ETV Bharat / business

IPL మ్యాచ్ పవర్ ప్లే, స్ట్రాటెజిక్ టైమౌట్​- క్రికెట్ నేర్పే బిజినెస్​ పాఠాలివే! - Best Financial Lessons

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 6:46 PM IST

Financial Lessons From IPL
Financial Lessons From IPL

Financial Lessons From IPL : ఐపీఎల్ మ్యాచ్​లను చూసి ఆర్థిక పాఠాలు నేర్చుకోవచ్చట. ఐపీఎల్ మ్యాచ్ పవర్ ప్లే, కోచ్, స్ట్రాటెజిక్ టైమౌట్​లో ఒక ఫైనాన్షియల్ గురువు ఉన్నారట. అదేంటీ ఐపీఎల్​కు ఆర్థిక చిట్కాలకు సంబంధమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Financial Lessons From IPL : భారత్​లో క్రికెట్​కు ఉండే క్రేజే వేరు. అందులో ఐపీఎల్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులు టీవీ, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అయితే ఐపీఎల్​ను క్రికెట్ లాగే కాకుండా మంచి ఆర్థిక పాఠాలు నేర్పే గురువుగా భావించవచ్చట. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బ్యాటింగ్ చేసే జట్టు మ్యాచ్​లో ముందంజలో ఉండాలంటే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా కెరీర్ ప్రారంభంలో పెట్టిన పెట్టుబడులు కూడా మీ ఆర్థిక విజయంలో బాగా సహాయపడతాయి. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్​రౌండర్​లతో క్రికెట్ టీమ్ ఎలా పటిష్ఠంగా ఉంటుందో, మీరు పెట్టుబడులను సైతం అలాగే స్ట్రాంగ్​గా పెట్టుకోవాలి. టీమ్​కు మంచి కోచ్ ఎలాగో, మీ ఆర్థిక విజయావకాశాలను పెంచుకోవడానికి మంచి ఆర్థిక సలహాదారు అవసరం.

క్రికెట్ నేర్పే ఆర్థిక పాఠాలు
టీ20 మ్యాచ్ పవర్ ప్లేలో(మొదటి ఆరు ఓవర్లలో) 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఇది బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలం. ఎందుకంటే 30 యార్డ్ సర్కిల్ బయటకు కొట్టినా ఇద్దరు ఫీల్డర్లు ఉండడం వల్ల భారీగా పరుగులు వస్తాయి. అవుట్ అయ్యే రిస్క్ కూడా తక్కువ. పవర్ ప్లేలో రిస్క్‌ తీసుకోవడం వల్ల టీమ్ మంచి స్కోర్‌ సాధిస్తుంది. గేమ్​లో బ్యాటింగ్ జట్టు ముందంజలో ఉంటుంది.

అదేవిధంగా మీరు పెట్టుబడులను ముందుగా ప్రారంభించడం మంచిది. అప్పుడే మీకు ఆర్థిక ప్రయోజనాలు వేగంగా అందుతాయి. అంతేకాకుండా కెరీర్ ప్రారంభంలో ఆర్థిక కట్టుబాట్లు తక్కువగా ఉంటాయి. పొదుపు, పెట్టుబడులను అలవాటు చేసుకోవడానికి ఇదే మంచి సమయం కూడా. అయితే రిస్క్ తీసుకోవడం ముఖ్యమే కానీ బాగా ప్లాన్ చేసుకోవాలి. అనవసరమైన రిస్క్​లు తీసుకోవడం వల్ల బ్యాటర్​ ఎలా అవుట్ అవుతాడో అలాగే మీ పెట్టుబడులు దెబ్బతింటాయి.

పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలా!
ఒక బ్యాటర్​ ఒక ఏడాది ఎక్కువ పరుగులు చేసినా, బౌలర్ ఎక్కువ వికెట్లు తీసినా వచ్చే సంవత్సరం కూడా అదే ప్రదర్శన పునరావృతం చేస్తాడని కచ్చితంగా చెప్పలేం. మీ పెట్టుబడులకు, ముఖ్యంగా ఈక్విటీలో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విషయాన్నే తీసుకుందాం. వాల్యూ రీసెర్చ్ ప్రకారం 2024 ఏప్రిల్ వరకు స్మాల్ క్యాప్‌లు 6.44 శాతం రాబడిని అందించగా, గతేడాది 57.73 శాతం రాబడిని ఇచ్చింది. ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ఒక మంచి ప్లేయర్ కొన్ని ఐపీఎల్​ సీజన్​లలో ఫెయిల్ అవ్వొచ్చు. అలాగే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.

ఒకరిద్దరు మంచి బ్యాటర్లు లేదా బౌలర్లు జట్టుకు ప్రతిసారీ విజయాన్ని అందించలేరు. దీర్ఘకాలిక విజయాల కోసం టీమ్​కు మంచి బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లతో జట్టు సమతూకం అవసరం. జట్టులోని ప్రతి ఆటగాడు రాణిస్తేనే జట్టు కీలకమైన మ్యాచుల్లో గెలుస్తుంది. అదేవిధంగా మీ పోర్ట్‌ఫోలియో విషయానికి వస్తే మీ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి అన్ని అసెట్ క్లాస్‌ల సరైన మిశ్రమాన్ని కలిగి ఉండాలి. మీ పోర్ట్‌ఫోలియో ఒకే అసెట్ క్లాస్‌లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటే, అది నిర్దిష్ట సమయాల్లో నష్టపోవచ్చు.

సలహాలు ముఖ్యం
జట్టు విజయంలో కీలక పాత్ర ఆటగాళ్లదే. అయితే వారి వెంట కోచ్ ఉంటారని గుర్తుంచుకోవాలి. జట్టు విజయంలో కోచ్​లది కూడా కొంత భాగస్వామ్యం ఉంటుంది. జట్టు మంచిదైనా కానీ అది అనుసరించే వ్యూహాలు, పరాజయాలు తర్వాత అది ఎలా పుంజుకుంటుందనేది కోచ్​పై కొంత ఆధారపడి ఉంటుంది. రికీ పాంటింగ్, టామ్ మూడీ, ఆండీ ఫ్లవర్, మహేల జయవర్ధనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లు. అదేవిధంగా మీ ఆర్థిక విషయానికి వస్తే మంచి ఆర్థిక సలహాదారు నుంచి సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. వారు మీ లక్ష్యాలను బట్టి ఆర్థిక ప్రణాళికను రూపొందించడంలో మీకు సాయపడతారు. మంచి ఆర్థిక సలహాదారు మీరు పెట్టుబడులను పెట్టడంలో, స్టాక్ మార్కెట్లు డౌన్​లో ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సలహాలు ఇస్తారు.

ఐపీఎల్ సీజన్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సీజన్​లో ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్​ను పరిశీలిస్తారు సెలెక్టర్లు. అలాగే మ్యాచ్ సమయంలో కూడా బ్యాటింగ్, బౌలింగ్ జట్లు మ్యాచ్ వ్యూహాన్ని పునఃసమీక్షించడానికి రెండు స్టేటజిక్ టైమౌట్​లను తీసుకుంటాయి. అలాగే మీ పెట్టుబడుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించడం, తదనుగుణంగా మార్పులు చేయడం చాలా ముఖ్యం.

జీవిత బీమా తీసుకున్నారా? పరిహారం ఇవ్వకపోతే ఏం చేయాలో తెలుసా? - Life Insurance Claim Settlement

రిటైర్​మెంట్ ప్లాన్​ - ఈ టిప్స్​ పాటిస్తే 'ఎక్స్​ట్రా పెన్షన్' గ్యారెంటీ! - EPFO Pension Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.