ETV Bharat / business

కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 9:59 AM IST

home buying budget planner
Home Buying Guide

New Home Buying Tips : మీరు ఇంటిని కొనాలనుకుంటున్నారా? ఇల్లు కొనేటప్పుడు ఏయే అంశాలను పరిగనణలోకి తీసుకోవాలి? బడ్జెట్​ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

New Home Buying Tips : జీవితంలో మొదటి ఇల్లు కొనడం అనేది ఎవరికైనా ఓ ముఖ్యమైన మైలురాయి. ఇంటిని పొందే ప్రక్రియకు సమగ్ర పరిశీలన, వ్యూహాత్మక ప్రణాళికలు అవసరం. తొలిసారి లేదా రెండోసారి ఓ ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు దీని కోసం అన్వేషణ చేసే క్రమంలో అనేక ఎంపికలు, న్యాయపరమైన వ్యవహారాలు, ముఖ్యంగా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటం వంటివి అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి.

సాధారణంగా కారు సహా ఏదైనా ఇతర వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత, వాటి పనీతీరు సరిగా లేకపోతే వాటిని వదిలించుకోవాలని చూస్తాం. కానీ ఇంటి విషయంలో అలా కాదు. అందుకే ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూద్దాం.

బడ్జెట్​ రూపొందించుకోండి
ఇంటి కొనుగోలు చేసే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన దశ బడ్జెట్​ ప్రణాళికను రూపొందించడం. ఓ ఇల్లు కొనాలని నిర్ణయించుకునే ముందు మీ ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా అంచనా వేయడం ఎంతో అవసరం. ఇంటిని కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా దాన్ని సుదీర్ఘంగా నిర్వహించడానికి ఎంత డబ్బును మీరు ఖర్చు చేయగలరో, అలాగే మీ ఆర్థిక స్థోమతను కూడా దీని కోసం పరిగణనలోకి తీసుకోవావాల్సి ఉంటుంది. ప్రతి నెల మీ ఖర్చులు కోసం ఎంత డబ్బు అడ్జెస్ట్​ చేసుకోవాలి? ఈఎంఐ తీర్చడానికి ఎంత నగదు మిగిలిందో ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఓ సరైన ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఇల్లు అనేది మీ ఆదాయ బడ్జెట్​కు లోబడి ఉండాలి. అది మీ బడ్జెట్​కు మించకూడదు.

అవసరమైన సౌకర్యాలు ఉన్నచోటే ఇల్లు
ఇంటి నాణ్యత ఎంత ముఖ్యమో అది ఎలాంటి ప్రాంతంలో నిర్మిస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం. మీరు నివసించాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకునే ముందు మీ కుటుంబానికి అవసరమైన సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోండి. ఉదాహరణకు మీ ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఉన్నత పాఠశాలలు, కళాశాలలు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నివసించడం మంచిది. మీరు ఏదైనా వృత్తి నిపుణులైతే కీలక వ్యాపార కేంద్రాలకు, నగరంలోని మిగిలిన ప్రదేశాలకు మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే ఇంకా మంచిది.

భవిష్యత్​లో డిమాండ్ పెరిగే ప్రాంతంలో
మీ ఇంటిని కేవలం నివసించడానికి మాత్రమే కాకుండా భవిష్యత్‌లో డిమాండ్‌ ఉండే రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిగా కూడా పరిగణించినట్లయితే దాని అమ్మకపు విలువ మెరుగుపరిచేందుకు అవకాశమున్న ప్రాంతాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా ప్రైమ్‌ లోకేషన్లలో ఇల్లు అంటే అందరి ఆర్థిక పరిస్థితి అనుకూలించలేకపోవచ్చు. అందువల్ల ముఖ్యమైన ప్రాంతాలకు, శివారు ప్రదేశాలకు మధ్యస్థంగా ఉండే ఏరియాలో ఇంటిని ఎంపిక చేసుకోవడం మంచిది.

గృహ రుణం తీసుకోవాలంటే?
మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి లోన్​ తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు ప్రతి నెలా మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న వారై ఉండాలి. గృహ రుణం దీర్ఘకాలానికి సంబంధించినది కాబట్టి వయసు కూడా మధ్యస్థంగా ఉండాలి. సీనియర్‌ సిటిజన్‌ వయసు దగ్గర్లో ఉండేవారికి దాదాపు ఇంటి లోన్​ లభించే అవకాశం ఉండకపోవచ్చు. రుణ అర్హత అలాగే సహేతుకమైన వడ్డీ రేటును పొందే సామర్థ్యం ఎక్కువగా మీ క్రెడిట్​ స్కోర్​పై ఆధారపడి ఉంటుంది.

డౌన్​పేమెంట్ ఎక్కువ ఉంటే
హోమ్​ లోన్​ పొందటానికి రుణ మొత్తంలో 20% డౌన్‌ పేమెంట్‌ మీ వద్ద ఉండాలి. డౌన్​పేమెంట్‌ కోసం ముందుగానే పొదుపును ప్రారంభించడం చాలా అవసరం. డౌన్​పేమెంట్‌ శాతం ఎక్కువ ఉంటే ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. దీనివల్ల లోన్​ భారం అంతగా అనిపించదు. అదనంగా డెవలపర్‌ విధించే ఛార్జీలు, ఇంటీరియర్‌లకు అయ్యే ఖర్చులు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, అంతర్గత సంబంధిత ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.

నిపుణుల సూచనలు తీసుకోండి
ఇంటిని కొనుగోలు చేసే క్రమంలో తగిన వృత్తి నిపుణుల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం కూడా మంచిదే. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, ల్యాండ్‌ సర్వేయర్‌, హోమ్‌ ఇన్‌స్పెక్టర్‌, లాయర్‌ లాంటి వారి ద్వారా ఇటువంటి సేవలను పొందవచ్చు. వారికి ఇచ్చే ఫీజ్​లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటికి బీమా కూడా చేయించడం ఉత్తమమే.

సమయాన్ని కేటాయించండి
మార్కెట్​లో అందుబాటులో ఉన్న ప్రాపర్టీని వెంటనే కొనుగోలు చేసుకుంటే తక్కువ నాణ్యత గల ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు అనేది మీ భవిష్యత్‌ అవసరాలకు, మీరు ఊహిస్తున్న జీవనశైలితో ముడిపడి ఉన్న అంశం. అందుకే మార్కెట్​లో ఇంటి గురించి ఆప్షన్లు చాలా ఉంటాయి. ప్రస్తుతం రియల్​ ఎస్టేట్​ రంగం కూడా తీవ్రంగా పోటీ ఎదుర్కొంటుంది. కనుక సాధ్యమైనంత వరకూ ఎక్కువగా ఇంటి అన్వేషణ కోసం తిరగాల్సి ఉంటుంది.

పేరున్న డెవలపర్లను సంప్రదించండి
మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇల్లు అధిక ప్రమాణాలు, నాణ్యతతో కూడినదిగా లభించాలంటే దానికి మెరుగైన డెవలపర్లను సెర్చ్ చేసేందుకు మీరు వీలైనంత సమయాన్ని కేటాయించండి. ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు మంచి పేరున్న డెవలపర్‌ను ఎంచుకోవడం వల్ల మీరు కొనుగోలు చేసిన ఇల్లు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇంటికి నాణ్యత ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

ఇదే సరైన సమయం
భారతీయ రియల్​ ఎస్టేట్ మార్కెట్​ 2023-2028 మధ్య కాలంలో 9.2 వృద్ధి రేటును నమోదు చేస్తుందని MARC గ్రూప్​ తమ అధ్యయనంలో వెల్లడించింది. గత దశాబ్దంలో రియల్​ ఎస్టేట్ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. గేటెడ్‌ కమ్యూనిటీలు, ఎకో-ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్‌, అప్‌గ్రేడ్‌ చేసిన సౌకర్యాలు, తక్కువ వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు రియల్​ ఎస్టేట్​ మార్కెట్​లో ప్రధాన అంశాలు. ఇలాంటి మంచి పరిణామాల వల్ల ఇప్పటి కాలంలో ఇళ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అందుకే ఇంటి కొనుగోలుకు సరైన సమయం అంటే ఆర్థికంగా సానుకూలంగా ఉండటమే అని అర్థం.

రీసేల్​ విలువెంతో తెలుసుకోండి
మీరు ఇంటిపై ఇన్వెస్ట్​ చేయడానికి ముందు ముఖ్యంగా రీ సేల్‌ విలువను పరిగణించాలి. చాలా మంది ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు రీ సేల్‌ను పరిగణనలోకి తీసుకోరు. ఇల్లు అనేది ఉండడానికే కదా రీ సేల్‌తో అవసరమేముంది అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్‌ కాదు. భవిష్యత్‌లో మీ హోదా మారొచ్చు. ఆర్థికంగా మరింత మెరుగైన స్థితికి మీరు ఎదగొచ్చు. అటువంటి సందర్భంలో పాత ఇంటిని సేల్‌ చేసి కొత్త ఇంటిని కొనుగోలు చేయడమనేది తప్పు కాదు. కనుక, మీరు మొదటి ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సరైన ప్రాపర్టీని ఎంచుకోకపోతే రీ సేల్​ విషయంలో ఇబ్బందులు పడక తప్పదు.

హోమ్​ లోన్ కావాలా? ఈ టిప్స్ పాటిస్తే లక్షలు ఆదా కావడం గ్యారెంటీ!

ఫస్ట్​టైమ్​ కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.