What Is Quiet Firing :ఉద్యోగులు తమ యజమానుల దృష్టిలో పడాలని, తమ పనిని అందరూ మెచ్చుకోవాలని, నిద్రహారాలు మరిచి కష్టపడి పని చేస్తుంటారు. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోవాల్సిందే. మీ కృషికి ప్రసంశలు పొందడమనే విషయం గురించి మర్చిపోండి. ఇప్పుడు పలు బడా కంపెనీలు తమ ఉద్యోగుల కృషిని గుర్తించడం లేదు సరికదా, తిరిగి వారిని సైలెంట్‌గా తొలగించేందుకు లోపాయికారీ విధానాలను అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా క్వైట్ ఫైరింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. టెక్ రంగంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఆర్థిక అనిశ్చితులతో పాటు సాంకేతికంగా వచ్చిన అనేక మార్పులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటి?
ప్రస్తుతం చాలా బడా కంపెనీలు ఉద్యోగులను తీసివేసే విషయంలో పలు పద్ధతులను అనుసరిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను నేరుగా తొలగిస్తుంటే, మరికొన్ని కంపెనీలు పరోక్షంగా ఉద్యోగులను వారికి వారే వైదొలిగేలా చేస్తున్నాయి. ఎలా అంటే, మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ కష్టాన్ని సంస్థ గుర్తించకపోవడం, మీ బాస్ లేదా టీమ్ లీడర్ మీ పట్ల దారుణమైన వైఖరి ప్రదర్శిస్తుంటారు. ఇది మిమ్మల్ని మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు జాబ్ మానేయ్యాలనే నిర్ణయానికి వస్తారు. ఇదే క్వైట్ ఫైరింగ్. అంటే పొమ్మనకుండా పొగబెడుతున్నాయి.
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఉద్యోగులను తొలించాలనుకున్నప్పుడు కంపెనీలు వారిని బాగా ఇబ్బందులకు గురిచేస్తాయి. నేరుగా పొమ్మని చెప్పలేక ఇలాంటి పద్దతులను అవలంభిస్తాయి. వసతులను తగ్గించడం, పనిలో ప్రాధాన్యం లేకుండా చేయడం, అధికంగా పనిభారం మోపడం, పనిగంటలు పెంచడం, ఏమాత్రం అవగాహనలేని పనిని అప్పగించడం లాంటివి చేస్తుంటారు. ఫలితంగా ఉద్యోగికి చికాకు, విసుగు వస్తుంది. దీంతో మానసికంగా ఒత్తిడికి లోనై ఉద్యోగం మానేసి వెళ్లాలనే పరిస్థితికి వస్తాడు. అలాంటి పరిస్థితులు కల్పించడమే క్వైట్ ఫైరింగ్.
ఒక్కోసారి ఉద్యోగులు చేసే ప్రతి పనిని బాస్‌లు కానీ, టీమ్ లీడర్స్ కానీ విమర్శిస్తూనే ఉంటారు. ఉద్యోగులు చేస్తున్న ప్రతిపైనా నిఘా పెడతారు. ఏమాత్రం పొరపాటు చేసినా, పై అధికారులు స్పందించే తీరు చాలా కఠినంగా ఉంటుంది. ఉద్యోగులు సంఖ్యను ఎలాగైనా తగ్గించాలని కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి మేరకే ఇలాంటి చర్యలు చేపడుతుంటారు.
ఇదంతా ఎందుకు?
కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులను తగ్గించుకోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి పద్దతులను అనుసరిస్తుంటాయి. అయితే నేరుగా లేఆఫ్ చేసే అవకాశం ఉంటుంది కదా? మరి ఈ క్వైట్ ఫైరింగ్ ఎందుకనే అనుమానం రావచ్చు. అలా చేయడానికి కొన్ని నిబంధనలు అడ్డువస్తాయి. నేరుగా ఉద్యోగిని తొలగిస్తే, కొన్ని రకాల పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లీవ్స్, ఇంక్రీమెంట్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని క్లెయిమ్స్ చేసుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది. లీగల్ గానూ సవాళ్లు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు కంపెనీలు ఈ క్వైట్ ఫైరింగ్ పద్దతిని అనుసరిస్తాయి.