తెలంగాణ

telangana

అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​ కొంటున్నారా? ఈ 9 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 4:58 PM IST

Important Things To Consider Before Buying A Flat : మీరు మంచి అపార్ట్​మెంట్ లేదా ఫ్లాట్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అపార్ట్​మెంట్​/ ఫ్లాట్ కొనేముందు 9 కీలకమైన అంశాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Things to Keep in Mind Before Buying apartment
Important things to consider before buying a flat

Important Things To Consider Before Buying A Flat : తమకంటూ ఒకసొంత ఫ్లాట్/ అపార్ట్​మెంట్ఉండాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. ఇందుకోసం జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును పెట్టుబడిగా పెడతారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్లాట్​ లేదా అపార్ట్​మెంట్​లు లాంటి ఆస్తులు కొనే ముందు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. బిల్ట్-అప్‌ ఏరియా
మనం ఫ్లాట్​ లేదా అపార్ట్​మెంట్ కొనుగోలు చేసినప్పుడు బిల్డ్​-అప్​ ఏరియా గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ బిల్డ్​-అప్ ఏరియాను అనుసరించే మనం బిల్డర్లకు డబ్బులు చెల్లించాలి. ఆస్తికి సంబంధించిన బిల్డ్​-అప్​ ఏరియాలోనే ఇంటి కార్పెట్​ ఏరియా, గోడలు, బాల్కనీ, కామన్​ ఏరియాలు ఉంటాయి. సాధారణంగా కార్పెట్ ఏరియా కంటే ఈ బిల్డ్-అప్ ఏరియా 15-25 శాతం ఎక్కువగా ఉంటుంది.

2. కార్పెట్‌ ఏరియా
కార్పెట్ ఏరియా అనేది ఆస్తికి సంబంధించిన వాస్తవ వినియోగ ప్రాంతాన్ని సూచిస్తుంది. అంటే గోడల మందాన్ని మినహాయించి, ఇంటిలో నివసించేవారి అవసరాలకు ఉపయోగపడే ప్రాంతమే కార్పెట్ ఏరియా. వాస్తవానికి ఆస్తి విలువను ఆ కార్పెట్ ఏరియా ఆధారంగా నిర్ణయిస్తారు. కనుక దీని గురించి బిల్డర్​ను ముందుగానే అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే టెర్రస్​​, బాల్కనీ, యుటిలిటీ ఏరియాలు లాంటి ప్రాంతాలు కార్పెట్​ ఏరియా కిందకు రావు.

3. సేల్​ డీడ్​
మీరు ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా సబ్​-రిజిస్ట్రార్​ ఆఫీస్​లో ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే విక్రేత ద్వారా కొనుగోలుదారులు తప్పనిసరిగా సేల్​ డీడ్ పొందాలి. ఈ చట్టబద్ధమైన సేల్​ డీడ్ లేకుండా ఏ రియల్ ఎస్టేట్ లావాదేవీ చెల్లుబాటు కాదు. ఈ విషయాన్ని అందరూ కచ్చితంగా గుర్తించుకోవాలి.

4. స్టాంప్ డ్యూటీ
ఆస్తి అమ్మకం, కొనుగోలు, బదిలీలు చేసేటప్పుడు కచ్చితంగా స్టాంప్​ డ్యూటీ చెల్లించాలి. ఆస్తి విలువను బట్టి ఈ స్టాంప్ డ్యూటీ మారుతూ ఉంటుంది. సాధారణంగా ఆస్తి విలువలో 3-8% వరకు ఈ స్టాంప్​ డ్యూటీ ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల పేరు మీద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంప్‌ డ్యూటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల, మహిళా కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేయిస్తే, చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి.

5. క్లోజింగ్ ఛార్జెస్​
చాలా మందికి క్లోజింగ్ ఛార్జెస్ గురించి అవగాహన ఉండదు. సాధారణంగా బ్యాంకులు, బీమా సంస్థలు, న్యాయవాదులు, స్థిరాస్తి ఏజెంట్లు, పన్ను విధించే వర్గాలు, ఇంటి యజమానుల అసోసియేషన్​లు స్థిరాస్తి కొనుగోలుదారుల నుంచి కొన్ని రకాల రుసుములను వసూలు చేస్తుంటారు/ చేస్తుంటాయి. అందుకే వీటిని క్లోజింగ్ ఛార్జీలు లేదా క్లోజింగ్ కాస్ట్​లు అని అంటుంటారు.

6. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (OC)
స్థానిక అధికారులు బిల్డర్లు కట్టిన బిల్డింగ్​/ అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​లను పరిశీలిస్తారు. అన్నీ నిబంధనల ప్రకారమే ఉంటే, ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందని ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీనిని బిల్డర్ ఇంటి కొనుగోలుదారులకు అందజేస్తాడు. ఇదే ఆక్టుపెన్సీ సర్టిఫికెట్​.

సదరు అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​కు విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయని, కనుక అది నివాసయోగ్యమేనని ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​ (ఓసీ) కొనుగోలుదారుడికి హామీనిస్తుంది.

7. హోమ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ (HOA)
ఒక అపార్ట్​మెంట్​లో అనేక ఫ్లాట్స్ ఉంటాయి. కనుక వీటిని సక్రమంగా మెయింటైన్ చేయడానికి, అందరి అవసరాలు తీర్చడానికి, కమ్యూనిటీ నియమాలను, నిబంధనలను సక్రమంగా నిర్వహించడానికి ఒక అసోసియేషన్ అవసరం అవుతుంది. కనుక ఇంటి యజమానులు సదరు అసోసియేషన్‌కు ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్ణీత రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

8. బిల్డింగ్‌ బైలాస్‌
పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆర్గనైజేషన్‌ కొన్ని నియమాలు, నిబంధనలను రూపొందిస్తుంది. ఈ నియమాలకు అనుగుణంగానే భవనం రూపకల్పన, ఎత్తు, నిర్మాణం, భద్రత అంశాలు ఉండాలి.

9. రెరా
భారత పార్లమెంట్​ 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) చట్టాన్ని ఆమోదించింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తూ, కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రెరా చట్టం ప్రకారం, డెవలపర్లు తమ ప్రాజెక్టులను RERAలో కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ప్రాజెక్ట్ ప్లాన్స్, లేఅవుట్స్​, ప్రాజెక్ట్ పూర్తి చేసే తేదీ వివరాలను ముందుగానే కొనుగోలుదారులకు తెలియజేయాలి. అంతేకాదు డెవలపర్లు నిర్దిష్ట ప్రమాణాలు, మార్గదర్శకాలు పాటించాలి. ఒక వేళ డెవలపర్లు నిబంధనలు అతిక్రమిస్తే, వారికి రెరా జరిమానాలు కూడా విధిస్తుంది.

మీరు కనుక అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​ లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనుగోలు చేయాలని అనుకుంటే, కచ్చితంగా రెరా వెబ్​సైట్​లో నిర్మాణంలో ఉన్న ఆస్తి వివరాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ మీకు దీనిపై సరైన అవగాహన లేకుంటే, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఎల్​ఐసీ 'అమృత్​బాల్' పాలసీతో​ - చిన్నారుల భవిష్యత్​కు భరోసా!

కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా? ఈ టాప్​-6 టిప్స్​ మీ కోసమే!

ABOUT THE AUTHOR

...view details