తెలంగాణ

telangana

20ఏళ్ల తర్వాత 'విదిశా' బరిలో మామాజీ- చౌహాన్‌కు రికార్డు మెజార్టీ ఖాయమా? - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 7:22 AM IST

Vidisha Lok Sabha Polls 2024 : లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో మధ్యప్రదేశ్‌లోని విదిశ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, గతంలో విదిశా నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 20 ఏళ్ల తర్వాత మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న విదిశలో ఆ పార్టీ దిగ్గజాలు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, సుష్మా స్వరాజ్‌ గతంలో పోటీ చేసి గెలుపొందారు. ఈసారి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు రికార్డు మెజార్టీ ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

vidisha lokvidisha lok sabha polls 2024 sabha polls 2024
vidisha lok sabha polls 2024

Vidisha Lok Sabha Polls 2024 :సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా మధ్యప్రదేశ్‌లో 9 స్థానాలకు మే 7న పోలింగ్‌ జరగనుంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం విదిశా. మామాజీగా పేరుగాంచిన మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటమే అందుకు కారణం. కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ భాను శర్మ శివరాజ్‌కు ప్రత్యర్థిగా ఉన్నారు.

20 ఏళ్ల తర్వాత!
విదిశా నియోజకవర్గం 1989 నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉంది. 1989లో రాఘవ్‌ జీ ఇక్కడ నుంచి తొలిసారి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1991లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ విదిశా నుంచి జయకేతనం ఎగురవేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నిక సహా 1996, 1998, 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇక్కడ నుంచి విజయఢంకా మోగించారు. 2005లో మధ్యప్రదేశ్‌ సీఎం అయిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిశా ఎంపీగా రాజీనామా చేశారు. 2009, 2014లో విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ విదిశ నుంచి గెలుపొందారు. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిశాలో బరిలోకి దిగుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చౌహాన్​ను కాదని!
మధ్యప్రదేశ్‌ సీఎంగా ఉన్నప్పుడు మహిళల కోసం శివరాజ్‌ సింగ్‌ తీసుకొచ్చిన పథకాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా లాడ్లీ బెహనా పథకం చాలా పాపులర్‌ అయ్యింది. 2023 నవంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 230 స్థానాలకుగాను 163 చోట్ల విజయఢంకా మోగించింది. మరొకసారి మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టింది. అయితే ఎన్నికల్లో విజయం తర్వాత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కాదని మోహన్‌ యాదవ్‌ను మధ్యప్రదేశ్‌ సీఎంగా భాజపా అధిష్ఠానం నియమించింది.

మోదీ ఇప్పటికే!
అప్పట్లోనే శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. విదిశ నుంచి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గెలిస్తే ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోదీ శివరాజ్‌ సింగ్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

చౌహాన్‌కు రికార్డు మెజార్టీ ఖాయం!
మరోవైపు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పోటీగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌ భానుశర్మ 1980, 1984లో విదిశా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టడానికి మరోసారి ప్రతాప్‌ శర్మను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. అయితే విదిశాలో పోరు ఏకపక్షంగా ఉంటుందని, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రికార్డు మెజార్టీ ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2019లో విదిశా నుంచి బీజేపీ అభ్యర్థి రమాకాంత్‌ భార్గవ 5 లక్షలకుపైగా మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌చంద్ర పాటిల్‌పై గెలుపొందారు. 2014లో సుష్మాస్వరాజ్‌ విదిశా నుంచి 4 లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. విదిశాలో మొత్తం 12 లక్షల 51 వేల మంది ఓటర్లు ఉన్నారు.

జేడీఎస్​ నుంచి ప్రజ్వల్‌ రేవణ్ణ సస్పెండ్- 'ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదు' - Prajwal Revanna Sex Scandal Case

'బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు'- ఈటీవీ భారత్​తో అమిత్ షా ఎక్స్​క్లూజివ్​ - lok sabha election 2024

ABOUT THE AUTHOR

...view details