకుంది 12 పరుగులే. చివర్లో బదోని (20), పూరన్‌ (32 నాటౌట్‌; 22 బంతుల్లో 3×6) ధాటిగా ఆడటంతో లఖ్‌నవూ చెప్పుకోదగ్గ టార్గెట్ ఇవ్వగలిగింది.

ABOUT THE AUTHOR

...view details