తెలంగాణ

telangana

ఇక అమెరికా వీసా మరింత భారం- హెచ్​1బీ సహా ఐదు కేటగిరీల ఫీజులు పెంపు

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 7:13 PM IST

Updated : Feb 1, 2024, 10:04 PM IST

US Hiked Visa Application Fee : అమెరికా వీసా దరఖాస్తుదారులపై మరింత భారం పడనుంది. అప్లికేషన్ ఫీజులు మరింత ప్రియమయ్యాయి. హెచ్‌-1బీ సహా పలు వలసేతర వీసాల అఫ్లికేషన్‌ ఫీజులను బైడెన్‌ ప్రభుత్వం పెంచింది.

US Hiked Visa Application Fee
US Hiked Visa Application Fee

US Hiked Visa Application Fee :అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్​న్యూస్​. ఇకపై అగ్రరాజ్యం వెళ్లాలనుకుంటున్న వారిపై మరింత భారం పడనుంది. హెచ్‌-1బీ వీసాతో పాటు కొన్ని కేటగిరీల దరఖాస్తు ఫీజులను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. పెంచిన రుసుములు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీసాల అప్లికేషన్‌ ఫీజులను పెంచడం 2016 తర్వాత ఇదే మొదటిసారి అని బైడెన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. అంతేకాకుండా హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ధరను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. అయితే, ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఎల్‌-1 వీసా దరఖాస్తు ఫీజును 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు. ఈబీ-5 వీసాల అప్లికేషన్‌ ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ తమ ఫెడరల్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఈ హెచ్‌-1బీ వీసాలు అవకాశం కల్పిస్తాయి. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ఇక, ఈబీ-5 ప్రోగ్రామ్‌ను 1990లో ప్రారంభించారు. అమెరికన్‌ స్థానికులకు కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించేలా, కనిష్ఠంగా 5లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈ వీసాలను జారీ చేస్తారు. ఎల్‌-1 అనేది, కంపెనీలో అంతర్గతంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే వీసా. బహుళజాతి కంపెనీలు విదేశాల్లో ఉన్న తమ బ్రాంచీల నుంచి ఉద్యోగులను కొంతకాలం పాటు అమెరికాకు తీసుకొచ్చి, అక్కడ విధులు నిర్వహించుకునేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది.

అమెరికాలో తీవ్ర నిపుణుల కొరత
H1B quota increase :అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని, దాదాపు 2,100 చిన్న, మధ్యశ్రేణి సంస్థలు భాగస్వాములుగా ఉన్న ఐటీ సేవల సంఘం ఇటీవల వెల్లడించింది. నిపుణుల నియామకానికి వీసాల సంఖ్యను పెంచాలని బైడెన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 65వేలుగా ఉన్న హెచ్‌-1బీ వీసాల కోటాను రెట్టింపు చేయాలని ఐటీ కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వీటిల్లో భారతీయులు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్‌, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

కెనడా షాకింగ్​ నిర్ణయం!- స్టూడెంట్ వీసా డిపాజిట్ డబుల్​- 20వేల డాలర్లకుపైగా ఉండాల్సిందే!

హెచ్​-1బీ వీసాల జారీకి కొత్త రూల్స్​!- మారిన నిబంధనలు ఇవే!

Last Updated : Feb 1, 2024, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details