తెలంగాణ

telangana

గోల్డీ బ్రార్‌ బతికే ఉన్నాడు- అవన్నీ రూమర్లే : అమెరికా పోలీసులు - Goldy Brar US Incident

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 11:25 AM IST

Goldy Brar America : భారత్​కు చెందిన గ్యాంగ్‌ స్టర్‌ గోల్డీ బ్రార్‌ అమెరికాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడని, హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు.

goldy brar america
goldy brar america

Goldy Brar America :ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్​ స్టర్​ గోల్డీ బ్రార్​ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. గోల్డీ బ్రార్ హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపారు. గోల్డీ బ్రార్​పై గుర్తు తెలియని దుండగులు అమెరికా కాలిఫోర్నియాలోని హోల్ట్‌ అవెన్యూలో కాల్పులు జరపడం వల్ల మరణించాడని వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని అమెరికా పోలీసులు ఖండించారు.

అసలేం జరిగిందంటే?
హోల్ట్‌ అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తు తెలియని దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌ స్టర్‌ గోల్డీ బ్రార్‌ గా స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. మృతుడు గోల్డీ బ్రార్‌ కాదని ప్రెస్నో పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనలో జేవియర్‌ గాల్డ్నె(37) అనే వ్యక్తి మరణించాడని పేర్కొన్నారు. ఆన్‌ లైన్​లో ప్రచారం నమ్మి కాల్పుల ఘటనలో మరణించింది గోల్డీ బ్రార్‌ అనుకోవద్దని సూచించారు. అసలు ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యాయో తెలియట్లేదని అన్నారు.

ఎవరీ గోల్డీ బ్రార్‌?
గోల్డీ బ్రార్‌ గా ప్రచారంలో ఉన్న సతీందర్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌. ఇతడు పంజాబ్​లోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌ లో 1994లో జన్మించాడు. బ్రార్ తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టైన సూత్రధారి లారెన్స్‌ బిష్ణోయ్‌ తో గోల్డీ బ్రార్​కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్​కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతోపాటు పలువురికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్​​ను హత్య చేస్తామంటూ బెదిరించాడు.

ఇటీవలే ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా గోల్డీ బ్రార్​ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్​ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details