తెలంగాణ

telangana

అలర్ట్ : మీ ఒంట్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నారు! - Excessive Salt Consumption Signs

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 12:19 PM IST

Eating Too Much Salt Warning Signs : ఉప్పు సాధ్యమైనంత తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తుంటారు. మరి.. మీరు ఎంత ఉప్పు తింటున్నారో మీకు తెలుసా? శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు అతిగా ఉప్పు తింటున్నారని అర్థమట! మరి.. ఆ లక్షణాలేంటో ఇక్కడ చూద్దాం.

Salt
Eating Too Much Salt Warning Signs

Warning Signs of Too Much Eat Salt :ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ 2,300 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాకాకుండా.. మీరు ఎక్కువ ఉప్పు తింటే మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..

కడుపు ఉబ్బరం : మీరు అధికంగా ఉప్పు తీసుకుంటున్నట్లయితే కనిపించే మొదటి లక్షణం.. కడుపు ఉబ్బరం. ఎందుకంటే ఉప్పు పొట్టలో నీటి నిల్వను ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రమంగా పొత్తికడుపు వాపునకు దారితీస్తుందట. ఈ ఉబ్బరం శరీరంలో మరికొన్ని ఆరోగ్య సమస్యలను కలుగజేస్తుందంటున్నారు.

తరచుగా తలనొప్పి :అధిక ఉప్పు వినియోగం రక్తపోటును పెంచుతుంది. ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. కాబట్టి.. మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే అప్రమత్తం కావాలంటున్నారు నిపుణులు. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తలెత్తే డీహైడ్రేషన్ తలనొప్పి మరింత తీవ్రతరం చేస్తుందంటున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే పుష్కలంగా వాటర్ తాగాలని సూచిస్తున్నారు. అలా తాగడం వల్ల శరీరం నుంచి అదనపు సోడియం బయటకు పోతుందని చెబుతున్నారు.

వాపు : మీ శరీరంలో ముఖం, చేతులు, కాళ్లు, పాదాలలో గమనించదగ్గ వాపు లేదా ఉబ్బడం అనేది కనిపించినా అలర్ట్ కావాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. అది అధిక ఉప్పు తీసుకోవడానికి సంకేతమని చెబుతున్నారు. ఎందుకంటే.. ఉప్పు శరీరమంతటా నీరు నిలుపుదలకి దోహదం చేస్తుంది. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించాలంటున్నారు నిపుణులు.

దుకాణాల్లో దొరికే తిండి - ఎందులో ఉప్పు ఎక్కువగా ఉంటుందో తెలుసా?

నిరంతర దాహం : మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే తరచూ దాహం వేస్తుంది. సాల్ట్ ఎక్కువగా తింటే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తాం. దాంతో దాహం కూడా అధికంగా వేస్తుందంటున్నారు నిపుణులు. ఈ దాహం నిరంతర సమస్యగా మారితే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు.

తరచుగా మూత్రవిసర్జన :మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే మీలో ప్రధానంగా కనిపించే మరో హెచ్చరిక సంకేతం.. తరచుగా మూత్రవిసర్జన చేయడం. ఎందుకంటే సాల్ట్ అధికంగా తీసుకోవడం కారణంగా.. శరీరం అదనపు సోడియం వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్, మూత్రాశయ సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు.

2017లో "ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఎక్కువ ఉప్పు తీసుకునే వ్యక్తులు, తక్కువ ఉప్పు తీసుకునే వారి కంటే ఎక్కువగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందట. ఈ పరిశోధనలో "యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్​"లో.. ఎపిడెమియాలజీ, కమ్యూనిటీ హెల్త్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్. షాన్ లియు పాల్గొన్నారు. రోజూ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఉప్పు తీసుకున్నవారు అధికసార్లు మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి.. పై లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలని.. మీ డైట్​లో ఉప్పు తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఉప్పు వాడకం ఎలా తగ్గించాలో తెలియట్లేదా - ఈ టిప్స్ పాటించండి!

ABOUT THE AUTHOR

...view details