తెలంగాణ

telangana

రామమందిరం టు డిజిటల్ ఇండియా- ఈ '10' అస్త్రాలపైనే మోదీసేన గంపెడాశలు!

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 4:06 PM IST

Loksabha Elections 2024 BJP Campaign Topics : సార్వత్రిక ఎన్నికల్లో 370 లోక్‌సభ సీట్ల పెద్ద టార్గెట్‌ను పెట్టుకున్న బీజేపీ- దాన్ని సాధించేందుకు కీలకమైన ప్రచార అస్త్రాలను రెడీ చేసుకుంది. ఆ అస్త్రాలే తమకు విజయాన్ని అందిస్తాయని గంపెడాశలు పెట్టుకుంది. అయోధ్య రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు వంటి మొత్తం 10 ప్రచారాస్త్రాలు కమలదళం చేతిలో ఉన్నాయి. వాటిని ఏ విధంగా జనంలోకి బీజేపీ తీసుకెళ్లనుందో ఓసారి చూద్దాం.

Loksabha Elections 2024 BJP Campaign Topics
Loksabha Elections 2024 BJP Campaign Topics

Loksabha Elections 2024 BJP Campaign Topics : భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో బిగ్ స్కెచ్, బిగ్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. బిగ్ టార్గెట్ అంటే 370 లోక్‌సభ సీట్లు!! ఇండియా కూటమి పక్షాలను చిత్తుచేసి ఎన్డీయే పక్షాలు దేశవ్యాప్తంగా పైచేయి సాధించేలా చేయడమే బిగ్ స్కెచ్!! ఎన్డీయే కూటమిలోని పార్టీలు కూడా బాగా రాణిస్తే 400 సీట్ల మార్కును ఈజీగా దాటుతామనే ధీమాతో మోదీసేన ఉంది. ఈక్రమంలో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు కమలదళం ప్రజల్లోకి తీసుకెళ్లనున్న టాప్-10 అంశాలేంటో ఓసారి పరిశీలిద్దాం

అయోధ్య రామ మందిరం
అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో నవ్య భవ్య రామమందిరాన్ని నిర్మించాలనేది భారతదేశంలోని హిందువుల ఐదు వందల ఏళ్ల నాటి కల. దాన్ని సాకారం చేసిన ఘనత కచ్చితంగా బీజేపీ సర్కారుదేనని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ సేన అంత దూకుడును ప్రదర్శించలేదు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూకుడును పెంచింది. ఈక్రమంలోనే చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది అయోధ్య రామమందిర అంశం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.

ఇక ప్రత్యేకమైన ట్రస్టును ఏర్పాటు చేసి, దాని ద్వారా మందిరాన్ని నిర్మించింది. స్వయంగా ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కేంద్ర ప్రభుత్వ మీడియాలోనూ ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ వేడుకను బీజేపీ పెద్దఎత్తున జనంలోకి తీసుకెళ్లింది. ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని వాడుకొని దేశంలోని మెజారిటీ వర్గానికి చేరువయ్యేలా కమలదళం కసరత్తు చేయనుంది. ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఈ అంశం కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.

ఆర్టికల్ 370
మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఆర్టికల్ వల్ల జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. అయితే 2019 ఆగస్టు 5న మోదీ సర్కారు ఆర్టికల్ 370ని రద్దు చేసింది. మోదీ సర్కారుకు పూర్తి మెజారిటీ ఉండటంతో దీనికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. 2014 సంవత్సరం నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ వచ్చింది.

చివరకు ఆ దిశగా నిర్ణయాన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్యపర్చింది. భారత రాజ్యాంగాన్ని కశ్మీర్‌కు వర్తింపజేయాలని సూచించే క్లాజ్ 1 మినహా ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనలను మోదీ సర్కారు రద్దు చేసింది. దీంతో దశాబ్దాలుగా కశ్మీర్‌లో హింసను చవిచూసిన కశ్మీరీ పండిట్లు హర్షం వ్యక్తం చేశారు. మోదీకీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందనే కోణంలో ఈ అంశాన్ని జనంలోకి కమలదళం తీసుకెళ్లనుంది.

పౌరసత్వ సవరణ చట్టం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కూడా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఒకటి. సీఏఏ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు 2019లోనే ఆమోదించింది. అయితే అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం వల్ల అమలును వాయిదావేసింది. ఆ వెంటనే దేశాన్ని కరోనా సంక్షోభం చుట్టుముట్టింది. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి కొన్ని రోజుల ముందు సీఏఏ అమలుకు సంబంధించిన నిబంధనలను రిలీజ్ చేసింది. దీంతో సీఏఏ అమల్లోకి వచ్చేసింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి మనదేశంలోకి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించడం తమ ప్రభుత్వ విజయమని బీజేపీ ఎన్నికల్లో చెప్పుకోనుంది. తమ విధానాలన్నీ ముస్లిమేతరులకు అనుకూలమైనవే అనే సంకేతాన్ని దేశంలోని మెజారిటీ వర్గంలోకి పంపనుంది.

యూనిఫామ్ సివిల్ కోడ్
దేశంలోని అన్ని మతాలు, కులాలు, తెగలకు చెందిన వారికి అన్ని విషయాల్లోనూ ఒకే విధమైన చట్టాలను అమల్లోకి తెచ్చేందుకు వీలు కల్పించేదే యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ). యూసీసీని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ రాష్ట్రంలోనూ గత నెల చివరి వారం నుంచే యూసీసీ అమల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ యూసీసీని అమలు చేస్తామనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేందుకే ఉత్తరాఖండ్‌లో దాన్ని అమల్లోకి తెచ్చారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే తదుపరిగా యూసీసీని అమలు చేసేందుకు గుజరాత్, అసోం ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ యూసీసీ చట్టాన్ని చేస్తామని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ట్రిపుల్ తలాక్
ముస్లింలోని మహిళా ఓటు బ్యాంకుపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసమే 2019లో ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించింది. దీని ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తలపై మోదీ సర్కారు కొరడా ఝుళిపించింది. ట్రిపుల్ తలాక్ చెప్పడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తలకు గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. ఇది కూడా బీజేపీ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ముస్లిం మహిళల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఈసారి ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోనుంది. ముస్లిం మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడమే తమ లక్ష్యమని కమలదళం ప్రచారం చేయనుంది.

ఎన్ఆర్‌సీ
ఎన్ఆర్‌సీని బీజేపీ కీలకమైన అంశంగా పరిగణిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎన్ఆర్‌సీ అమలుపై ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఆర్‌సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. మన దేశంలో నివసిస్తున్న పౌరులందరి రికార్డులను నిర్వహించే రిజిస్టర్‌ను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. 2013 సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అసోంలో ఎన్ఆర్‌సీ అమలవుతోంది. మరే రాష్ట్రంలోనూ ఎన్‌ఆర్‌సీ అమలుకావడం లేదు. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని బీజేపీ అంటోంది. ఎన్ఆర్‌సీ అమలు కోసం తమను గెలిపించాలని బీజేపీ ప్రజలను కోరనుంది.

వికసిత్ భారత్ విజన్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతాయి. అందుకే 2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్టుకుంది. డెవలప్ అయిన దేశంగా భారత్‌ను మార్చే ప్రణాళిక తమ వద్ద ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. వికసిత భారత్ సాధన కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఎలా ముందుకు తీసుకోవాలనే స్పష్టత తమకు ఉందని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, ఉచితహామీలను దీని ద్వారా కౌంటర్ చేయాలని మోదీసేన యోచిస్తోంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి భారత్‌ను చేర్చాలనే తమ స్వప్నాన్ని ఓటర్లకు వివరించనుంది.

గ్లోబల్ స్టేజ్‌లో భారత్ సత్తా
ప్రపంచ దేశాల్లో భారత్ ఇమేజ్‌ను పెంచడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని బీజేపీ అంటోంది. అగ్రరాజ్యాలుగా వెలుగొందుతున్న అమెరికా, రష్యాలు భారత్‌కు టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయి. దీనికి కారణం మోదీ సర్కారు విదేశాంగ విధానాలే అని కమలదళం శ్రేణులు అంటున్నాయి. కొన్ని నెలల క్రితం స్వయంగా మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత మన్మోహన్ సింగ్ కూడా బీజేపీ సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తీసుకున్న దౌత్య వైఖరి ప్రశంసనీయమైనదని కొనియాడారు. తాజాగా ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం విషయంలోనూ భారత్ తనదైన విధానానికి కట్టుబడి నిలిచింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాక కెనడా ప్రధానమంత్రి భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిని కూడా భారత్ బలంగా తిప్పికొట్టింది. ఇవన్నీ భారత్ ఎవరికీ జంకడం లేదని క్లియర్ చేస్తున్నాయి. అందుకే ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది.

జీడీపీ మెరుపులు
భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాల ప్రకారం.. 2023 సంవత్సరానికి సంబంధించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 8.4 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం ఏడాది(2022) ఇదే కాలంలో జీడీపీ వృద్ధి కేవలం 4.3 శాతంగా ఉంది. అంటే ఏడాది వ్యవధిలో గొప్ప మార్పును భారత్ సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలను కూడా గొప్పగా చెప్పుకునేందుకు బీజేపీ క్యాడర్ రెడీ అవుతోంది. తాము మరోసారి అధికారంలోకి వస్తే భారత దేశాన్ని ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ అంటున్నారు. ఈ అంశం ప్రజలను ఆకట్టుకునే అవకాశం ఉంది.

డిజిటల్ ఇండియా
భారతదేశాన్ని డిజిటల్ పుంతలు తొక్కించిన ఘనత మోదీ సర్కారుదే. ఈవిషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేర్చడం నిజంగా పెద్ద విప్లవాత్మక అంశమే. చాలారకాల కేంద్ర ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి మారడం మంచి పరిణామం. దీనివల్ల ప్రజలకు ఆయా సేవలు మరింత చేరువయ్యాయి. వాటిలో పారదర్శకత పెరిగింది. డిజిటల్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వ కార్యకలాపాల్లో పేపర్ వినియోగాన్ని తగ్గించేసి, డిజిటల్ టూల్స్‌ను వాడటం మొదలుపెట్టారు. దేశ ప్రజలను ఈజీగా బీజేపీతో కనెక్ట్ చేసే అంశంగా ఇది నిలువనుంది.

టార్గెట్ 370పై BJP ఫోకస్- దక్షిణాదిలో ఆ పని చేస్తే లైన్ క్లియర్?- బలాలు, బలహీనతలివే!

బెగుసరాయ్​పై అందరి ఫోకస్- బీజేపీ హ్యాట్రిక్​ కొడుతుందా? ప్రత్యర్థుల వ్యూహం పనిచేస్తుందా?

ABOUT THE AUTHOR

...view details